మా ఉద్యోగం…… మా సంతకం

మా ఉద్యోగం… మా సంతకం
ఏపీ నిరుద్యోగ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు మర్రివేముల శ్రీనివాస్
(యువతరం ఆగస్టు 12) విశాఖ ప్రతినిధి:
రాష్ట్రంలో నిరుద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ఏపీ నిరుద్యోగ పోరాట సమితి (ఏపీ ఎన్ పీ ఎస్) వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని, అందులో భాగంగా ఎన్నికల సమయంలో రాజకీయ నాయకులు చేసిన ఉద్యోగ నియామకాల వాగ్దానాలను ఏ ఒక్కటీ అమలుచేయలేదుగదా యువతను ఘోరంగా మోసం చేసిన నేతలకు *మా ఉద్యోగం- మా సంతకం* నినాదంతో రాష్ట్ర స్థాయి ఉద్యమానికి సన్నద్ధం అవుతున్నామని సమితి రాష్ట్ర అధ్యక్షుడు మర్రివేముల శ్రీనివాస్ స్పష్టం చేశారు.
శనివారం ఉదయం స్థానిక పౌరగ్రంధాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇటీవల జరిగిన రాష్ట్ర స్థాయి రౌండ్ టేబుల్ సమావేశంలో పలు అంశాలపై చర్చించామని, అందులో ప్రధానంగా ఎన్నికల సమయంలో నిరుద్యోగ యువతను ఓట్లకోసం వాడుకుంటూ తరువాత వారికి ఉపాధి అవకాశాలు చూపడంలో పాలకులు వైఫల్యం చెందుతున్నారని అన్నారు. నిరుద్యోగుల సమస్యలే పరిష్కార లక్షంగా కలిసొచ్చే రాజకీయ పార్టీలతో మమేకమై పోరాటం చేస్తామని తెలిపారు. యువత కేవలం ఓట్ల కోసం కాదని వారి హక్కుల పరిరక్షణకు సైతం ఉద్యమించడానికి చిద్దంగా ఉన్నట్టు తెలుపుతూ రాష్ట్ర స్థాయిలో అన్నీ జిల్లా ప్రధాన సెంటర్ లలో ఉద్యమాన్ని నిర్వహిస్తామని, నిరుద్యోగ ఓట్లతో నెగ్గి ప్రజాప్రతినిధులు గా ఉన్న అందరికీ విజ్ఞాపన పత్రాలు అందజేయడం జరుతుందని అన్నారు. ఏపీపీఎస్సి ఆధ్వర్యంలో ప్రముఖ కోచింగ్ సెంటర్ల ద్వారా నిరుద్యోగులకు అవగాహన సదస్సులు నిర్వహించేందుకు ప్రభుత్వం చొరవ చూపాలని, ప్రతి జిల్లా కేంద్రాల్లో ఈ సెంటర్ల ను ఏర్పాటు చేయాలని, రాష్ట్రంలో అన్నీ విశ్వవిద్యాలయాల్లో ఉన్న అధ్యాపక పోస్టులను భర్తీ చేయాలని, ప్రైవేటు రంగంలో పనిచేస్తున్న ఉద్యోగులకు ఉద్యోగ భద్రతతో పాటు వారి సంరక్షణకు ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఇంజనీరింగ్, మెడికల్ విభాగంలో ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలన్నారు.
సమావేశంలో సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలసముద్రం సూర్యం, విజయనగరం జిల్లా కార్యదర్శులు టి గౌరీశంకర్,కె శ్రీనివాసరావు, విశాఖ జిల్లా అధ్యక్షులు పి గిరిధర్, అనకాపల్లి జిల్లా అధ్యక్షులు బి రమణ తదితరులు పాల్గొన్నారు.