ANDHRA PRADESHOFFICIALWORLD

అటు విన్నపాలు…. ఇటు విరాళాలు, పార్టీ కార్యాలయానికి పోటెత్తిన ప్రజలు, కార్యకర్తలు

అటు విన్నపాలు…ఇటు విరాళాలు….పార్టీ కార్యాలయానికి పోటెత్తిన ప్రజలు, కార్యకర్తలు

గత ప్రభుత్వం బనాయించిన అక్రమ కేసుల నుండి విముక్తి కల్పించండి

వైసీపీ నేతలు కబ్జా చేసిన భూములు తిరిగి ఇప్పించండి

సీఎం చంద్రబాబుకు వివిధ ప్రాంతాల నుండి వచ్చి అర్జీలు ఇచ్చిన బాధితులు

రాజధాని, అన్నా క్యాంటీన్లకు పలువురు విరాళాలు అందజేత

అమరావతికి గాజులు విరాళంగా ఇచ్చిన విజయవాడకు చెందిన మాణిక్యమ్మ అనే వృద్ధురాలు

టీడీపీ సెంట్రల్ ఆఫీసులో వేల మంది ప్రజలు, కార్యకర్తల నుంచి వినతులు స్వీకరించిన సీఎం

మూడు గంటలకు పైగా నిలబడి వేల మంది సాధకబాధకాలు విన్న ముఖ్యమంత్రి

అమరావతి ఆగస్టు 3 యువతరం న్యూస్:

గత వైసీపీ ప్రభుత్వం అక్రమంగా బనాయించిన కేసుల నుండి విముక్తి కల్పించాలని, వైసీపీ నేతలు కబ్జా చేసిన భూములను తిరిగి తమకు అప్పగించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని పలువురు బాధితులు కోరారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో శనివారం ప్రజలు, కార్యకర్తల నుండి సీఎం చంద్రబాబు వినతులు స్వీకరించారు. తమ సమస్యలు చెప్పుకునేందుకు వివిధ ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున పార్టీ కార్యాలయానికి బాధితులు, ప్రజలు తరలివచ్చారు. పార్టీ కార్యాలయానికి సీఎం వస్తున్నారన్న సమాచారంతో సుమారు ఐదు వేల మందికిపైగా కార్యాలయానికి చేరుకున్నారు. మూడు గంటలకు పైగా ప్రజల్ని కలిసి సాధకబాధకాలు విన్న సీఎం సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని వారికి హామీ ఇచ్చారు. శ్రీకాకుళం జిల్లా, సారవకోట మండలం, బొంతు, మహాసింగి గ్రామస్తులు…తమకు చెందిన 47 ఎకరాల వ్యవసాయ భూమిని బొంతు గ్రామ వైసీపీ కార్యకర్తలు దౌర్జన్యంగా ఆక్రమించుకున్నారని, తిరిగి ఆ భూములు తమకు అప్పగించాలని కోరారు. దౌర్జన్యంగా భూములు ఆక్రమించుకున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. వైసీపీ నేత కిరణ్ అడిగిన ధరకు తమ భూమి విక్రయించనందుకు అక్రమ కేసులు పెట్టి వేధించారని అన్నమయ్య జిల్లా, చిట్వేలి మండలం, నగిరిపాడుకు చెందిన మాచినేని మోహన్ రావు సీఎంకు మొరపెట్టుకున్నారు. చిన్నపాటి దుకాణం పెట్టుకుని బట్టల వ్యాపారం చేస్తున్న తన భార్యను కూడా గతంలో పోలీసుల అండతో భయపెట్టారని అన్నారు. అక్రమ కేసుల నుండి తనకు విముక్తి కలిగించాలని కోరారు.

*రాజధాని, అన్నా క్యాంటీన్లకు విరాళాలు*

అమరావతి రాజధాని, అన్నా క్యాంటీన్లకు పలువురు విరాళాలు అందించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని కలిసి దాతలు చెక్కులు అందించారు. కంకిపాడుకు చెందిన రైతు ఎన్.ప్రభాకర్ రావు రూ.10 లక్షలు, విజయవాడకు చెందిన జి.వీ.మాణిక్యమ్మ అనే వృద్ధురాలు తన చేతికున్న బంగారు గాజులను రాజధాని నిర్మాణం కోసం విరాళంగా అందించారు. భగవద్గీత గ్రూపు తరుపున నిర్మల అనే వృద్ధురాలు రూ.3.42 లక్షలను విరాళంగా అందించారు. చంద్రగిరి నియోజకవర్గం, పెరుమాళ్లపల్లికి చెందిన జీవన్ కుమార్ అనే దివ్యాంగుడు రూ.25 వేలు, చిత్తూరుకు చెందిన వల్లేరు వెంకటేశ్‌ నాయుడు లక్ష రూపాయలను రాజధానికి విరాళంగా అందించారు. విజయవాడ అయ్యప్పనగర్ కు చెందిన పర్చూరి రాజబాబయ్య, కమల కుమారి అనే వృద్ధులు అన్న క్యాంటీన్ కు రూ.2 లక్షలు విరాళంగా అందించారు. వీరందరికీ సీఎం చంద్రబాబు నాయుడు అభినందనలు తెలిపారు.

Yuvatharam News

Related Articles

Back to top button
error: Content is protected !!