హంద్రీనీవాతో రాయలసీమకు జలసిరి
జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు

హంద్రీనీవాతో రాయలసీమకు జలసిరి
హంద్రీనీవా పరిధిలో 517 ట్యాంకులకు, 299 కృష్ణాజలాలతో నింపాము
వైకాపా 5 ఏళ్లలో చేయలేనిది సంవత్సరంలోనే చేసి చూపించాం
సకాలంలో హంద్రీనీవా పనులు పూర్తి చేసిన అధికారులకు అభినందనలు
జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు
కర్నూలు విద్య అక్టోబర్ 14 యువతరం న్యూస్:
హంద్రీనీవా ప్రాజెక్టు ఆయకట్టు పరిధిలోని మొత్తం 517 చెరువులకు గాను 299 చెరువులని కృష్ణాజలాలతో నింపామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. హంద్రీ నీవా నీరుతో చెరువులు నింపే కార్యక్రమానికి సంబంధించి కర్నూలు ఇరిగేషన్ సిఈ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారాయన. హంద్రీనీవా ప్రధాన కాలువ పనులు సకాలంలో పూర్తి చేసిన అధికారులను అందరినీ మంత్రి నిమ్మల రామానాయుడు అభినందించారు. చివరన ఉన్న కుప్పం వరకు కృష్ణాజలాలు తరలి వెళ్ళడంలో ఎటువంటి అవాంతరాలు లేకుండా, అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉండాలని అధికారులను ఆదేశించారు.
రాయలసీమకు గుండెకాయ అయిన హంద్రీనీవా ప్రాజెక్ట్ ని గత ఐదేళ్ల పాలనలో వైకాపా ప్రభుత్వం ఆటకెక్కించింది అన్నారు. ఆ ప్రభుత్వం ఐదేళ్లలో చేయనిది, కూటమి ప్రభుత్వం సంవత్సరంలో చేసి చూపించిందని రామానాయుడు స్పష్టం చేశారు. రాష్ట్రంలోని రిజర్వాయర్లన్ని 961 టిఎంసిల సామర్థ్యం ఉంటే 844 టీఎంసీలతో వాటిని నింపగలిగామన్నారు. అంటే 87.86% నీటిని నిల్వ చేయగలిగామని వివరించారు.
అలాగే రాయలసీమలోని మొత్తం 38 నియోజకవర్గాల పరిధిలో హంద్రీనీవా ప్రాజెక్టు కాలువలు విస్తరించి ఉన్నాయి అన్నారు. ఈ కాలువలకు అనుబంధంగా 517 చెరువులు ఉన్నాయి. వీటిలో 174 చెరువులు పూర్తిగా, 125 చెరువులు పాక్షికంగా అంటే మొత్తం 299 చెరువులు నింపగలిగామన్నారు. మిగిలినవి ప్రాధాన్య క్రమంలో ఫిబ్రవరి మాసానికల్లా నింపుతామన్నారు. ఈ కారణంగా ప్రస్తుతం రాయలసీమ చెరువుల్లో జలసిరి తాండవిస్తోందన్నారు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమర్థ నాయకత్వంలో ప్రతి ఎకరాకు నీరు ఇవ్వాలన్న ఆయన ఆశయం మేరకు రేయింబవళ్లు కష్టపడి పని చేస్తున్నామన్నారు. ప్రతిష్టాత్మకమైన హంద్రీనీవాకు రూ 3,850 కోట్ల రూపాయలు వెచ్చించడమే గాక 738 కిలో మీటర్లు కృష్ణమ్మ జలాలను కుప్పం వరకు తీసుకెళ్లడం ఒక చరిత్రగా మంత్రి అభివర్ణించారు. ప్రతి నియోజకవర్గంలో ఉన్న చెరువులను నింపే బాధ్యతను, పర్యవేక్షణను ఇరిగేషన్ అధికారులతో పాటు, రెవెన్యూ అధికారులకు కూడా అప్పగించినట్లు రామానాయుడు పేర్కొన్నారు. ఇందులో భాగంగా అక్కడున్న కలెక్టర్లు, తహసిల్దార్లు, వీఆర్వోలు వరకు ఈ బృహత్తర కార్యక్రమంలో భాగస్వాములు అవుతారని ఆయన స్పష్టం చేశారు.
ఈ ఆనంద సమయంలో రాయలసీమ ప్రజలు గత ప్రభుత్వ పనితీరుకు, కూటమి ప్రభుత్వ పనితీరుకు మధ్య వ్యత్యాసాన్ని గమనించాలన్నారు. గత వైకాపా ప్రభుత్వ పాలనలో సినిమా సెట్టింగులు, అద్దె ట్యాంకర్లు, అద్దె గేట్లు, బెంగళూరు నుంచి పూలు తెప్పించి నీటి వనరుల ప్రారంభోత్సవాలు నిర్వహించిన సంగతి, జగన్ హెలికాప్టర్ ఎక్కే సమయానికి ఆ నీరు ఆవిరి అయిపోయిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుందని మంత్రి నిమ్మల ఎద్దేవా చేశారు. రాయలసీమ ముద్దుబిడ్డనని చెప్పుకునే జగన్ రాయలసీమ ప్రాజెక్టులకు తీరని ద్రోహం చేశాడని రామానాయుడు విమర్శించారు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పింది చేస్తున్నారు. చేసిందే చెబుతున్నారు. వాస్తవాలన్నీ ప్రజలు కళ్ళారా చూసే విధంగా ఈ ప్రభుత్వ పనితీరు పారదర్శకంగా ఉన్న సంగతి గమనించాలని రామానాయుడు విజ్ఞప్తి చేశారు. హంద్రీనీవా ప్రాజెక్టు రెండోదశగా మడకశిర బ్రాంచ్ కాలువ పనులు అన్నీ పూర్తి చేసి హిందూపురం, మడకశిర, పెనుగొండ నియోజవర్గాలకు నీరుస్తామన్నారు. హంద్రీనీవా ప్రాజెక్టుకు సంబంధించి 400 కిలోమీటర్ల నుంచి 554 కిలోమీటర్ల వరకు అంటే అడివిపల్లి రిజర్వాయర్ నుంచి నీవా, అక్కడ నుంచి తిరుపతి కళ్యాణి డ్యామ్ వరకు అతి త్వరలో నీరు తీసుకెళ్లాలనేది ముఖ్య మంత్రి ఆశయంగా రామానాయుడు స్పష్టం చేశారు. తద్వారా రాయలసీమను రతనాల సీమ చేయాలని కూటమిలోని తెలుగుదేశం, జనసేన, భాజపా పార్టీ లు కృత నిశ్చయంతో ఉన్నట్లు మంత్రి మరోసారి చెప్పారు. ఈసమీక్ష సమావేశంలో ఇరిగేషన్ అడ్వైజర్ వెంకటేశ్వరరావు, ఈఎన్సీ నరసింహామూర్తి, ప్రాజెక్టు సిఈలు కబీర్ భాషా నాగరాజు, ఎస్ఈలు, ఈఈలు, మరియు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.