

అంబరాన్నంటిన సంక్రాంతి సంబరాలు
కడశిల్ప గ్రామంలో థింసా నృత్యాల సందడి
చింతపల్లి జనవరి 16 యువతరం న్యూస్:
అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. మండలంలోని కొత్తపాలెం పంచాయతీ కడశిల్ప గ్రామంలో భోగి, సంక్రాంతి, కనుమ వేడుకలను గ్రామస్తులు అత్యంత వైభవంగా,సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. భోగి రోజు తెల్లవారు జాము నుంచే కడశిల్ప గ్రామంలో పండుగ వాతావరణం నెలకొనగా, వీధులన్నింటినీ రంగవల్లులతో అలంకరించి భోగి మంటలు వేసి పాత వెలుగులకు వీడ్కోలు పలుకుతూ కొత్త వెలుగులకు ఆహ్వానం పలుకుతూ పండగ వాతావరణనీ మొదలుపెట్టారు ఈ సందర్భంగా గిరిజన సాంప్రదాయ నృత్యమైన థింసా వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. డప్పు, సౌండ్ బాక్స్ వాయిద్యాల దరువుకు అనుగుణంగా గ్రామస్తులంతా అడుగులు వేస్తూ, ఆటపాటలతో అల్లాడించారు. మన్యం సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా సాగిన ఈ వేడుకల్లో గ్రామస్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు. గ్రామస్తులంతా ఏకమై, ఎటువంటి భేదభావాలు లేకుండా స్వచ్ఛందంగా ఈ సంబరాల్లో పాలుపంచుకోవడం విశేషం. గిరిజన ఆచారాల ప్రకారం పూజలు నిర్వహించి, ఆత్మీయ అనురాగాల మధ్య పండుగను జరుపుకున్నారు. ఏజెన్సీ ప్రాంతపు సహజ సిద్ధమైన అందాల మధ్య, థింసా నృత్యాల హోరుతో కడశిల్ప గ్రామం సంక్రాంతి శోభతో కళకళలాడింది.



