వైసీపీ దాడుల్లో తెలుగుదేశం కార్యకర్త దారుణ హత్య

బొమ్మిరెడ్డి పల్లెలో తెలుగుదేశం కార్యకర్త దారుణ హత్య
వెల్దుర్తి జూన్ 9 యువతరం న్యూస్:
కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం లోని బొమ్మిరెడ్డి పల్లె గ్రామంలో వైసీపీ దాడిలో అదే గ్రామానికి చెందిన తెలుగుదేశం కార్యకర్త గిరినాథ్ చౌదరి హత్యగావింపబడ్డాడు. ఈ దాడిలో గిరినాథ్ చౌదరి సోదరుడు కళ్యాణ్ తీవ్ర గాయాలు కాగా కర్నూల్ ప్రభుత్వ వైద్యశాలకు చికిత్స నిమిత్తం తరలించారు. సంఘటన విషయాన్ని తెలుసుకున్న కర్నూలు జిల్లా ఎస్పీ కృష్ణ కాంత్ బొమ్మిరెడ్డిపల్లి గ్రామంలో సంఘటన స్థలాన్ని సందర్శించారు. గ్రామంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. అదేవిధంగా పోస్ట్ మార్టం నిమిత్తం గిరినాథ్ చౌదరి మృతదేహాన్ని వెల్దుర్తి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. విషయం తెలుసుకున్న వెల్దుర్తి మండల, క్రిష్ణగిరి మండల తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు అభిమానులు వెల్దుర్తి ప్రభుత్వ వైద్యశాల వద్దకు మరియు బొమ్మిరెడ్డి పల్లె గ్రామానికి చేరుకున్నారు. మాజీ పత్తికొండ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీదేవి పై మృతుడి బంధువులు ఆరోపణలు గుప్పించారు. అదేవిధంగా పోలీసుల తీరుపై కూడా మృతుడి బంధువులు ఆరోపణలు గుప్పించారు.