కర్నూలు బస్సు ప్రమాదం దురదృష్టకరం
రాష్ట్ర హోం శాఖా మంత్రి వంగలపూడి అనిత


కర్నూలు బస్సు ప్రమాదం దురదృష్టకరం
ప్రమాదం పై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాం
రాష్ట్ర హోం శాఖా మంత్రి వంగలపూడి అనిత
కర్నూలు క్రైమ్ అక్టోబర్ 25 యువతరం న్యూస్:
కర్నూలు బస్సు ప్రమాదం దురదృష్టకరం అని రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు.
శుక్రవారం స్థానిక జిల్లా పోలీసు కార్యాలయంలో ఉన్న వ్యాస్ ఆడిటోరియం లో చిన్నటేకూరు వద్ద జరిగిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాద ఘటనపై హోం శాఖ మంత్రి వర్యులు వంగలపూడి అనిత, రవాణా శాఖా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా హోం శాఖ మంత్రి మాట్లాడుతూ ప్రైవేట్ ట్రావెల్స్ కు చెందిన వేమూరి కావేరి ట్రావెల్స్ బస్ నెంబర్ డి డి 01N 9490 హైదరాబాద్ నుండి బెంగళూరు వెళ్తున్న సమయంలో తెల్లవారుజామున 3 గంటల నుండి 3.15 సమయంలో ప్రమాదానికి గురి అవడం చాలా బాధాకరమైన విషయం అన్నారు. ప్రాథమిక సమాచారం మేరకు ఎదురుగా వస్తున్న బైక్ ను ఢీకొని, 15 నుండి 20 మీటర్ల దూరం వరకు అలాగే తీసుకొని వెళ్లడం ద్వారా వచ్చిన స్పార్క్ వల్ల మంటలు చెలరేగి 19 మంది చనిపోవడం జరిగిందన్నారు. అందులో 17 మంది పెద్దవాళ్లు 2 చిన్నపిల్లలు ఉన్నారని, వీరు చనిపోవడం చాలా దురదృష్టకరమైన విషయం అన్నారు.. ప్రమాద ఘటన తెల్లవారుజామున 3 గంటల నుండి 3.15 గంటల మధ్యలో జరిగిన తర్వాత 3.21 గంటలకు స్థానిక సిఐకు సమాచారం వచ్చిన వెంటనే పోలీస్, అగ్నిమాపక శాఖ వారు వెంటనే ప్రమాద ఘటన స్థలం వద్దకు వచ్చి రెస్క్యూ ఆపరేషన్ మొదలుపెట్టారన్నారు. ప్రమాదఘటన గురించి సమాచారం వచ్చిన వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రులు, డీజీపీ, స్థానిక ప్రజా ప్రతినిధులు, తదితరులకు సమాచారం చేరవేశారన్నారు. ఘటన గురించి ప్రజా ప్రతినిధులకు తెలిసిన వెంటనే ఉదయం 6.30 గంటలకు ఘటన స్థలం వద్దకు చేరుకొని రెస్క్యూ ఆపరేషన్ కి సహాయ సహకారాలు అందించారన్నారు. బస్సులో మొత్తం 39 మంది పెద్దవాళ్లు, 4 చిన్నపిల్లలు, ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ఉన్నారన్నారు. ఈ గుర్తు తెలియని వ్యక్తులు ఆరంగర్ చౌరస్తా దగ్గర ఎక్కడం జరిగిందని, అందులో ఒక్కరు దిగిపోయారన్నారు. ప్రమాదం జరిగిన సమయంలో ఎక్స్ట్రా ఉన్న డ్రైవర్ వెనుక భాగంలో ఉన్న ఎగ్జిట్ డోర్ ను పగలగొట్టడం ద్వారా ప్రయాణికులు వారికి వారే రెస్క్యూ ఆపరేషన్ చేసుకొని కొంతమంది ప్రయాణికులు బయటికి రావడం జరిగిందన్నారు. 23 మంది పెద్దవాళ్లు, 2 పిల్లలు, 2 డ్రైవర్లు మొత్తం కలిపి 27 మంది ప్రయాణికులు ప్రమాదం నుండి తప్పించుకొని సురక్షితంగా బయటికి రావడం జరిగిందన్నారు. గాయాలైన వారికి ట్రీట్మెంట్ అందిస్తున్నారన్నారు. అదే విధంగా 17 మంది పెద్దవాళ్లు, 2 చిన్నపిల్లలు మొత్తం కలిపి 19 మంది చనిపోయారన్నారు. ఇందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వారు 6 మంది అని, వీరిలో బాపట్ల కి సంబంధించిన ధాత్రి, నెల్లూరు కి సంబంధించిన ఒక కుటుంబంలో రమేష్, అనుజ మరియు వారి పిల్లలు శశాంక్, మౌనత లు , కోనసీమ నుండి శ్రీనివాసరెడ్డి లు అన్నారు.. తెలంగాణ రాష్ట్రం నుండి 6 మంది, ఒకరు ఒడిస్సా, ఒకరు బీహార్, ఇద్దరు తమిళనాడు, ఇద్దరు కర్ణాటక రాష్ట్రాల నుండి, ఒకరి మృత దేహం ఇంకా గుర్తించలేదన్నారు. డ్రైవర్ లను అదుపులోకి తీసుకొని వారు చెప్పిన ప్రాధమిక సమాచారం మేరకు ఎంక్వైరీ చేయడం జరుగుతోందన్నారు. అదే విధంగా ప్రమాద సమయంలో మరణించిన బైకర్ పేరు శివ శంకర్, 24 ఏళ్ళు, తాండ్రపాడు గ్రామం అన్నారు. చనిపోయిన వారి మృతదేహాలను గుర్తించేందుకుగాను ఫోరెన్సిక్ కి సంబంధించి 16 టీమ్ లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అందులో కేవలం డిఎన్ఏ పరీక్షలు చేసేందుకు గాను 10 టీం లు ఉన్నాయన్నారు. 4 టీమ్ లు ఫిజికల్, బ్లాస్ట్ అనాలసిస్ చేసేందుకు ఉన్నాయన్నారు..2 టీం లు కెమికల్ అనాలసిస్ కొరకు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఇటువంటి ప్రమాద ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రమాదానికి కారణమైన వారి మీద తప్పకుండా చర్యలు తీసుకుంటామని కేసులు ఫైల్ కూడా చేయడం జరిగిందన్నారు. ప్రమాదానికి గల కారణాలను అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామన్నారు. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ముఖ్యమంత్రితో మాట్లాడి ట్రాన్స్పోర్ట్, పోలీస్, రెవెన్యూ శాఖలతో కలిపి ఒక హైపవర్ కమిటీ ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. అదే విధంగా హైవే లో బస్సు లు ఎంత వేగంతో వెళ్లాలి అనే ఎస్ ఓ పి కూడా తయారు చేస్తామన్నారు.
బస్సు ప్రమాద ఘటన హృదయ విదారకం.
రవాణా శాఖా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి.
రవాణా శాఖా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ ఈ ఘటన హృదయ విదారకమని పేర్కొన్నారు. కొత్తగా వచ్చిన బస్ లకు అన్నిటిలోనూ ఆటోమేటిక్ గా ఫైర్ అలారం సిస్టం ఎనేబుల్ చేస్తున్నామని, తీసుకోవాల్సిన సేఫ్టీ మెజర్స్ అన్నీ తీసుకుంటున్నామన్నారు. ప్రమాదానికి గురైన బస్సు 7 సంవత్సరాల బస్ కాబట్టి ఇందులో ఫైర్ అలారం సిస్టం లేదన్నారు.. హైవేల మీద ఈ విధంగా అగ్నికి సంబంధించి ఇది 3 వ ఇన్సిడెంట్ అన్నారు.. ఈ అంశం పై తెలంగాణ, కర్ణాటక రవాణా శాఖ మంత్రులతో నూతన గైడ్లైన్స్ వేసుకుని వచ్చే విధంగా చర్చించడం జరిగిందని, మినిస్ట్రీ అఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ (మోర్త్) సెంట్రల్ వారితో కూడా మాట్లాడి ఇటువంటి సంఘటనలు మరల పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకుంటామన్నారు. బస్సులో వివిధ రకాల రాష్ట్రలకు సంబంధించిన వారు ప్రయాణం చేస్తున్నారని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెంది మరణించిన 6 మంది ప్రయాణికులకు ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా, క్షతగాత్రులకు 2 లక్షల రూపాయలను రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు ప్రకటించడం జరిగిందన్నారు. అదే విధంగా కర్ణాటక తెలంగాణ రాష్ట్రాల మంత్రులతో మాట్లాడ్డం జరిగిందని వారు కూడా మనం ఇచ్చే విధంగానే ఎక్స్గ్రేషియా ప్రకటిస్తున్నారన్నారు. తమిళనాడు, ఒరిస్సా, బీహార్ రాష్ట్రాలకు సంబంధించిన వారికి కూడా ఇదేవిధంగా ఎక్స్గ్రేషియా వచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు.
అంతకముందు కల్లూరు మండలం చిన్నటేకూరు వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాద ఘటనా స్థలాన్ని హోం శాఖ మంత్రి వర్యులు వంగలపూడి అనిత, రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి లు పరిశీలించారు. ప్రమాదం ఏ విధంగా జరిగిందని వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో వైద్య చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు.. గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని మంత్రులు వైద్యులను ఆదేశించారు. మంత్రుల వెంట డిజిపి హరీష్ కుమార్ గుప్తా, డిఐజి కోయ ప్రవీణ్, జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి, జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత, కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి, పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యామ్ కుమార్, టిటిడి బోర్డు మెంబర్ మల్లెల రాజశేఖర్, ఇతర ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.



