కూటమి ప్రభుత్వం తోనే రాష్ట్ర సమగ్ర అభివృద్ధి సాధ్యం

కూటమి ప్రభుత్వం తోనే రాష్ట్ర సమగ్ర అభివృద్ధి సాధ్యం
రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య మరియు ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి. భరత్
కర్నూలు ప్రతినిధి డిసెంబర్ 13 యువతరం న్యూస్:
కూటమి ప్రభుత్వంలోనే రాష్ట్రం అన్ని రంగాల్లో వేగవంతమైన, సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య మరియు ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రివర్యులు టి.జి.భరత్ స్పష్టం చేశారు. ఈ దేవదాయ శాఖ పరిపాలన భవన సముదాయం నిర్మాణానికి సుమారు రూ.5 కోట్ల నిధులు కేటాయించి పనులను పూర్తి చేయడం జరిగిందని తెలిపారు. గత ప్రభుత్వ కాలంలో కేవలం పునాది వేసి పిల్లర్ స్థాయిలోనే నిలిచిపోయిన నిర్మాణాలను, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రత్యేక శ్రద్ధ తీసుకుని నిధులు మంజూరు చేసి పూర్తి చేసి ప్రారంభోత్సవాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. దేవాదాయ శాఖ మంత్రివర్యులుగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆనం రామ నారాయణరెడ్డి పరిపాలనలో సుదీర్ఘ అనుభవం కలిగిన నాయకుడని, అన్ని శాఖలపై అవగాహనతో వ్యవహరించే వ్యక్తి దేవాదాయ శాఖ మంత్రిగా ఉండటం రాష్ట్రానికి ఎంతో మేలు చేస్తుందని మంత్రి టి.జి. భరత్ ప్రశంసించారు. రాష్ట్రవ్యాప్తంగా దేవాదాయ శాఖకు సంబంధించిన సుమారు నాలుగు లక్షల ఎకరాల భూమి ఉందని, వాటిని క్రమబద్ధీకరించి సమర్థవంతంగా వినియోగించడంతో పాటు టూరిజం అభివృద్ధి, చారిత్రక ప్రాధాన్యత కలిగిన దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ఈ చర్యల ద్వారా భక్తుల సౌకర్యాలు మెరుగుపడడమే కాకుండా స్థానికము గా ఆర్థికాభివృద్ధి కూడా జరుగుతుందని పేర్కొన్నారు. ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఎన్డీఏ ప్రభుత్వం, ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు దూరదృష్టి గల నాయకత్వంలోనే సాధ్యమవుతున్నాయని అన్నారు. ప్రజల సంక్షేమం, రాష్ట్ర పురోగతిని లక్ష్యంగా పెట్టుకున్న ఈ ప్రభుత్వాన్ని ప్రజలు గుర్తించి మద్దతు ఇవ్వాలని మంత్రి సూచించారు. పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణం ఉన్న ప్రదేశంగా విశాఖపట్నం వేగంగా ఎదుగుతోందని అన్నారు. అలాగే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని స్పష్టం చేశారు. అనంతపురం నుంచి కర్నూలు జిల్లా వరకు ఇండస్ట్రియల్ కారిడార్ అభివృద్ధి, లేపాక్షి ప్రాంతంలో డిఫెన్స్, స్పేస్, స్టీల్ రంగాలకు సంబంధించిన ప్రత్యేక కారిడార్‌ల అభివృద్ధి ద్వారా ఉపాధి అవకాశాలు పెంపొందించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి ప్రాంతం అభివృద్ధి చెందేలా సమగ్ర ప్రణాళికతో ముందుకు సాగుతున్న కూటమి ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే దిశగా నిరంతరం పని చేస్తోందని మంత్రి టి.జి. భరత్ అన్నారు. ఈ సందర్భంగా పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాతనే దేవదాయ శాఖకు సంబంధించిన ధార్మిక భవనం పూర్తిస్థాయిలో నిర్మాణం పూర్తయిందని తెలిపారు. రాయలసీమకు తలమానికంగా నిలిచే విధంగా ఈ నూతన కార్యాలయాన్ని అత్యంత ఆహ్లాదకరమైన వాతావరణంలో ఏర్పాటు చేయడం జరిగిందని పేర్కొన్నారు. దేవదాయ శాఖకు సంబంధించిన అధికారులు, సిబ్బంది సమర్థవంతంగా ప్రజలకు సేవలు అందించేందుకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలతో ఈ కార్యాలయాన్ని రూపొందించారని, ఇది భవిష్యత్తులో శాఖ పనితీరును మరింత మెరుగుపరచడంలో కీలకంగా నిలుస్తుందని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆలయాల అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ, దూప నైవేద్య దేవాలయాలకు సంవత్సరానికి రూ.12 వేల ఆర్థిక సహాయం అందిస్తున్నామని తెలిపారు. దీని ద్వారా చిన్న ఆలయాలు కూడా ఆర్థికంగా బలోపేతం అవుతూ, నిత్య పూజలు, కైంకర్యాలు నిరంతరంగా నిర్వహించుకునే పరిస్థితి ఏర్పడిందని వివరించారు. దేవదాయ శాఖ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ, ఆలయాల సంరక్షణ, సంప్రదాయాల పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ప్రస్తుతం దేవదాయ శాఖ మంత్రిగా ఆనం రామ నారాయణరెడ్డి లాంటి అనుభవజ్ఞుడిని నియమించడం ఎంతో సంతోషకరమైన విషయమని, పరిపాలనలో సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన దేవదాయ శాఖ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారని కొనియాడారు. దేవదాయ శాఖ అభివృద్ధి, ఆలయాల పరిరక్షణ, సంప్రదాయాల కొనసాగింపే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతుందని, ఈ నూతన ధార్మిక భవనం రాయలసీమ ప్రాంత ప్రజలకు, ఆలయాల పరిపాలనకు ఒక మైలురాయిగా నిలుస్తుందని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ హరి జవహార్ లాల్ , కమిషనర్ రామచంద్ర మోహన్ , రీజనల్ జాయింట్ కమిషనర్ ఆజాద్, డిప్యూటీ కమిషనర్ గురు ప్రసాద్ , సూపరిండెంట్ ఇంజనీర్ సతీష్ ,అసిస్టెంట్ కమిషనర్ సుధాకర్ రెడ్ది , మద్దిలేటి స్వామి ఈవో రామాంజనేయులు , మహానంది , ఉరుకుందు ఈరన్న మొదలగు దేవాలయాల ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు , ఇంజనీర్లు సిబ్బంది హాజరయ్యారు.



