భక్తులతో పోటెత్తిన నవులూరు పుట్ట తోట


భక్తులతో పోటెత్తిన నవులూరు పుట్ట తోట
మంగళగిరి ప్రతినిధి అక్టోబర్ 26 యువతరం న్యూస్:
నవులూరు శ్రీ నాగేంద్రస్వామి వారి పుట్ట తోట క్షేత్రంలో నాగుల చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని శనివారం శ్రీ స్వామివారికి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే భక్తులు పూజలు నిర్వహించారు. మహిళా భక్తులు స్వామివారికి భక్తిశ్రద్ధలతో పాలాభిషేకం నిర్వహించి, టెంకాయలు కొట్టి, పుట్టలో పాలు పోసి చలిమిడి, వడపప్పు, చిమ్మిరి, ధూప దీప నైవేద్యాలు సమర్పించారు. నాగుల చవితి పర్వదినాన సర్వదేవతలు శ్రీ నాగేంద్రునికి సర్వశక్తులను సమర్పించిన రోజు అని, ఈ రోజున స్వామివారి దర్శనంతో సకల శుభాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. మంగళగిరి పట్టణ పరిసర ప్రాంతాలతో పాటు విజయవాడ, గుంటూరు ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. దీంతో దేవాలయం ప్రాంగణము, పరిసర ప్రాంతం భక్తులతో పోటెత్తింది. భక్తులకు ఏ విధమైన అసౌకర్యం కలగకుండా దేవస్థానం నిర్వాహకులు క్యూ లైన్ లు, త్రాగునీరు, టెంట్లు, ఆలయం ప్రాంతంలో వర్షం కారణంగా బురద లేకుండా కంకర పోసి తగిన ఏర్పాట్లు చేశారు. శ్రీ పానకాల లక్ష్మీ నరసింహస్వామి సేవా సమితికి చెందిన 30 మంది మహిళా వాలంటీర్స్ భక్తులకు సేవలు అందించారు. ఏ విధమైన అవాంఛనీయ ఘటనలు జరగకుండా రూరల్ పోలీసులు పటిష్టమైన బందోబస్తు నిర్వహించారు. ఆలయ వంశపారంపర్య ధర్మకర్త కాసు రామకృష్ణారెడ్డి, శ్రీమతి రత్నకుమారి దంపతులు, శ్రీమతి ధనలక్ష్మి పర్యవేక్షించారు.
 
				 
					


