
జిల్లాలో పచ్చదనం పెంపుకు కృషిచేయాలి
ఇళ్ళను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి
జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి
క్రిష్ణగిరి సెప్టెంబర్ 21 యువతరం న్యూస్:
జిల్లాలో పచ్చదనం పెంపుకు కృషిచేయాలని, ప్రతి ఒక్కరూ ఇళ్ళను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి పేర్కొన్నారు.
శనివారం స్వర్ణాంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా కృష్ణగిరి మండల కేంద్రంలో నిర్వహించిన “గ్రీన్ ఆంధ్రప్రదేశ్ (గ్రీన్ ఆంధ్ర ప్రదేశ్ )” అనే థీమ్ ర్యాలీ లో కలెక్టర్ పాల్గొన్నారు. అనంతరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో మొక్కలు నాటి, అక్కడే ఏర్పాటు చేసిన సభలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రతి నెల మూడో శనివారం స్వర్ణాంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. ఇందులో భాగంగా జనవరి నెలలో “న్యూ ఇయర్ – క్లీన్ స్టార్ట్” అనే థీమ్ తో, ఫిబ్రవరి నెలలో “సోర్స్ రిసోర్స్” మార్చి నెలలో “సింగిల్ యూస్ ప్లాస్టిక్ ను నిషేధిస్తాం” ఏప్రిల్ నెలలో “ఎలక్ట్రానిక్ వేస్ట్ చెక్” మే నెలలో “బీట్ ది హిట్” జూన్ నెలలో “నీరు మీరు” జూలై నెలలో “ప్లాస్టిక్ కాలుష్యంనుకు అంతం”, ఆగస్టు మాసంలో “వర్షాకాల పరిశుభ్రత (మొన్సూన్ హైజినే )” ఇప్పుడు సెప్టెంబర్ నెలలో “గ్రీన్ ఏపీ” అనే నినాదంతో శానిటేషన్ డ్రైవ్ కార్యక్రమాలను, మొక్కలు నాటే కార్యక్రమాలను చేస్తున్నామన్నారు.
జిల్లాలో అటవీ విస్తీర్ణం 7 శాతం మాత్రమే ఉందని, అందువల్ల ఈ విస్తీర్ణాన్ని 50 శాతం వరకు పెంచేందుకు ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ముఖ్యంగా ఈ సంవత్సరం ప్లాంటేషన్ డ్రైవ్ కింద 5 వేల మొక్కలు నాటడం జరిగిందన్నారు. ఇంకా అదనంగా 5 వేల మొక్కలు నాటేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. జిల్లాలో పచ్చదనం పెంపొందించడం వల్ల పర్యావరణ పరిరక్షణ తో పాటు కాలుష్యం తగ్గుతుందని, భూగర్భ జలం రీఛార్జ్ అవుతుందన్నారు. కాబట్టి మొక్కలు అందరూ నాటాలని, నాటిన మొక్కల్ని సంరక్షించుకోవాలని కలెక్టర్ సూచించారు. డయేరియా, మలేరియా, డెంగ్యూ లాంటి వ్యాధులు ప్రబలకుండా ప్రతి ఒక్కరూ తమ ఇంటితో పాటు పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలని కలెక్టర్ సూచించారు. హ్యాండ్ వాష్ చాలా ముఖ్యమని, వంట చేసే ప్రదేశం శుభ్రంగా ఉంచుకోవాలని, అదే విధంగా పిల్లలకి మంచి అలవాట్లు నేర్పించాలన్నారు. రోడ్ల మీద చెత్త పడేయడం వల్ల, అది మట్టిలోకి చేరి విషపూరితమైన కెమికల్స్ గా మారుతాయన్నారు. భావి తరాల కోసం పరిసరాల పరిశుభ్రత పాటించాల్సిన బాధ్యత మన మీద ఉందన్నారు. ప్రతి ఒక్కరు వారి ఇళ్లల్లో ఉండే చెత్తను తడి చెత్తగా పొడి చెత్తగా వేరుచేసి పెట్టాలన్నారు. ఇంటి ఇంటికి చెత్త సేకరణ కొరకు సిబ్బంది వచ్చినపుడు వారికి అందచేయాలని ప్రజలకు సూచించారు. చెత్త నుండి సంపద తయారీ కేంద్రాల ద్వారా చెత్తను వర్మీ కంపోస్ట్ గా తయారుచేసి, ఆ వర్మీ కంపోస్ట్ ను రైతులు వినియోగించుకునేందుకు ఉపయోగపడుతుందన్నారు..అలాగే ప్లాస్టిక్ ను వాడకూడదని, ప్లాస్టిక్ బ్యాగ్ ల బదులుగా జూట్ బ్యాగులను వాడాలని, ప్లాస్టిక్ బాటిల్స్ స్థానంలో స్టీల్ బాటిల్స్ లో నీటిని తాగాలని కలెక్టర్ సూచించారు. అదే విధంగా ఈ జిల్లాలో వలసల సమస్య ఎక్కువగా ఉందన్నారు. గుంటూరు, బెంగళూరు, హైదరాబాదు రాష్ట్రాల్లో పని దొరుకుతుందని వెళ్తున్నారని, వెళ్ళే సమయంలో పిల్లలను కూడా తీసుకొని వెళ్తున్నారని, అందువల్ల పిల్లల చదువు దెబ్బతింటుందన్నారు. పిల్లలు బాగా చదువుకుంటూనే మంచి స్థాయికి చేరుకుంటారని కలెక్టర్ తెలిపారు. కాబట్టి పిల్లలు స్కూల్స్ కి వెళ్లేలా చూడాలన్నారు. ఆడపిల్లలో చాలామందికి రక్తహీనత ఉంటుందని, కాబట్టి స్కూల్స్ లో టీచర్స్ చెప్పిన విధంగా ఆహారం తీసుకుని ఆరోగ్యంగా ఉండాలని కలెక్టర్ సూచించారు. అంగన్వాడీ కేంద్రం, పాఠశాలకు కాంపౌండ్ వాల్ నిర్మాణం, రోడ్ల మరమ్మతులు చేయించాలని, కటారికొండలో బీసీ హాస్టల్ ఏర్పాటు తదితర సమస్యలను తన దృష్టికి తీసుకొని వచ్చారని, వాటిని పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. కార్యక్రమం అనంతరం క్లాప్ మిత్రలకు కలెక్టర్ సన్మానం చేశారు. అదే విధంగా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పోషణ మాసోత్సవాల్లో భాగంగా నలుగురు చిన్నారులకు అన్న ప్రాసన చేశారు. కార్యక్రమంలో మండల స్పెషల్ అధికారి ఐసిడిఎస్ పిడి విజయ, డిఆర్డిఏ పిడి రమణా రెడ్డి, జిల్లా పరిషత్ సీఈఓ నాసర రెడ్డి, పత్తికొండ ఆర్డీఓ భరత్ నాయక్, డిపిఓ భాస్కర్, తహసిల్దార్ ప్రకాష్, సర్పంచ్ వరలక్ష్మి, మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ నబీ సాహెబ్, జడ్పీటీసీ సుహాసిని, తదితరులు పాల్గొన్నారు.