ANDHRA PRADESHJOURNALISTSTATE NEWS

అక్రమ కేసులు ఎత్తివేయాలి

ఏపీయూడబ్ల్యూజే

అక్రమ కేసులు ఎత్తేయాలి
– జర్నలిస్టులపై దాడులు చేసిన కేసుల్లో దోషులను శిక్షించాలి
– డీజీపీకి ఏపీయూడబ్ల్యూజే బృందం వినతి
– సానుకూలంగా స్పందించిన డీజీపీ
అమరావతి, జులై 04:
రాష్ట్రంలో గత ఐదేళ్లుగా జర్నలిస్టులపై నమోదైన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (ఏపీయూడబ్ల్యూజే) ప్రతినిధి బృందం రాష్ట్ర డీజీపీ ద్వారకా తిరుమల రావును కోరింది. అలాగే జర్నలిస్టుల పైన, పత్రికా కార్యాలయాలపైన జరిగిన దాడుల కేసుల్లో నిందితులను వెంటనే అరెస్టు చేసి శిక్షించాలని కోరారు. గురువారం సాయంత్రం ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు ఐవీ సుబ్బారావు, ప్రధాన కార్యదర్శి చందు జనార్ధన్ ల ఆధ్వర్యంలో ప్రతినిధుల బృందం డీజీపీని తన ఛాంబర్ లో కలిసింది. ఈ సందర్భంగా డీజీపీని శాలువా కప్పి బొకే అందజేసి అభినందనలు తెలిపారు. అనంతరం అక్రమ కేసులు వ్యవహారానికి సంబంధించి వినతి పత్రం అందజేశారు. కర్నూలులో ఈనాడు కార్యాలయం పైన, అనంతపురం జిల్లాలో ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ పైన, తిరుపతిలో జర్నలిస్టులు, ఫోటోగ్రాఫర్ల పైన దాడితో పాటు రాష్ట్రంలో అనేక చోట్ల జర్నలిస్టుల పైన దాడులు చేసిన వాటికి సంబంధించిన కేసుల్లో ఇంతవరకు ఎలాంటి పురోగతి లేకపోవడం చాలా బాధాకరమని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఆ కేసుల్లో దోషులను వెంటనే అరెస్టు చేసి శిక్షించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే జర్నలిస్టుల పైన రాష్ట్రవ్యాప్తంగా అనేక అక్రమ కేసులు నమోదైన విషయాన్ని కూడా ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. విజయనగరంలో నలుగురు జర్నలిస్టులపై సమాచార శాఖ అధికారుల తప్పుడు ఫిర్యాదు మేరకు సిఐడి అక్రమంగా కేసు నమోదు చేసిందని, ఈ కేసును వెంటనే ఎత్తివేయాలని డీజీపీ దృష్టికి తీసుకెళ్లారు. సత్య సాయి, అనంతపురం, కర్నూలు, నంద్యాల, తిరుపతి, ప్రకాశం, కృష్ణ, పల్నాడు, మన్యం తదితర జిల్లాల్లో జర్నలిస్టులపై నమోదైన అక్రమ కేసుల విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. అక్రమ కేసులు అన్నిటిని అవసరమైతే పునర్విచారణ జరిపించి ఎత్తివేయాలని కోరారు. ఏపీయూడబ్ల్యూజే ప్రతినిధుల బృందం చెప్పిన విషయాలను శ్రద్ధగా విన్న డీజీపీ రాష్ట్రవ్యాప్తంగా అనేక వర్గాల పైన కూడా తప్పుడు కేసులు నమోదైన విషయాలు తన దృష్టికి తీసుకువస్తున్నారని, జర్నలిస్టులపై నమోదైన కేసులను ప్రత్యేక చొరవ తీసుకొని తప్పకుండా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. డీజీపీని కలిసిన వారిలో యూనియన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, విజయవాడ అర్బన్ యూనిట్ అధ్యక్షులు చావా రవి, ఐజేయూ జాతీయ సభ్యులు షేక్ బాబు, విజయవాడ యూనిట్ నాయకులు సురేంద్ర తదితరులు పాల్గొన్నారు.

Yuvatharam News

Related Articles

Back to top button
error: Content is protected !!