
‘మోదీ విజయం – భారత్ విజయం’
ఏపీకి డబుల్ ఇంజన్ ఫలాల పంట
జీఎస్టీ 2.0 తో ప్రజలకు ‘సూపర్ సేవింగ్స్’
త్వరలో రాయలసీమకు హైకోర్టు బెంచ్
21వ శతాబ్దపు నేత మోదీ
సీఎం చంద్రబాబు ప్రశంసలు
కర్నూలు రూరల్ అక్టోబర్ 16 యువతరం న్యూస్:
కేంద్రంలో, రాష్ట్రంలో ‘డబుల్ ఇంజన్’ ఎన్డీఏ ప్రభుత్వం ఉండటం వల్ల ఆంధ్రప్రదేశ్‌కు రెట్టింపు ప్రయోజనాలు దక్కుతున్నాయని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహకారంతో రాష్ట్రానికి అత్యధిక పెట్టుబడులు వస్తున్నాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ప్రధాని మోదీ విజయం భారత్ విజయమని, అదే తమ విజయమని ఆయన ఉద్ఘాటించారు.
గురువారం కర్నూలులో వేలాది మంది జనసందోహం మధ్య ఏర్పాటు చేసిన ‘సూపర్ జీఎస్టీ – సూపర్ సేవింగ్స్, బచత్ ఉత్సవ్’ భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీతో కలిసి శ్రీశైల మహాక్షేత్రాన్ని దర్శించుకోవడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ 21వ శతాబ్దపు నేత ముఖ్యమంత్రిగా, ప్రధానిగా 25 ఏళ్ల ప్రజాసేవ ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న ప్రధాని మోదీకి ఈ సందర్భంగా సీఎం శుభాకాంక్షలు తెలిపారు. అత్యంత అంకితభావంతో దేశానికి సేవలు అందిస్తున్న మోదీ ఓ విశిష్ట నేత అని కొనియాడారు. “సరైన సమయంలో సరైన చోట సరైన నేతగా ప్రధాని స్థానంలో మోదీ ఉన్నారు. ఆయన 21వ శతాబ్దపు నేత” అని వ్యాఖ్యానించారు.
‘విరామం లేకుండా ప్రజల సేవకే అంకితం: తాను చూసిన ప్రధానుల్లో మోదీ అత్యంత ప్రగతిశీల నేత అని, ఎలాంటి విరామం లేకుండా ప్రజల సేవకే అంకితమై ఉన్నారని సీఎం అన్నారు.
ప్రపంచంలో అగ్రస్థానం: దేశ అభివృద్ధి కోసం ఆయన తీసుకువచ్చిన కీలక సంస్కరణల ఫలితంగానే ప్రపంచవ్యాప్తంగా భారత్ అగ్రస్థానానికి చేరుకుందని తెలిపారు.
వికసిత్ భారత్ లక్ష్యం: 11 ఏళ్ల క్రితం 11వ స్థానంలో ఉన్న భారతదేశం, ప్రధాని మోదీ సంకల్పంతో ఇప్పుడు 4వ స్థానానికి చేరిందని, ‘వికసిత్ భారత్’ లక్ష్యంలో భాగంగా 2047 నాటికి దేశం సూపర్ పవర్‌గా మారుతుందని ముఖ్యమంత్రి విశ్వాసం వ్యక్తం చేశారు.
* ‘ఆపరేషన్ సింధూర్’: ‘ఆపరేషన్ సింధూర్’ ద్వారా సైనికపరంగా భారతదేశ సత్తాను ప్రపంచానికి చాటిచెప్పారని ప్రధానిని ప్రశంసించారు.
బీహార్ విజయంపై ఆశాభావం: త్వరలో జరగనున్న బీహార్ ఎన్నికల్లో కూడా ఎన్డీఏ విజయం సాధిస్తుందని సీఎం చంద్రబాబు విశ్వాసం వ్యక్తం చేశారు.
జీఎస్టీ 2.0: ప్రజలకు రూ.15 వేల పొదుపు
ఒకే దేశం – ఒకే పన్ను – ఒకే మార్కెట్ నినాదంతో వచ్చిన జీఎస్టీ విధానంలో ప్రధాని మోదీ తీసుకువచ్చిన జీఎస్టీ 2.0 సంస్కరణలు దేశ ప్రగతి వేగాన్ని పెంచే కీలక నిర్ణయమని సీఎం అన్నారు.
ధరల తగ్గుదల: ఈ సంస్కరణల వల్ల 99 శాతం వస్తువులు సున్నా నుంచి 5 శాతం పన్ను పరిధిలోకి వచ్చాయని, తద్వారా నిత్యావసరాల ధరలు తగ్గాయని వివరించారు.
* ప్రతి కుటుంబానికి పొదుపు: జీఎస్టీ తగ్గింపుతో ప్రతీ కుటుంబానికీ ఏటా రూ.15 వేల వరకూ ఆదా అవుతుందని స్పష్టం చేశారు.
‘భరోసా ఉత్సవ్’: జీఎస్టీ సంస్కరణలపై అవగాహన కల్పించేందుకు దసరా నుంచి దీపావళి వరకూ నిర్వహిస్తున్న ‘జీఎస్టీ బచత్ ఉత్సవ్’ నేడు ‘భరోసా ఉత్సవ్’ గా మారిందని సీఎం అన్నారు. ‘సూపర్ సిక్స్’ పథకాలు, ‘సూపర్ జీఎస్టీ’తో ప్రజలకు ‘సూపర్’గా పొదుపు జరిగిందని పేర్కొన్నారు.
రాష్ట్రానికి భారీ పెట్టుబడులు – హైకోర్టు బెంచ్ ప్రకటన
ప్రధానమంత్రి మోదీ ఇచ్చిన ‘స్వదేశీ’ పిలుపే ప్రపంచ మార్కెట్లలో టారిఫ్‌లను ఎదుర్కొనేందుకు తారకమంత్రం అవుతుందని సీఎం చంద్రబాబు అన్నారు. సెమీకండక్టర్ల నుంచి శాటిలైట్ల వరకూ, చిప్‌ల నుంచి షిప్‌ల వరకూ ఏపీలోనే ఉత్పత్తి చేసేలా కార్యాచరణ చేపట్టామని తెలిపారు.
రాయలసీమకు హైకోర్టు బెంచ్: రాయలసీమ ప్రాంత అభివృద్ధికి త్వరలో హైకోర్టు బెంచ్ రాబోతోందని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా ప్రకటించారు.
పెట్టుబడుల వృద్ధి: ప్రధాని మోదీ సహకారంతో రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వస్తున్నాయని, ఇందులో భాగంగా విశాఖలో ఆర్సెల్లార్ మిట్టల్, $15 బిలియన్ డాలర్ల పెట్టుబడితో గూగుల్ ఏఐ డేటా హబ్, నెల్లూరులో భారత్ పెట్రోలియం కార్పోరేషన్ రిఫైనరీ వస్తున్నాయని తెలిపారు.
రాయలసీమ పరిశ్రమలు: రాయలసీమలో స్టీల్, స్పేస్, డిఫెన్స్, ఏరో స్పేస్, డ్రోన్స్ తయారీ, సెమీకండక్టర్ యూనిట్, క్వాంటం వ్యాలీ వంటి కీలక పరిశ్రమలు రాబోతున్నాయని, ఇందుకు సహకరించిన ప్రధానికి ధన్యవాదాలు తెలియజేశారు.
సంక్షేమం సూపర్ హిట్: కేంద్రం సహకారంతోనే ‘సూపర్ సిక్స్’ హామీలైన మెగా డీఎస్సీ, అన్నదాత సుఖీభవ (పీఎం కిసాన్), స్త్రీశక్తి వంటి పథకాలు ‘సూపర్ హిట్’ అయ్యాయని ఆయన వివరించారు. అలాగే పోలవరాన్ని గాడిన పెట్టి, అమరావతిని నిలబెట్టి, విశాఖ ఉక్కును బలోపేతం చేశామని తెలిపారు.
రూ.13,429 కోట్ల ప్రాజెక్టులకు మోదీ శ్రీకారం
ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రంలో రూ.13,429 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ఈ సభ వేదికగా శ్రీకారం చుట్టారు. విద్యుత్, రైల్వే, జాతీయ రహదారులు, పారిశ్రామిక, రక్షణ రంగాలకు చెందిన పలు ప్రాజెక్టులను ఆయన వర్చువల్ విధానం ద్వారా ప్రారంభించి, శంకుస్థాపనలు చేశారు.
రూ. 9,449 కోట్లతో 5 శంకుస్థాపనలు: ఇందులో విద్యుత్ ట్రాన్స్ మిషన్ వ్యవస్థ, ఓర్వకల్లు-కొప్పర్తి పారిశ్రామిక కారిడార్, కొత్తవలస-విజయనగరం 4వ రైల్వే లైన్ వంటి కీలక ప్రాజెక్టులు ఉన్నాయి.
రూ. 1,704 కోట్లతో 8 ప్రారంభోత్సవాలు: ఇందులో జాతీయ రహదారుల పనులు, నిమ్మకూరులోని బి ఈ ఎల్ అడ్వాన్స్‌డ్ నైట్ విజన్ గ్లాసుల ఉత్పత్తి కేంద్రం, చిత్తూరులోని ఇండేన్ బాట్లింగ్ ప్లాంట్ వంటివి ఉన్నాయి.
రూ. 2,276 కోట్లతో 2 జాతికి అంకితం: కొత్తవలస – కొరాపుట్ రైల్వే డబ్లింగ్ పనులు, శ్రీకాకుళం- అంగుల్ నాచురల్ గ్యాస్ పైప్‌లైన్‌లను ప్రధాని జాతికి అంకితం చేశారు. శ్రీశైలంలో ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు కర్నూలు పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హెలికాప్టర్‌లో శ్రీశైల క్షేత్రానికి వెళ్లి శ్రీ భ్రమరాంబ మల్లిఖార్జున స్వామి వార్లను దర్శించుకున్నారు. శక్తిపీఠంలోని అమ్మవారిని దర్శించి వేదపండితుల ఆశీర్వచనాలు తీసుకున్నారు. అనంతరం అక్కడే ఉన్న శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని కూడా వారు సందర్శించారు.