ANDHRA PRADESHOFFICIAL

ఉపాధిలో అంతా గోల్ మాల్……

ఉపాధిలో అంత గోల్ మాల్…

అవినీతికి ఉపాధి..

ఉపాధి అసిస్టెంట్ల అవినీతి వెలుగులోకి..

అవినీతికి పాల్పడుతున్న ఫీల్డ్ అసిస్టెంట్ లపై చర్యలు ఎక్కడ..

పనులు చేయకుండానే బోగస్‌ మస్టర్లతో డబ్బులు స్వాహా…

అమ్మకానికి సిద్ధమవుతున్న ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులు..?

దేవనకొండ జూలై 26 యువతరం న్యూస్:

పేదలకు ఉపాధి పనులు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఉపాధి హామీ పథకం అక్రమార్కులకు ఉపాధి వనరుగా మారింది.కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం జాతీయ ఉపాధి హామీ పథకాన్ని దేశవ్యాప్తంగా అమలు లోకి తీసుకు వచ్చిన సంగతి తెలిసిందే. కరువు నేపథ్యంలో ప్రతి సంవత్సరం లక్షలకు పైగా కూలీలు వివిధ ప్రాంతాలకు ఉపాధి కోసం వెళ్లిపోతున్నారని, వారికి స్థానికంగా 100 రోజులపాటు గ్యారంటీగా ఉపాధి కల్పించేందుకు కోసం జాతీయ ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చింది.ఈ చట్టం ప్రాథమికంగా పూర్తి నైపుణ్యం లేని లేదా కొద్దిపాటి నైపుణ్యము గల పనులు, దారిద్ర్య రేఖ దిగువనున్న వారికి పనులను కల్పించడం ద్వారా గ్రామీణ ప్రజల కొనుగోలు శక్తిని పెంపొందింపచేసే దిశగా ప్రవేశపెట్టబడింది. ఈ పథకం దేశంలో ధనిక, పేద వ్యత్యాసాన్ని సాధ్యమైనంతమేరకు తగ్గించేందుకు కృషి చేస్తుంది. సుమారు మూడవ వంతు పనులను స్త్రీలకు ప్రత్యేకంగా కేటాయించబడింది.దీనివలన, గ్రామీణ కూలీల వలసలు తగ్గించాలని ఈ ఉపాధి పథకాన్ని తీసుకొచ్చింది.ఈ పథకం ఉద్దేశం మంచిదే కానీ రాను రాను ఇందులో రాజకీయ ప్రమేయం అధికం కావడం తో పాటు పథకంలో ఉన్న లొసుగులను పసిగట్టి లక్షల రూపాయలు దుర్వినియోగం చేస్తున్నారు. దేవనకొండ మండలంలో ఉన్న ఫీల్డ్ అసిస్టెంట్లు గత వైసిపి ప్రభుత్వం లో ఐదేళ్ల పాలనలో అవినీతి అక్రమాలు చేశారని ప్రజల ఆరోపిస్తున్నారు. ఈమధ్య కాలంలోనే దేవనకొండ మండలంలో అధికారులు పలు గ్రామాలలో గ్రామ సభలు నిర్వహించారు. ఈ గ్రామ సభలలో కొందరు ఫీల్డ్ అసిస్టెంట్లు ఉపాధి కూలీల విషయంలో నిర్లక్ష్యం చేశారని, అక్రమ వసూళ్లకు పాల్పడ్డారని,పనులు చేయకుండానే బోగస్‌ మస్టర్లతో డబ్బులు స్వాహా చేశారని ఇలా చాలా రకాలుగా ఆరోపణలు రావడంతో ఫీల్ అసిస్టెంట్లపై చర్యలు తీసుకోవాలని ప్రజలు అధికారులను కోరారు . మండలంలో ఉన్న ఫీల్డ్ అసిస్టెంట్ల అందరిపై అధికారులు పూర్తిస్థాయిలో విచారణ చేపడితే అసలు విషయాలు బయటకు వస్తాయని మండల ప్రజలు ఆరోపిస్తున్నారు. ఉపాధి పనులకు సంబంధించి శనివారం జరిగే 18 వ విడత సామాజిక తనిఖీ ప్రజావేదిక లో అవినీతికి పాల్పడుతున్న ఫీల్డ్ అసిస్టెంట్లపై చర్యలు తీసుకుంటారో లేదో వేచి చూడాల్సిందే.
గ్రామాల్లో ఉపాధి హామీ పథకాన్ని అమలు చేయాలంటే ఫీల్డ్ అసిస్టెంట్లు కీలకము. ప్రతి గ్రామంలో 1000 నుంచి 5000 మంది దాకా ఉపాధి కూలీలకు జాబ్ కార్డులు ఉంటాయి. ఇందులో కొందరు కూలీలు వివిధ ప్రాంతాలకు వెళ్లిపోయినప్పటికీ ఫీల్డ్ అసిస్టెంట్ వారి దగ్గర జాబ్ కార్డులు తీసుకొని వివిధ మట్టి పనులు చేసినట్లు రికార్డులు తయారుచేసి డబ్బులు డ్రా చేస్తారు. ఇలా వంద రోజులు వివిధ ప్రాంతాల్లో మట్టి పనులు చేస్తారు. పనికి రాకపోయినా కూలీలకు ఎంతో కొంత డబ్బు ఇచ్చి మిగిలిన డబ్బును వారి నుంచి తీసుకొని ఫీల్డ్ అసిస్టెంట్, టెక్నికల్ అసిస్టెంట్, ఏపీఓ ఇలా కొందరితో లోపాయికారి ఒప్పందంతో డబ్బులు డ్రా చేయడం ఈ పథకం ప్రారంభమైనప్పటి నుంచి జరుగుతున్న ప్రక్రియ. చిన్నపాటి గ్రామంలో నైనా సంవత్సరానికి కోటి నుంచి రెండుకోట్ల రూపాయలు దాకా పనులు జరిగే పరిస్థితి ఉంటుంది అని ఆయా గ్రామాలకు సంబంధించిన నాయకులు చెబుతున్నారు. ఇందులో సగానికి సగం మిగులుబాటు ఉంటుంది. అయితే గడిచిన ఐదేళ్ల కాలంలో కొందరు ఫీల్డ్ అసిస్టెంట్లు లక్షల రూపాయలు సంపాదించి సొంత భూములు, ఖరీదైన వాహనాలు, ఇతర ఆస్తులను కూడగట్టడం కళ్లారా చూసిన టిడిపి నేతలు ప్రస్తుతం ఆ పోస్టులను దక్కించుకునే పనిలో నిమగ్నమైనట్లు సమాచారం. దీంతో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులే రెండు లేదా మూడు వర్గాలుగా విడిపోయి వేలం పాట పెట్టినట్లు తెలుస్తోంది.గడచిన ఎన్నికల్లో పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు పెట్టడంతో ఆ డబ్బును రాబట్టుకోవడానికి రకరకాల మార్గాలను తమ బంధువుల ద్వారా అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది. టిడిపి సంబంధించిన నాయకులే ఆయా పోస్టులను పొందడానికి భారీగా పోటీపడి రేటు రెండింతలు పెంచేస్తున్నట్లు వాపోతున్నారు. మండల కేంద్రంలోనీ ఒక గ్రామంలో ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టుల కోసం లక్ష రూపాయలు టార్గెట్ పెట్టారంటే ఈ పథకంలో ఏ మేరకు ఆదాయం వస్తుందో అర్థం అవుతుంది. గడిచిన ఐదు సంవత్సరాల్లో వైసిపి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడిన కూటమినే ప్రస్తుతం సొంత పార్టీలో జరుగుతున్న ఈ విషయంపై స్పందించి అర్హత ఉండి, పారదర్శకంగా ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులను పోస్టులను భర్తీ చేయాలని పలువురు ప్రజా సంఘాల నాయకులు కోరుతున్నారు. అయితే పార్టీలో చాలా కాలంగా పనిచేస్తున్న వారికి అవకాశం ఇవ్వాలని మండల సీనియర్ నాయకులు విజ్ఞప్తి చేస్తున్నారు. డబ్బున్న వారికే ప్రాధాన్యత ఇస్తే ఎలా అని సీనియర్ నేతలు ప్రశ్నించారు.
ఖాళీగా ఉన్న ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులు ఇతర
వాటికి నోటిఫికేషన్ ఇచ్చి రిక్రూట్మెంట్ చేయాలి. అలా కాకుండా ఈస్టానుసారంగా అధికారులు వ్యవహరిస్తున్నారనీ మండల ప్రజలలో భారీగా ఆరోపణ లు వినిపిస్తున్నాయి.

Yuvatharam News

Related Articles

Back to top button
error: Content is protected !!