డిజిటల్ అరెస్టు పేరుతో వచ్చే కాల్స్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

డిజిటల్ అరెస్టు పేరుతో వచ్చే కాల్స్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
సైబర్ నేరగాళ్ళు చేసే మోసాలు అటువంటి వాటిని ఎవరు నమ్మవద్దు
కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపియస్
కర్నూలు ప్రతినిధి సెప్టెంబర్ 19 యువతరం న్యూస్:
ఇటీవల “డిజిటల్ అరెస్ట్” అనే పేరుతో సైబర్ మోసాలు ఎక్కువ అవుతున్నాయి. జాగ్రత్త. సైబర్ నేరాల్లో సొమ్ము రికవరీకి అవకాశం గంటలోపే. అప్రమత్తతే కీలకం. తెలియని వ్యక్తులకు బ్యాంకు ఖాతా ల ఒ.టి.పి.లను ఎవ్వరికీ చెప్పవద్దు. డిజిటల్ అరెస్టు పేరుతో సైబర్ నేరగాళ్ళు పోలీసులమని , సీబీఐ అధికారులమని లేదా ఇతర ప్రభుత్వ అధికారులుగా నటిస్తూ వీడియో కాల్స్ చేస్తూ మీ మీద కేసు నమోదైందని, గంజాయి, డ్రగ్స్ కేసుల్లో ఇరుక్కున్నారని, మీరు అక్రమ కార్యకలాపాల్లో పాల్గొన్నారని, మీ పేరు మీద కోరియర్ వచ్చిందని అందులో డ్రగ్స్ ఉన్నాయని లేదా మీ సిమ్/బ్యాంక్ ఖాతా కు వాడబడిందని వచ్చే కాల్స్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని శుక్రవారం కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ విజ్ఞప్తి చేశారు. డిజిటల్ అరెస్టు పేరుతో కాల్స్ వచ్చి మోసపోయామని సోమవారం జరిగే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో బాధితులు జిల్లా ఎస్పీ కి విన్నవించారన్నారు.
పోలీసులు ఎప్పుడూ వీడియో, ఆడియో కాల్స్ చేయరన్న విషయం గ్రహించాలన్నారు. ఎవరికీ కూడా వీడియో కాల్ ద్వారా అరెస్టు గురించి సమాచారం చెప్పడం పోలీసుల పని కాదన్నారు. అసలైన అధికారులు బ్యాంక్ ఖాతా / ఆధార్ / ఓటీపీ అడగరన్నారు. కేసులో సహాయం చేస్తామని, నమ్మించి, తాము సూచించిన బ్యాంకు ఖాతాకు భారీగా నగదు పంపాలని కోరుతారన్నారు. తమతో మాట్లాడిన వివరాలను ఎవ్వరికీ తెలపకుండా ఉండాలని తమ బ్యాంకు ఖాతాను రిజర్వు బ్యాంకు సహకారంతో పరిశీలించాల్సి ఉందని, వివరాలు సేకరించి, తమ యొక్క బ్యాంకు ఖాతాలలో ఉన్న డబ్బును కాజేస్తారన్నారు.
ఉదాహరణ 1:
కర్నూలు జిల్లా, ఆదోని పట్టణానికి చెందిన ఒక వ్యక్తి కి వీడియో కాల్ వచ్చింది. అతనికి కాల్ చేసిన ఒక వ్యక్తి తాను సిబిఐ అధికారిగా పరిచయం చేసుకొని మీ పేరు మీద డ్రగ్స్ కేసు నమోదైందని , భయభ్రాంతులకు గురిచేసి , కేసు పరిష్కారం కోసం వెంటనే వారి చెప్పిన బ్యాంకు ఖాతాలోకి రూ. 1 లక్ష 25 వేలు జమ చేయాలని తెలిపాడు. ఆ మాటలు నమ్మి డబ్బులు పంపి మోసపోయాడు.
ఉదాహరణ 2:
కర్నూలు పట్టణానికి చెందిన గృహిణి కి ఓ వ్యక్తి నుంచి కాల్ వచ్చింది. అతను పోలీసు అధికారి అని చెప్పి , మీ పేరు మీద బ్యాంక్ అకౌంట్ మిస్‌యూజ్ అయిందని ఆరోపించాడు. ఆమెకు ఓ లింక్ పంపి, అందులో ఆధార్, బ్యాంక్ డీటెయిల్స్, ఓటీపీ ఇవ్వాలని చెప్పాడు. భయంతో ఆమె అన్ని వివరాలు ఇచ్చేసింది. కొన్ని నిమిషాల్లోనే ఆమె బ్యాంక్ ఖాతా నుండి రూ. 78 వేలు మోసపోయింది.
ఎవరైనా తెలియని వ్యక్తులు కాల్ చేసి భయభ్రాంతులకు గురి చేస్తే అటువంటి ఫోన్ నెంబర్లను బ్లాక్ చేసి ఆ సమాచారాన్ని స్థానిక పోలీసు స్టేషన్ లోగాని లేదా సైబర్ ల్యాబ్ పోలీసులకు గాని సమాచారం అందించాలన్నారు. ఈ తరహా నేరాల్లో ఎవరైనా నగదును పోగొట్టు కొన్నట్లయితే ఒక గంటలోపే 1930 కు లేదా నేషనల్ సైబరు క్రైం పోర్టల్లో ఎచ్ టిటి పిఎస్ /సైబరక్రైమ్ .గవర్నమెంట్ .ఇన్. కు రిపోర్టు చేయాలన్నారు.
సైబర్ నేరం జరిగిన గంటలోపే ఫిర్యాదు చేస్తే సైబర్ నేరగాళ్లు దోచుకున్న సొమ్మునంతా తిరిగి రికవరీ చేసి ఇప్పించేందుకు పోలీసులకు అవకాశం ఉంటుందని, గంటలోపే అప్రమత్తతే కీలకమని దాన్ని గోల్డెన్ అవర్ అని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేశారు.