ఆర్ఓ వాటర్ ప్లాంట్లలో నాణ్యతా ప్రమాణాలు తప్పనిసరి
జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గణియా

ఆర్ఓ వాటర్ ప్లాంట్లలో నాణ్యతా ప్రమాణాలు తప్పనిసరి
భద్రతా ప్రమాణాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు
గ్రామీణ 364, పట్టణ 214 ఆర్ఓ ప్లాంట్లలో ముమ్మర తనిఖీలు నిర్వహించి నీటి నమూనాలను ల్యాబ్ లకు పంపండి
జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గణియా
నంద్యాల ప్రతినిధి సెప్టెంబర్ 26 యువతరం న్యూస్:
జిల్లా ప్రజలకు సురక్షితమైన త్రాగునీరు అందించేందుకు అన్ని ఆర్ఓ వాటర్ ప్లాంట్లు క్రమం తప్పకుండా నాణ్యతా పరీక్షలు నిర్వహించి, బిఐఎస్ ప్రమాణాలను ఖచ్చితంగా పాటించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి ఆర్డబ్ల్యూఎస్, పబ్లిక్ హెల్త్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వీడియో కాన్ఫరెన్స్ అనంతరం ఆర్ఓ ప్లాంట్ల భద్రతా ప్రమాణాలపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి మాట్లాడుతూ జిల్లాలో అధిక వర్షాల కారణంగా ప్రజలు ఎలాంటి అనారోగ్యం బారిన పడకుండా ఉండేందుకు గాను గ్రామీణ ప్రాంతాలలో ఉన్న 364 ఆర్ఓ ప్లాంట్లు, పట్టణ ప్రాంతాలలో ఉన్న 214 ఆర్ఓ వాటర్ ప్లాంట్లలో ముమ్మర తనిఖీలు నిర్వహించి నీటి నమూనాలు సేకరించి ల్యాబ్ లకు పంపాలని కలెక్టర్ ఆదేశించారు. ఇందుకు సంబంధించి త్రాగునీటిని పరీక్షించే 13 పారామీటర్లైనా క్లోరైడ్, ఫ్లోరైడ్, టర్బిడిటీ, ఐరన్, నైట్రేట్, రంగు, వాసన, టోటల్ హార్డ్నెస్, ఆల్కలినిటీ, ఈకొలై బ్యాక్టీరియా, పిహెచ్, హెచ్2ఎస్ వైల్, కెమికల్ తదితర పరీక్షలు క్రమం తప్పకుండా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలన్నారు.
ప్రజల ఆరోగ్య రక్షణ కోసం ఆర్ఓ వాటర్ ప్లాంట్లలో నిర్దేశించిన ప్రమాణాలకు తక్కువగా ఉన్నా లేదా ఎక్కువగా ఉన్న సదరు ఆర్ఓ వాటర్ ప్లాంటులను సీజ్ చేసేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్లాంట్ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచడం, ర్యాపిడ్ ఫిల్టరేషన్ సిస్టమ్ లను సమయానికి మార్చడం, కంటైనర్లను శుభ్రపరచడం వంటి అంశాలు తప్పనిసరిగా పాటించాలని కలెక్టర్ వివరించారు. బిఐఎస్ ప్రమాణాలకు విరుద్ధంగా నీరు సరఫరా చేయడం, ఆరోగ్యానికి హానికరమైన స్థాయిలో కలుషిత నీరు అందించడం, లైసెన్స్ లేకుండా ప్లాంట్ నడపడం తదితర నిబంధనలు సంబంధిత ఆర్ఓ ప్లాంట్ను సీజ్ చేసేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ స్పష్టం చేశారు.
ప్రజల ఆరోగ్యం విషయంలో ఎటువంటి రాజీ లేదని, త్రాగునీరు నాణ్యతలో నిర్లక్ష్యం సహించబోమని కలెక్టర్ గట్టి హెచ్చరికలు జారీ చేశారు.