పేదరికానికి ముగ్గురు బలి
కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న మరొక ప్రాణం, ప్రభుత్వ సహాయం కోసం ఎదురుచూపు

చికిత్స పొందుతూ ముగ్గురు మృతి
పేదరికానికి ముగ్గురు బలి
కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న మరొక ప్రాణం
పేదరికమే వీరికి శాపమా
గ్రామ నాయకుడు నర్సింగ్ కాంతారెడ్డి ఆర్థిక సహాయం
ముందుకు రాని దాతలు
వెల్దుర్తి అక్టోబర్ 12 యువతరం న్యూస్:
పేదరికమే వీరి పాలిట శాపం గా మారింది. అనుకోని ప్రమాదంతో ఒక కుటుంబం ఆస్పత్రిపాలై చికిత్స పొందుతూ సరైన వైద్యం అందక ముగ్గురు మృతి చెందిన సంఘటన వెల్దుర్తి మండలంలోని ఎస్ బోయినపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. ఎస్ బోయినపల్లి గ్రామానికి చెందిన వడ్డే నాగరాజు, సువర్ణ, అనిల్, చరణ్ ఈనెల 5వ తారీఖున ఆదివారం అర్ధరాత్రి ప్రమాదవశాత్తు జరిగిన గ్యాస్ లీక్ ప్రమాదంలో వీరు తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స నిమిత్తం వీరిని వెంటనే వెల్దుర్తి వైద్యశాల తరలించగా మెరుగైన వైద్యం కోసం కర్నూలు ప్రభుత్వ వైద్యశాల తరలించారు. సమాచారం తెలుసుకున్న ఎస్ బోయినపల్లి గ్రామ నాయకులు నర్సింగ్ కాంతారెడ్డి హుటాహుటిన ప్రభుత్వ వైద్యశాలకు వెళ్లి వారికి ఆర్థిక సాయం అందించినట్లు సమాచారం. ముఖ్యంగా నాగరాజు కుటుంబం పేద కుటుంబం. రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబం వారిది. ఇటువంటి దయనీయ స్థితిలో ఒకేసారి కుటుంబంలోని నలుగురు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చేరారు. వీరికి ప్రతిరోజు వేల రూపాయలలో ఖర్చులు అవుతున్నట్టు సమాచారం.దాతలు కూడా ఎవరు ముందుకు రాకపోవడంతో పేదరికంతో ఈ ముగ్గురు మృతి చెందారని ప్రజలు భావిస్తున్నారు. చికిత్స పొందుతూ కుటుంబ పెద్ద నాగరాజు, నాగరాజు భార్య సువర్ణ, నాగరాజు చిన్న కుమారుడు చరణ్ ముగ్గురు మృత్యువాత పడ్డారు. పెద్ద కుమారుడు అనిల్ కోన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నారు. కనీసం ఈ ఒక్క ప్రాణానికైనా దాతలు ముందుకు వచ్చి సహకరించి ప్రాణాన్ని కాపాడవలసిందిగా ప్రజలు వేడుకుంటున్నారు.
ఒకే కుటుంబంలో ముగ్గురు మరణించడంతో గ్రామం శోకసముద్రంలో మునిగిపోయింది. నేటికైనా ప్రభుత్వం స్పందించి మిగిలిన ఒక్క ప్రాణాన్ని అయినా కాపాడాలని ప్రజలు వేడుకుంటున్నారు.