ప్రకృతి వ్యవసాయ విజయగాథ
మొంథా తుఫాన్లో నిలిచిన ముర్తుజా బాషా ప్రకృతి సాగు శక్తి


ప్రకృతి వ్యవసాయ విజయగాథ
తుఫాన్‌ను తట్టుకున్న ప్రకృతి పంట
ప్రకృతి వ్యవసాయం తో మళ్ళీ జీవం పోసుకున్న నేల తల్లి
మొంథా తుఫాన్లో నిలిచిన ముర్తుజా బాషా ప్రకృతి సాగు శక్తి
నంద్యాల ప్రతినిధి డిసెంబర్ 1 యువతరం న్యూస్:
నంద్యాల జిల్లా, ఆత్మకూరు డివిజన్, వెలుగోడు మండలం, గుంతకందాల గ్రామానికి చెందిన 52 ఏళ్ల రైతు ముర్తుజా బాషా జీవితం ప్రకృతి వ్యవసాయంతో పూర్తిగా మారిపోయింది. ఎక్కువ ఖర్చులు, తక్కువ లాభాలు, మట్టి శక్తి తగ్గిపోవడం… ఇలా ఎన్నో సమస్యలతో బెదిరిపోయిన ఆయనకు ప్రకృతి వ్యవసాయం కొత్త ఆశను ఇచ్చింది. ఇదే సమయంలో 2025లో వచ్చిన మొంథా తుఫాన్, బాషా పొలానికి ఒక పెద్ద పరీక్ష. తుఫాన్ తర్వాత, ప్రకృతి వ్యవసాయం ఎంత శక్తివంతమో అందరికీ బలంగా అర్థమయ్యేలా చేసింది.
ప్రకృతి వ్యవసాయానికి మార్పు ఒక్క నిర్ణయం మార్గం మార్చింది (2021):
దాదాపు పదేళ్లకు పైగా బాషా గారు రసాయన వ్యవసాయం చేశారు. ప్రతి సంవత్సరం ఎరువులు, పురుగుమందులు, కూలీ ఖర్చు పెరిగే కొద్దీ లాభాలు తగ్గిపోయాయి. నేల గట్టిపడిపోయింది, నీటిని పీల్చుకోని స్థితికి చేరింది, పురుగుల సమస్యలు తీవ్రంగా పెరిగాయి. 2019లో భారీ నష్టంతో ఆయన పూర్తిగా విసిగిపోయిన సమయంలో,ఐ సి ఆర్ పి శ్రీనివాసులు ఆయనను కలుసుకుని ప్రకృతి వ్యవసాయం వైపు వెళ్లమని ప్రోత్సహించారు. నేలను ప్రకృతి మార్గంలో ఆరోగ్యవంతం చేస్తే పంట అదే బలపడుతుందని వివరించారు. మొదట బాషా గారు కొంత భాగంలో మాత్రమే ద్రవ జీవామృతం, నీమాస్త్రం వాడుతూ ట్రయల్ చేశారు. చిన్నచిన్న మార్పులు వెంటనే కనిపించాయి పురుగులు తగ్గడం, మట్టి మెత్తగా మారడం, తక్కువ ఖర్చుతో పంట నిలబడడం మొదలయ్యాయి. అప్పుడు ఆయన నిర్ణయించుకున్నారు: “రసాయనాలు మట్టిని నాశనం చేస్తున్నాయి… మరి ఇంకో సీజన్ కూడా ఎందుకు కొనసాగించాలి?”
2021 – ప్రకృతి వ్యవసాయానికి పూర్తి మార్పు:
2021లో బాషా రసాయనాలను పూర్తిగా ఆపి, 1 ఎకరా పొలంలో 100 శాతం ప్రకృతి సాగునే ప్రారంభించారు. మట్టిలో జీవక్రియ పెంచడానికి ద్రవ జీవామృతం, మట్టి నిర్మాణాన్ని మెరుగుపరచడానికి ఘన జీవామృతం, సహజ పురుగు నియంత్రణకు నీమాస్త్రం, మొక్క పెరుగుదలకు దశపర్ణి కషాయం వాడడం మొదలుపెట్టారు. అత్యంత ముఖ్యమైన మార్పు మాత్రం పి ఎం డి ఎస్ పద్ధతి. పంట వేసేముందు 25 రకాల గింజలను పొలంలో వెదజల్లారు పప్పుధాన్యాలు, కూరగాయలు, ఆకుకూరలు, నూనెగింజలు, వేరుశనగలు, శనగలు మొదలైనవి. ఇవి మట్టికి నిరంతర జీవగుణం, తేమ నిలుపుదల, ఎరువుల్లాంటి పచ్చపదార్థం, రూట్ ఛానెల్స్ పెరుగుదల, పురుగు నియంత్రణ మరియు సూక్ష్మజీవుల పెరుగుదలను అందిస్తాయి. నెలల్లోనే మార్పు స్పష్టమైంది- మట్టి మళ్లీ జీవంతో నిండిపోయింది, పురుగులు తగ్గాయి, నీరు సులభంగా ఇంకిపోతోంది.
“ఎరువులతో కాదు… జీవంతో సాగిస్తున్నాను” — బాషా సందేశం:
ముర్తుజా బాషా మాట్లాడుతూ… గతంలో నేను ఎరువులతో వ్యవసాయం చేసేవాడిని. ఇప్పుడు మట్టి జీవంతో నిండిపోయింది. ప్రకృతి వ్యవసాయం నాకు మళ్లీ నమ్మకం ఇచ్చింది” అని తెలిపారు.
ప్రకృతి వ్యవసాయం – రైతులకు మార్గదీపం:
ముర్తుజా బాషా విజయం గ్రామంలోని ఇతర రైతులకు ఆదర్శంగా మారింది. తక్కువ ఖర్చుతో, మట్టిని బలపరిచే ప్రకృతి పద్ధతులు తీవ్ర వాతావరణ మార్పుల్లో కూడా పంటను రక్షించగలవని ఆయన నిరూపించారు.



