కృష్ణా జలాల పునః పంపిణీ పై అఖిలపక్ష సమావేశం

కృష్ణా జలాల పునః పంపిణీ పై అఖిలపక్ష సమావేశం
(యువతరం అక్టోబర్ 25) ఒంగోలు ప్రతినిధి:
ఆంద్రప్రదేశ్ లో కృష్ణా జలాల పునఃపంపిణీ పై బుధవారం ఉదయం 11గంటలకు ఒంగోలులోని మల్లయ్యలింగం భవన్ హాలులో సిపిఐ ఆద్వర్యంలో అఖిలపక్షాలతో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి ప్రసంగిస్తూ ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం నీటిపారుదల ప్రాజెక్టుల విషయంలో ప్రాధాన్యత ఇవ్వడం లేదని కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలను, అక్రమాలను ఎదుర్కోలేకపోతుందని విమర్శించారు.
1956నుండి ఆంద్రప్రదేశ్ లో నీటిపారుదల ప్రాజెక్టుల కోసం ఆయా రాష్ట్ర బడ్జెట్ లలో పది శాతం పైగా కేటాయించి వినియోగిస్తే నేటి ప్రభుత్వం ఐదు శాతం లోపే కేటాయించి అందులో సగం మాత్రమే వ్యయం చేయటం విచారకరమన్నారు. ప్రకాశం జిల్లాలో వెలిగొండ ప్రాజెక్ట్ చివరి దశలో ఉన్నా అమలులోకి రాలేదని అన్నారు. గుండ్లకమ్మ ప్రాజెక్టు గేట్లు వరదకి కొట్టుకుపోయి 18నెలలు గడుస్తున్నా మరమ్మత్తులకు నోచుకోలేదన్నారు.
దాదాపు 100నదులు చిన్నవి, పెద్దవి ఉన్న ఆంద్రప్రదేశ్ అన్నపూర్ణ ఆంద్రప్రదేశ్ గా మారాలంటే నిర్మాణంలో ఉన్న సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జి.ఈశ్వరయ్య, జిల్లా కార్యదర్శి యం.ఎల్.నారాయణ, సిపిఐ (ఎంఎల్ ) న్యూ డెమోక్రసీ నేత చిట్టిపాటి వెంకటేశ్వర్లు, రైతు ఉద్యమనేత చుండూరు రంగారావు తదితరులు ప్రసంగించారు.