మత్తు పదార్థాల నియంత్రణపై గట్టి నిఘా ఉండాలి
ఐడి లిక్కర్ ఫ్రీగా జిల్లాను తీర్చిదిద్దాం

మత్తు పదార్థాల నియంత్రణపై గట్టి నిఘా ఉండాలి
మహిళ రక్షణకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి
ఐడి లిక్కర్ ఫ్రీగా జిల్లాను తీర్చిదిద్దాం
జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గణియా
నంద్యాల ప్రతినిధి సెప్టెంబరు 30 యువతరం న్యూస్:
మత్తు పదార్థాల నియంత్రణపై గట్టి నిఘా ఉంచి వాటి నియంత్రణకు తక్షణ చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో మత్తు పదార్థాల నియంత్రణపై “డ్రగ్స్ వద్దు బ్రో” అనే కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. సమావేశంలో నంద్యాల ఎఎస్పీ మంద జవాలి అల్ఫోన్స్, ఎక్సైజ్ సూపరింటెండెంట్ రవికుమార్ సంబంధిత శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి మాట్లాడుతూ…. జిల్లాలో మత్తు పదార్థాల నియంత్రణపై గట్టి నిఘా ఉంచి జిల్లాను మత్తు పదార్థాల లేని జిల్లాగా తీర్చిదిద్దేలా కృషి చేయాలన్నారు. ముఖ్యంగా పది, ఇంటర్మీడియట్, డిగ్రీ తప్పిపోయిన విద్యార్థులపై పక్కగా దృష్టి సారించాలన్నారు. అందుకు గాను ప్రభుత్వం జిల్లాలో మత్తు పదార్థాల లభ్యత ఏమైనా ఉందా ? మహిళల పట్ల పోలీసులు ఏ విధంగా స్పందిస్తున్నారు ? తదితర అంశాలపై పబ్లిక్ పర్సెప్షన్ ఆధారంగా ఫీడ్ బ్యాక్ తీసుకొని జిల్లాకు ర్యాంకింగ్ ఇవ్వడం జరుగుతోందన్నారు. పబ్లిక్ పర్సెప్షన్ ను ఐవిఆర్ఎస్, క్యూఆర్ కోడ్, వాట్సాప్ గవర్నర్స్ ద్వారా ప్రజల అభిప్రాయాలను సేకరించడం జరుగుతోందన్నారు. అందుకు ప్రజలకు ఉత్తమ సేవలు అందజేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. మత్తు పదార్థాల నివారణ కోసం పాఠశాల స్థాయి నుండే విద్యార్థులకు బోధిస్తూ జిల్లాలో ఉన్న అన్ని ప్రభుత్వ/ప్రైవేటు పాఠశాలల్లో, ఇంటర్మీడియట్ కళాశాలల్లో ఈగల్ టీమ్స్ ఏర్పాటు చేసి అవగాహన కల్పించాలన్నారు. అదే విధంగా ప్రతి నెలలో సమావేశాలు నిర్వహించేలా చూడాలన్నారు. జిల్లాలో మత్తు పదార్థాల నుండి విముక్తి పొందడం కోసం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో డిఅడిక్షన్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ముఖ్యంగా గృహిణులు ఇంటి ముందు కళ్ళాపి కోసం ఉపయోగించే సౌభాగ్య పౌడర్ ప్రజలకు అందుబాటులో లేకుండా చూడాలన్నారు. జిల్లాలో అత్యధికంగా శైవ క్షేత్రాలు ఉన్న నేపధ్యంలో అక్కడే నివాసం ఏర్పాటు చేసుకున్న సాధువులపై నిఘా ఉంచాలని దేవాదాయ శాఖ అధికారులను ఆదేశించారు. అదే విధంగా అంతర పంటలు మద్యలో గంజా పంట వేయకుండా చూడాలని హార్టికల్చర్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
జిల్లాను ఐడి (ఇల్లీసిట్లీ డిస్టిల్డ్ లిక్కర్)ఫ్రీగా జిల్లాను తీర్చిదిద్దడం జరిగిందన్నారు. అదే విధంగా పోలీసు సహకారంతో భవిష్యత్తులో మళ్లీ మద్యం ఉత్పాదకత ఉండకుండా కృషి చేయాలన్నారు.
నంద్యాల ఎఎస్పీ మంద జవాలి అల్ఫోన్స్ మాట్లాడుతూ….2025వ సంవత్సరంలో ఇప్పటి వరకు 11 కేసులు నమోదు అవ్వడంతో పాటు సుమారు 17 కిలోలు సీజ్ చేయడం జరిగిందన్నారు. ముఖ్యంగా పాఠశాలల వంద మీటర్ల పరిధిలో నో స్మోకింగ్ జోన్ గా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రతి విద్యా సంస్థలో ఈగల్, శక్తి టీమ్స్ ఏర్పాటు చేసి వాటి ద్వారా యువతకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోందన్నారు. మత్తు పదార్థాల నివారణ కోసం 1972 టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ముఖ్యంగా ఔషధ దుకాణాలు ప్రిస్క్రిప్షన్ లేకుండా పెయిన్ కిల్లర్స్ విక్రయించకుండా చూడాలని జిల్లా కలెక్టర్ కు నివేదించారు.
ఎక్సైజ్ సూపరింటెండెంట్ రవికుమార్ మత్తు పదార్థాల వినియోగిస్తే, సరఫరా చేస్తే అందుకు అమలు చేసే శిక్షలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.
అనంతరం మత్తు పదార్థాల నియంత్రణ కోసం ఏర్పాటు చేసిన ఈగల్ టీమ్స్ పోస్టర్ ను జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు.