ANDHRA PRADESHOFFICIALWORLD

కూటమి ప్రభుత్వానికి ప్రజా సంక్షేమమే పరమావధి

పెద్దన్నవారిపల్లె ప్రజావేదిక సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు

కూటమి ప్రభుత్వానికి ప్రజా సంక్షేమమే పరమావధి

ఇప్పటి వరకు పింఛన్లకు రూ.50,764 కోట్లు వ్యయం

పెద్దన్నవారిపల్లె ప్రజావేదిక సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు

కాశిబుగ్గ తొక్కిసలాట దుర్ఘటనపై ముఖ్యమంత్రి విచారం

సభలో 2 నిముషాల పాటు మౌనం పాటించి మృతులకు సంతాపం

అనంతపురం ప్రతినిధి నవంబర్ 01 యువతరం న్యూస్:

ప్రజా సంక్షేమమే పరమావధిగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని సుస్థిర ప్రభుత్వంతోనే సుపరిపాలన, అభివృద్ధి సాధ్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. గత పాలకుల్లా ఇంట్లో కూర్చుని బటన్ నొక్కే అవకాశం ఉన్నా.. ప్రజా నాయకుడిగా ప్రజల్లో ఉండేందుకే ప్రతీ నెలా స్వయంగా వచ్చి పెన్షన్లు పంపిణీ చేస్తున్నామని అన్నారు. ప్రజల మధ్య ఉండే మనిషిగా పరదాలు కట్టుకుని పర్యటనలు చేయడం తమకు రాదని ఆయన స్పష్టం చేశారు. సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గంలోని పెద్దన్నవారిపల్లి లో ముఖ్యమంత్రి పేదల సేవలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ప్రజావేదిక సభకు హాజరై ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. 94 శాతం స్ట్రైక్ రేట్ తో ప్రజలు గెలిపించిన కూటమి ప్రభుత్వం వారి సంక్షేమానికే పెద్దపీట వేస్తూ సుపరిపాలన అందిస్తోందని అన్నారు. గత పాలకులు ఒక్క పెన్షన్ ఇవ్వడానికే 2.65 లక్షల మంది వాలంటీర్లను పెట్టుకున్నారని, వారి కంటే మెరుగ్గా ఇప్పుడు మూడు గంటల్లోనే పెన్షన్ అందజేస్తున్నామని అన్నారు. గతంలో హెలికాప్టర్ లో వెళ్తూ కింద చెట్లు నరికేసిన పరిస్థితి ఉండేదని, ఇప్పడా పరిస్థితి లేదని అన్నారు. అప్పటి పాలనకు, ఇప్పటికీ ప్రజలు తేడా గమనించాలని అన్నారు. అభివృద్ది అజెండాతో పనిచేస్తున్న బీజేపీ ప్రభుత్వం గత 25 ఏళ్లుగా గుజరాత్ లో అధికారంలో ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని గత పాలకులు ధ్వంసం చేశారని అన్నారు. ఇప్పుడు మళ్లీ చేసిన వాటినే మొదలు పెట్టాల్సి వస్తోందని వ్యాఖ్యానించారు. అభివృద్ధి చేసిన పనులు ధ్వంసం అయితే మళ్లీ వాటినే పునరుద్ధరించటం కష్టతరం అవుతుందని..ప్రజలంతా ఆలోచించి ప్రభుత్వానికి సహకరిస్తేనే శాశ్వతంగా మంచి జరుగుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.

పింఛన్లపై చేసిన వ్యయం దేశంలోనే అతిపెద్ద డీబీటీ

“మనదేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇంత పెద్ద మొత్తంలో పింఛను ఇవ్వడం లేదు. పింఛన్ల పంపిణీ బాధ్యతగా చేపట్టాం. వయోవృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, చేనేతలు, గీత కార్మికులు… ఇలా 28 వర్గాలకు పింఛన్ అందిస్తూ న్యాయం చేస్తున్నాం. ఇందుకోసం ఏడాదికి రూ.33 వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం. కూటమి ప్రభుత్వం వచ్చాక ఇప్పటి వరకు పింఛన్లపై రూ.50,764 కోట్లు ఖర్చు చేశాం. ఇది దేశంలోనే ఒక రికార్డు. ఇందులో ఒక్క మహిళలకే 59 శాతం అంటే రూ.29,951 కోట్లు పింఛన్లు అందిస్తున్నాము. రాష్ట్రంలో 4.93 కోట్ల మంది జనాభా ఉంటే…అందులో 13 శాత మందికి పెన్షన్లు ఇస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. గత ప్రభుత్వంలో వృద్ధాప్య పింఛనుదారు చనిపోతే అతని భార్యకు వితంతు పింఛను ఇవ్వలేదు. కూటమి ప్రభుత్వం వచ్చాక వెంటనే మంజూరు చేస్తోంది. ఈ నెలలోనే కొత్తగా 8,151 మందికి వితంతు పింఛన్లు ఇస్తున్నాం. 2 నెలలుగా పింఛను తీసుకోని 1,55,398 మందికి రూ.127 కోట్లు, 3 నెలలుగా పెన్షన్ తీసుకోని 13,026 మందికి రూ.16 కోట్లు విడుదల చేశాం” అని సీఎం చంద్రబాబు తెలిపారు.

టెక్నాలజీతో తుఫానును నష్టాన్ని గణనీయంగా తగ్గించాం

“టెక్నాలజీ సాయంతో తుఫాను నష్టాన్ని గణనీయంగా తగ్గించాం. ముందస్తుగా హెచ్చరికలు జారీ చేయగలిగాం. మొంథా తుపాను కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా రూ.5,244 కోట్ల ఆస్తి నష్టం జరిగిందని ప్రాథమికంగా అంచనా వేశాం. ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజా ప్రతినిధులు క్షేత్రస్థాయిలో సేవలు అందించారు. ప్రభుత్వ యంత్రాంగం సమర్థవంతంగా పనిచేసింది. చీఫ్ సెక్రటరీ నుంచి క్షేత్రస్థాయిలో ఉన్న సిబ్బంది వరకూ తుఫానుపై ప్రజలను అప్రమత్తం చేశారు. విపత్తుపై ముందుగానే ప్రజలను హెచ్చరించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. నేను, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఐటీ మంత్రి లోకేష్ లు ఆర్టీజీఎస్ ద్వారా క్షేత్రస్థాయికి ఎప్పటికప్పుడు ఆదేశాలు ఇచ్చి అప్రమత్తం చేశాం. తుపాను వల్ల జరిగిన నష్టం తాలూకు ప్రాథమిక అంచనాలను కేంద్రానికి నివేదిక రూపంగా పంపించాం. “అని ముఖ్యమంత్రి తెలిపారు.

కాశీబుగ్గ దుర్ఘటన అత్యంత బాధాకరం

“శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో జరిగిన తొక్కిసలాట ఘటన కలచి వేసింది. తొక్కిసలాట ఘటనలో 9 మంది మరణించడం బాధను కలిగించింది. మొంథా తుపాను వల్ల ప్రాణనష్టం కలగకుండా పటిష్ట చర్యలు తీసుకున్నాం. కానీ కొందరు ప్రైవేటు వ్యక్తుల నిర్లక్ష్యం వల్ల ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. ఆలయ నిర్వాహకుడు ముందుగానే సమాచారం ఇచ్చి ఉంటే పోలీసులు పటిష్ట చర్యలు తీసుకునేవారు. తొక్కిసలాటకు కారణమైన వారిని కస్టడీలోకి తీసుకొని విచారిస్తాం. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటాం” అని సీఎం అన్నారు. ప్రజావేదిక సభ ఆరంభం అవుతూనే ఈ ఘటనపై రెండు నిముషాలు మౌనం పాటించాలని ప్రకటించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సహా బహిరంగ సభకు హాజరైన ప్రజలంతా మృతులకు సంతాపంగా లేచి నిల్చుని మౌనం పాటించారు.

ఫేక్ పార్టీతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

“అభివృద్ధి ,సంక్షేమంలో రాష్ట్రం ముందుకు వెళ్తుంటే ఫేక్ పార్టీ తప్పుడు ప్రచారం చేస్తోంది. వారి జీవితమే ఫేక్. మనం పులివెందులకు కూడా నీరిస్తే వారు గొడ్డలి వేటుతో రక్తపాతం సృషించారు. నాడు సొంత బాబాయిని గొడ్డలితో చంపి సీఎంగా ఉన్న నాపై నేరం నెట్టేశారు. వివేకా కుమార్తె ఫిర్యాదు చేసిన తర్వాత అప్పుడు గొడ్డలి పోటని ప్లేటు ఫిరాయించారు. అలాంటి వాళ్లకు రాజకీయాలు చేసేందుకు అర్హత ఉందా.? అసలు వారికి రాజకీయ పార్టీగా ఉండే అర్హత ఉందా.? రాయలసీమ ఫ్యాక్షన్ ను, హైదరాబాద్ లో మత విద్వేషాలు, నక్సల్స్ సమస్యనూ అణచి వేశాను. అందుకే అలిపిరిలో నాపై క్లైమోర్ మైన్స్ పేల్చారు. ప్రజల ప్రయోజనాలకు నష్టం జరుగుతుందని అనుకుంటే ఎంతటి వారినైనా ఢీ కొంటానని ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరించారు. కర్నూలులో బస్సు ప్రమాదం జరిగినా నీచంగా శవ రాజకీయం చేశారు. బైక్ పై వెళ్లిన వ్యక్తి బెల్ట్ షాపులో కల్తీ మద్యం తాగడం వల్లనే ప్రమాదం జరిగిందని సాక్షి పేపర్, చానల్లో ప్రచారం చేశారు. ఆంధ్రప్రదేశ్ కు చెందిన వ్యక్తి ఒడిశాలో బస్సు రిజిస్ట్రేషన్ చేసి హైదరాబాద్ నుంచి బెంగుళూరు మధ్య నడుపుతున్నారు. ఏపీలో ప్రమాదం జరిగితే దానిపై కూడా ఫేక్ ప్రచారం చేస్తున్నారు. వాహానాల రిజిస్ట్రేషన్ల అంశంపై కేంద్రానికి త్వరలో ఓ లేఖ రాస్తాను. ఇలాంటి ఫేక్ వ్యక్తులు దుష్ప్రచారం చేస్తుంటే ప్రతీ రోజూ చెప్పుకోవాలా అని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. మరో ఘటనలో రెండు కులాల మధ్య వివాదంగా మార్చి విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. వివేకా హత్య ఘటనలో ఏమరుపాటుకు గురయ్యాం. కోడికత్తి డ్రామా, గులకరాయి డ్రామాలు ఆడారు. అమాయకులను మోసం చేస్తూ కులం, మతం, ప్రాంతం పేరుతో చిల్లర రాజకీయాలు చేస్తున్నారు”అని ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆలస్యమైనా న్యాయమే గెలుస్తుంది

“పదేళ్ల క్రితం జరిగిన చిత్తూరు మాజీ మేయర్ దంపతుల మర్డర్ కేసులో 5 గురికి ఉరిశిక్ష విధిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది. న్యాయం జరగడానికి ఆలస్యం అయినా.. తప్పు చేసిన వారికి శిక్ష పడుతుంది అన్న దానికి ఈ తీర్పు అతిపెద్ద ఉదాహరణ. రాష్ట్రంలో ఏ వ్యక్తి తప్పు చేసినా ప్రభుత్వ నిఘా నుంచి తప్పించు కోలేరు. ఆడబిడ్డలపై అత్యాచారాలకు పాల్పడితే వారికి అదే చివరి రోజు అవుతుంది. అడుగడుగునా సీసీ కెమెరాలు, ఆధారాలు ఉన్నాయి. ఇకపై ఏమాత్రం ఉపేక్షించేది లేదు. అన్నిటినీ బయట పెడతాం. అభివృద్ధి, సంక్షేమాన్ని సమాంతరంగా ముందుకు తీసుకెళ్తున్నాం. ఎన్డీఏ ప్రభుత్వంపై నమ్మకంతోనే గూగుల్ సంస్థ విశాఖలో రూ.1.33 లక్షల కోట్లతో డేటా సెంటర్ పెడుతోంది. విశాఖలో జరగబోయే సదస్సుతో పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తాయి. గతంలో టీడీపీ ప్రభుత్వంపై విశ్వాసంతోనే కియా పరిశ్రమ కూడా అనంతపురం జిల్లాకు వచ్చింది. రాయలసీమను ఎవరూ బాగు చేయలేరని అందరూ ఆశలు వదిలిపెట్టారు. కానీ సీమను రతనాల సీమగా మార్చి చూపించాం. రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ ప్రవేశపెట్టాం. ఆనాడు అనంతపురం జిల్లాలో ఒక్క పచ్చని చెట్టు కనపడేది కాదు. ఇప్పుడు ప్రతి చెరువు కళకళలాడుతోంది. పులివెందులకు కూడా నీరు ఇవ్వలేకపోయిన వ్యక్తులు రాజకీయ లబ్దికోసం విమర్శలు చేస్తున్నారు.” అని ముఖ్యమంత్రి అన్నారు.

ఆధ్యాత్మిక కేంద్రంగా పుట్టపర్తి

“పుట్టపర్తిని ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ధి చేస్తాం. గతంలో సత్యసాయి బాబా అనంతపురం జిల్లాకు నీటి సరఫరా విషయంలో నా దగ్గర మాట తీసుకున్నారు. పుట్టపర్తి చుట్టుపక్కల గ్రామాల్లో నీటి సమస్య తీర్చేందుకు ప్రాజెక్టులు నేను కట్టిస్తాను…వాటి నిర్వహణ బాధ్యత తీసుకోవాలని సత్యసాయి బాబా నన్ను కోరారు. ఎల్ అండ్ టీ ద్వారా ఆ పనులు చేయించాను. కానీ గత పాలకులు వాటిని నిలిపి వేశారు. సత్యసాయి శత జయంతి ఉత్సవాలను 13 నుంచి 23వ తేదీ వరకూ నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. మంత్రులు పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్, సవిత, కందుల దుర్గేష్, సత్యకుమార్ యాదవ్ లతో కమిటీ వేశాం. సత్యసాయి ట్రస్టుతో కలిసి మంత్రుల కమిటీ శతజయంతి ఉత్సవాలను పర్యవేక్షిస్తుంది. అలాగే అభివృద్ధి పనులతో కదిరి నియోజకవర్గ స్వరూపాన్నే మారుస్తున్నాం. కదిరి శ్రీ లక్ష్మీ నర్సింహ క్షేత్రంలో మాఢ వీధుల అభివృద్ధితో పాటు దేవాలయాన్ని మరింత అభివృద్ది చేసి దివ్య క్షేత్రంగా మార్చుతాం.” అని ముఖ్యమంత్రి అన్నారు. అనంతరం ప్రజావేదిక సభలో పీ4 కార్యక్రమానికి సంబంధించి బంగారు కుటుంబాలను, మార్గదర్శులను సీఎం అభినందించారు. ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యుడు కందికుంట వెంకటప్రసాద్, ఎంపీ బీకే పార్ధసారధి, మాజీ మంత్రి పరిటాల సునీత, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

YUVATHARAM NEWS

Related Articles

Back to top button
error: Content is protected !!