AGRICULTUREANDHRA PRADESHOFFICIALSTATE NEWS

111 మంది రైతులకు డీ-నోటిఫై పత్రాలు – కలెక్టర్ చేతుల మీదుగా పంపిణీ

నంద్యాలలో ప్రత్యేక డ్రైవ్ ఫలితం

111 మంది రైతులకు డీ-నోటిఫై పత్రాలు – కలెక్టర్ చేతుల మీదుగా పంపిణీ

దీర్ఘకాల భూ సమస్యలకు పరిష్కారం

నంద్యాలలో ప్రత్యేక డ్రైవ్ ఫలితం

చుక్కల, 22ఏ భూముల సమస్యలకు క్లియర్ గ్రీన్ సిగ్నల్

‘మీ భూమి – మీ హక్కు’ లక్ష్యంతో ముందుకు జిల్లా యంత్రాంగం

ప్రతి 15 రోజులకు భూ సమస్యల పరిష్కారం – కలెక్టర్ హామీ

పారదర్శకంగా డీ-నోటిఫికేషన్ ప్రక్రియ

రైతుల సమస్యలకు తక్షణ పరిష్కారం – జిల్లా పరిపాలనకు ప్రజల ప్రశంసలు

నంద్యాల ప్రతినిధి ఏప్రిల్ 11 యువతరం న్యూస్:

జిల్లాలో సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న చుక్కల భూములు, 22ఏ-1 నిషేధిత జాబితా భూములకు సంబంధించిన సమస్యలను పరిష్కరిస్తూ 111 మంది రైతులకు డీ-నోటిఫికేషన్ క్లియరెన్స్ పత్రాలను అందజేసినట్లు జిల్లా కలెక్టర్ శ్రీమతి జి. రాజకుమారి తెలిపారు. శనివారం కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ హాల్‌లో నిర్వహించిన కార్యక్రమంలో రైతులకు ఈ పత్రాలను పంపిణీ చేశారు. జాయింట్ కలెక్టర్ కొల్లాబత్తుల కార్తీక్, డిఆర్ఓ రాము నాయక్, ఆర్డీఓలు,  మండల తాసిల్దార్ లు, రైతులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ చుక్కల భూములు, 22 ఏ1 భూములు నిషేధిత జాబితాలో వుండి దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న భూ సమస్యలను పరిష్కరించి 111 మంది రైతులకు డీనోటిఫై చేసిన క్లియరెన్స్ పత్రాలు అందజేస్తున్నామన్నారు. జిల్లాలో ప్రతి సోమవారం నిర్వహించే గ్రీవెన్స్ కార్యక్రమానికి సుమారు 400 మంది ప్రజలు హాజరవుతుండగా, అందులో 90 శాతం సమస్యలు భూములకు సంబంధించినవేనని తెలిపారు. ముఖ్యంగా ఆన్‌లైన్ రికార్డుల్లో పేర్లు నమోదు కాకపోవడం, తప్పుగా ఇతరుల పేర్లు నమోదు కావడం వంటి సమస్యలు ఎక్కువగా ఉన్నాయని పేర్కొన్నారు. తహసీల్దార్‌లు రికార్డింగ్ అధికారులుగా మాత్రమే వ్యవహరిస్తారని, భూమి యాజమాన్యాన్ని నిర్ణయించే అధికారం వారికి లేదని స్పష్టం చేశారు. నమోదైన డాక్యుమెంట్లు, భూమిపై ఉన్న అనుభవం (పొజెషన్) ఆధారంగా నిజమైన హక్కుదారుల పేర్లను రెవెన్యూ రికార్డుల్లో నమోదు చేయడం వారి బాధ్యత అని వివరించారు.

జిల్లాలో భూవివాదాలకు ప్రధాన కారణాలు కుటుంబ తగాదాలు, ప్రభుత్వ భూములపై అక్రమ క్రయవిక్రయాలు అని కలెక్టర్ పేర్కొన్నారు. అసైన్డ్ భూములను అక్రమంగా కొనుగోలు చేయడం, అమ్మడం వంటి చర్యలపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోందని, ఇప్పటికే బనగానపల్లిలో జరిగిన ఇలాంటి అక్రమ విక్రయాలను రద్దు చేసినట్లు తెలిపారు. వాగులు, వంకలు, చెరువులు వంటి ప్రకృతి వనరులు సామాజిక ఆస్తి అని, వాటిని ఆక్రమించకుండా సంరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. భవిష్యత్ తరాలకు మంచి వనరులు అందించాలంటే ఇవి రక్షించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. రెవెన్యూ నిర్ణయాలపై అసంతృప్తి ఉన్న వారు తహసీల్దార్ స్థాయి తర్వాత ఆర్డీవోకు అప్పీల్ చేసుకోవచ్చని, అనంతరం జాయింట్ కలెక్టర్ వద్ద రివిజన్ పిటిషన్ వేయవచ్చని, చివరికి హైకోర్టును ఆశ్రయించే అవకాశమూ ఉందని తెలిపారు.

చుక్కల భూముల సమస్యకు చారిత్రక నేపథ్యం బ్రిటీష్ కాలంలో సర్వే సమయంలో పట్టాదారు వివరాలు లేని భూములకు ‘చుక్కలు’ గుర్తులు పెట్టడం వల్ల ఈ సమస్యలు ఉత్పన్నమయ్యాయని కలెక్టర్ వివరించారు. ఈ భూములను క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వం 2017లో డాటెడ్ ల్యాండ్స్ రెగ్యులరైజేషన్ చట్టాన్ని తీసుకువచ్చిందని తెలిపారు. ఈ చట్టం ప్రకారం 2005కు ముందు నుంచి సాగులో ఉన్న లేదా అధీనంలో ఉన్న భూములను గుర్తించి అర్హులకు పట్టాదారు హక్కులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. జిల్లా స్థాయిలో కలెక్టర్ అధ్యక్షతన ప్రత్యేక కమిటీ ఈ ప్రక్రియను పర్యవేక్షిస్తోందని వివరించారు.

పెండింగ్ కేసులకు వేగవంత పరిష్కారం

జిల్లాలో సుమారు 150 దరఖాస్తులు పెండింగ్‌లో ఉండగా, అందులో 111 కేసులను పరిశీలించి ఆమోదించినట్లు తెలిపారు. మరో 280 ఫైళ్లను త్వరితగతిన పరిష్కరించేందుకు అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు. ఒకే సర్వే నంబరులో ఉన్న భూములను సబ్‌డివిజన్ చేసి సమస్యలను పరిష్కరిస్తున్నామని తెలిపారు. మ్యుటేషన్ ప్రక్రియను వేగవంతం చేస్తూ వీఆర్వో లాగిన్‌లో అప్లోడ్ అయిన దరఖాస్తులను తహసీల్దార్ స్థాయిలో త్వరితంగా పరిష్కరిస్తున్నామని పేర్కొన్నారు. మొత్తం 29 వేల ఎకరాలకు సంబంధించిన 26 వేల మంది పట్టాదారుల సమస్యలను పరిష్కరించడం లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. ప్రతి 15 రోజులకు ఒకసారి ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించి పెండింగ్ కేసులను క్లియర్ చేయాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. కొన్ని దరఖాస్తులు వాగు పోరంబోకు భూములు ఆక్రమించడం, కోర్టు వివాదాలు ఉండడం వంటి కారణాలతో తిరస్కరించినట్లు చెప్పారు.

పారదర్శకత – అవినీతి నిరోధం

డీ-నోటిఫికేషన్ ప్రక్రియలో ఎవరైనా డబ్బులు అడిగితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పీజీఆర్‌ఎస్ ద్వారా ఫిర్యాదు చేయాలని ప్రజలకు సూచించారు. మొత్తం ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించిన తర్వాతే ఆదేశాలు జారీ చేస్తున్నామని స్పష్టం చేశారు.

రైతుల సంతృప్తి

ఒక రైతు తన 49 ఎకరాల భూమి సమస్యను కేవలం 6 నెలల్లో పరిష్కరించుకున్నట్లు పేర్కొంటూ, సాధారణంగా సంవత్సరాలు పట్టే సమస్యలు త్వరితగతిన పరిష్కారం కావడం పట్ల సంతోషం వ్యక్తం చేసినట్లు తెలిపారు.

భవిష్యత్ లక్ష్యాలు

మిగిలిన కేసులను వచ్చే రెండు నెలల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, ఖరీఫ్ సీజన్ నాటికి రైతులు తమ భూములపై పూర్తి హక్కులు పొందేలా చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న రీ-సర్వే కార్యక్రమం ద్వారా ప్రతి రైతుకు “మీ భూమి – మీ హక్కు” కింద స్పష్టమైన పత్రాలు అందజేయడం లక్ష్యమని పేర్కొన్నారు. పాస్ పుస్తకాలలో తప్పులు ఉంటే సవరణ మాడ్యూల్ ద్వారా సరిదిద్ది రైతులకు అందజేస్తామని హామీ ఇచ్చారు.

అనంతరం 111 మంది రైతులకు కలెక్టర్ చేతుల మీదుగా డీ-నోటిఫై పత్రాలు అందచేశారు.

YUVATHARAM NEWS

Related Articles

Back to top button
error: Content is protected !!