కల్తీ మద్యం, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై వైకాపా దుష్ప్రచారం
పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి ఆగ్రహం

కల్తీ మద్యం, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై వైకాపా దుష్ప్రచారం
పాణ్యం ఎమ్మెల్యే చరిత రెడ్డి ఆగ్రహం
‘108 జీవోతో మేనేజ్మెంట్ కోటా సీట్లు అమ్ముకుంది వైకాపా కాదా?’
కర్నూలు టౌన్ అక్టోబర్ 23 యువతరం న్యూస్:
రాష్ట్రంలో కల్తీ మద్యం, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై వైకాపా నాయకులు చేస్తున్న దుష్ప్రచారంపై పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. కూటమి నాయకులతో కలిసి మాధవి నగర్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన ఆమె, అక్రమ మద్యపాన నివారణకు కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు.
వైకాపాపై విమర్శలు:
ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి మాట్లాడుతూ, వైకాపా ప్రభుత్వం తమ అవినీతి, అక్రమాలను ఎదుటివారిపైకి నెట్టడంలో మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి పీహెచ్డీ చేశారని విమర్శించారు. గత ఐదేళ్లలో లిక్కర్ మాఫియా పేరుతో రూ. 3,500 కోట్లు దోచుకున్న విషయాన్ని ప్రజల దృష్టిని మళ్లించడానికి వైకాపా కుట్రలు చేస్తోందని ఆరోపించారు.
కల్తీ మద్యంపై కుట్ర:
కూటమి ప్రభుత్వం ప్రతిష్ఠను దెబ్బతీయాలనే ఉద్దేశంతోనే తాడేపల్లి ప్యాలెస్‌లో కుట్రపూరితంగా కల్తీ మద్యం ఫార్ములాను తయారు చేశారని గౌరు చరిత రెడ్డి ఆరోపించారు. గత ప్రభుత్వంలో మద్యం తయారీ కంపెనీలన్నింటినీ జగన్ తన గుప్పెట్లో పెట్టుకుని కేవలం ‘జే బ్రాండ్లు’ మాత్రమే తయారు చేయించారని, దీని కారణంగా రాష్ట్రంలో అనేకమంది ప్రాణాలు కోల్పోగా, 30 లక్షల మంది అనారోగ్యపాలయ్యారని పేర్కొన్నారు. గత ఐదేళ్లుగా సరఫరా చేసిన జే బ్రాండ్లలో విషపూరిత పదార్థాలు ఉన్నట్లు చెన్నై, బెంగళూరు, అమెరికాలోని ల్యాబ్‌లు స్పష్టం చేశాయని ఆమె గుర్తు చేశారు.
వైకాపా నుంచి నేతలపై చర్యలు: కల్తీ మద్యం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న దాసరి పల్లి జయచంద్ర రెడ్డి, కట్ట సురేంద్ర నాయుడులను వెంటనే పార్టీ నుండి సస్పెండ్ చేసి, తగిన విచారణ చేపట్టాలని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ఎమ్మెల్యే ప్రకటించారు. ఇప్పటికే జయచంద్ర రెడ్డి పై పోలీసు కేసు నమోదు చేయడం ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనమని అన్నారు. కల్తీ మద్యం వాస్తవాలను బయటకు తీసేందుకు నలుగురు ఐపీఎస్‌లతో కూడిన సిట్ ఏర్పాటు చేశామని, కల్తీ మద్యం గుర్తించడానికి ‘ఏపీ ఎక్సైజ్ సురక్ష’ అనే యాప్‌ను కూడా అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని తెలిపారు.
గత వైకాపా ప్రభుత్వ పాలనపై ప్రశ్నలు:
వైకాపా పాలనలో జంగారెడ్డిగూడెంలో కల్తీ నాటుసారా తాగి 27 మంది పేదల ప్రాణాలు కోల్పోయినా, పోస్టుమార్టం నిర్వహించకుండా, విచారణ జరపకుండా కేసును తప్పుదోవ పట్టించారని ఆమె విమర్శించారు. వైకాపా హయాంలో మద్యం రేట్లు పెంచడం వల్ల మద్యాన్ని బానిసలైన 48 మంది వ్యక్తులు శానిటైజర్ తాగి చనిపోయారని గుర్తు చేశారు.
జగన్ పాలనలో నకిలీ మద్యానికి అధికారిక ముద్ర వేసి ఏరులై పారించారని, సొంత బ్రాండ్లు తెచ్చి ప్రమోట్ చేశారని, జాతీయ, అంతర్జాతీయ బ్రాండ్లు ఏపీలో లేకుండా బలవంతంగా డిస్టిలరీలను స్వాధీనం చేసుకొని అక్రమ సామ్రాజ్యం సృష్టించారని దుయ్యబట్టారు.
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై వైకాపాకు ప్రశ్నించే హక్కు లేదు:
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై వైకాపా నాయకులకు ప్రశ్నించే హక్కు లేదని గౌరు చరిత రెడ్డి స్పష్టం చేశారు.
“యాజమాన్య కోటా కింద సీట్లు అమ్ముకునేలా 108 జీవో ఇచ్చింది వైకాపా కాదా?” అని ఆమె ప్రశ్నించారు.
గత వైకాపా ప్రభుత్వం 108 జీవోలో 15% సెంట్రల్ పూల్ సీట్లు పోగా, మిగిలిన 85% సీట్లలో సగం కన్వీనర్ కోటా పోను, మిగిలిన సగం సీట్లను యాజమాన్య కోటా, ఎన్నారై కోటాగా విభజించింది నిజం కాదా అని ప్రశ్నించారు. “ఏడాదికి యాజమాన్య కోటా కింద ₹12 లక్షలు, ఎన్నారై కోటా కింద ₹20 లక్షలు అమ్ముకోవడానికి జీవో ఇచ్చింది నిజమా కాదా?” అని నిలదీశారు. కోర్సు పూర్తి చేయడానికి కోటి రూపాయలు ఖర్చు అయ్యే విధంగా జీవో ఇచ్చిన వైకాపా ఇప్పుడు నంగనాచి కబుర్లు చెబుతోందని ఎద్దేవా చేశారు.
పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ (పి పి పి) ద్వారా మెడికల్ కళాశాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని ఆమె తెలిపారు. పీపీపీ అంటే అవగాహన లేని వైకాపా విష ప్రచారానికే పరిమితమై, ప్రజలను మభ్య పెట్టేందుకు ‘కోటి సంతకాల సేకరణ’ పేరుతో ప్రభుత్వంపై బురద జల్లే కార్యక్రమానికి పూనుకుందని విమర్శించారు.
కూటమి ప్రభుత్వంలో ప్రజారంజక పాలన చూసి ఓర్వలేక వైకాపా బురదజల్లే రాజకీయాలకు తెరతీసిందని ఎమ్మెల్యే విమర్శించారు.
ఈ సమావేశంలో మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ పెరుగు పురుషోత్తం రెడ్డి, యువ నాయకులు గౌరు జనార్దన్ రెడ్డి, ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ ఎస్కే శ్రీనివాసరావు, తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ యాదవ్ సహా కూటమి పార్టీ నాయకులు పాల్గొన్నారు.