ఉల్లి రైతులను ఆదుకునేందుకు సీఎం చంద్రబాబు అన్నివిధాలా కృషి చేస్తున్నారు
రాష్ట్ర మంత్రి టి.జి భరత్

ఉల్లి రైతులను ఆదుకునేందుకు సీఎం చంద్రబాబు అన్నివిధాలా కృషి చేస్తున్నారు
రాష్ట్ర మంత్రి టి.జి భరత్
కర్నూల్ ప్రతినిధి సెప్టెంబర్ 21 యువతరం న్యూస్:
కష్టాల్లో ఉన్న ఉల్లి రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటోందని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి భరత్ అన్నారు. ఉల్లి పండించిన ప్రతి రైతుకు హెక్టారుకు రూ.50వేలు ఆర్థిక సహాయం అందించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకోవడం పట్ల టి.జి భరత్ కృతజ్నతలు తెలిపారు. ఈ మేరకు మంత్రి ఒక ప్రకటన విడుదల చేశారు. తమ ప్రభుత్వం రైతులకు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు. హెక్టారుకు రూ.50వేలు ఆర్థిక సహాయం చేయాలన్న నిర్ణయంతో ప్రభుత్వంపై వంద కోట్ల రూపాయలకు పైగా భారం పడినప్పటికీ సీఎం చంద్రబాబు వెనక్కు తగ్గకుండా రైతులకు మేలు చేసేందుకు ముందుకు వచ్చినట్లు మంత్రి టి.జి భరత్ తెలిపారు. ఈ ఆర్థిక సహాయం ద్వారా 24,218 మంది రైతులకు లబ్ది చేకూరుతుందన్నారు. రైతులకు మేలు చేస్తుంటే ఓర్వలేని వైసీపీ నాయకులు ప్రభుత్వంపై బురదజల్లుతున్నారన్నారు. గత ప్రభుత్వంలో ఉల్లి ధరలు పతనమైనప్పటికీ పట్టించుకోలేదన్నారు. కూటమి ప్రభుత్వం మాత్రం రైతు శ్రమకు గౌరవం ఇచ్చి న్యాయమైన ధరలు రావడానికి కృషి చేస్తోందన్నారు. పంటలకు ధరలు పడిపోతే ప్రభుత్వమే కొనుగోలు చేసి రైతులకు అండగా నిలుస్తోందన్నారు. ఏడాదికి రూ.20వేలు పెట్టుబడి సాయం ఇస్తామన్న విధంగానే మొదటి విడతలో రూ.7వేలు జమచేశామన్నారు. ఉల్లి రైతులకు అండగా నిలబడేందుకు కిలో రూ.12 చొప్పున ప్రభుత్వం తరపున కొనుగోళ్లు చేశామన్నారు. ఇప్పుడు హెక్టారుకు రూ.50వేలు చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్లు ఆయన తెలిపారు. గతంలో సీఎంగా చంద్రబాబు నాయుడు ఉన్న సమయంలో కూడా ఉల్లి రైతులకు మద్దతు ధర ఇచ్చి ఆదుకున్నారని మంత్రి టి.జి భరత్ పేర్కొన్నారు.