BREAKING NEWS: కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం:ఎమ్మిగనూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం: కర్ణాటకకు చెందిన ఐదుగురు దుర్మరణం


ఎమ్మిగనూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం: కర్ణాటకకు చెందిన ఐదుగురు దుర్మరణం
– మృతుల్లో ఇద్దరు చిన్నారులు.. నుజ్జునుజ్జయిన కారు
– క్రేన్ సహాయంతో మృతదేహాలను వెలికితీసిన పోలీసులు
– కర్ణాటకలోని కోలార్ జిల్లా వాసులుగా గుర్తింపు
ఎమ్మిగనూరు/కోటేకల్ ప్రతినిధి నవంబర్ 29 యువతరం న్యూస్:
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలంలో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మండలంలోని కోటేకల్ సమీపంలో రెండు కార్లు పరస్పరం ఢీకొన్న ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉండటం స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.
వివరాల్లోకి వెళ్తే..
కర్ణాటక రాష్ట్రం కోలార్ జిల్లా, బంగారు పేట మండలం, చిక్కహోసళ్ళి గ్రామానికి చెందిన ఒక కుటుంబం కారులో ప్రయాణిస్తుండగా, ఎమ్మిగనూరు మండలం కోటేకల్ వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న మరో కారు బలంగా ఢీకొంది. ఈ ప్రమాద తీవ్రతకు కారు నుజ్జునుజ్జు అయ్యింది. కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కారులో ఇరుక్కున్న మృతదేహాలను వెలికి తీయడానికి పోలీసులు క్రేన్‌ను రప్పించాల్సి వచ్చింది.
మృతుల వివరాలు:
ఈ ప్రమాదంలో మరణించిన వారిని వెంకటేశప్ప (76), సతీశ్ కుమార్ (34), మీనాక్షి (32), బణీత్ గౌడ (5), రిత్విక్ (4) గా గుర్తించారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారిగా తెలుస్తోంది. చిన్న పిల్లలు విగతజీవులుగా మారడం చూసి స్థానికులు కంటతడి పెట్టారు.
క్షతగాత్రులకు చికిత్స:
ఈ ప్రమాదంలో కారు డ్రైవర్ మరియు మరో వృద్ధురాలు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు



