జి.ఎస్.టి సంస్కరణలతో వికసిత్ భారత్ కు పునాదులు
మధురవాడ లో జరిగిన జి.ఎస్.టి అవగాహనా సదస్సులో కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్

జి.ఎస్.టి సంస్కరణలతో వికసిత్ భారత్ కు పునాదులు
జి.ఎస్.టి 4 స్లాబ్ ల నుండి రెండు స్లాబ్ లకు తగ్గింపు
ప్రజల పై భారం తగ్గించడమే ధ్యేయంగా జి.ఎస్.టి 2.o
మధురవాడ లో జరిగిన జి.ఎస్.టి అవగాహనా సదస్సులో కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్
ఉత్తరాంధ్ర ప్రతినిధి సెప్టెంబరు 17
యువతరం న్యూస్:
దేశం లో అన్ని వర్గాల ప్రజల పై ప్రభావం చూపేది జి.ఎస్.టి మాత్రమేనని, అందుకే ప్రజలందరికీ భారం తగ్గించేలా , అందరికి ఆమోదయోగ్యమైన సంస్కరణలను చేపట్టడం జరిగిందని కేంద్ర ఆర్థిక శాఖామంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. ఈ సంస్కరణలు ప్రధాని ఆశయసాధనకు తోడ్పాటును అందిస్తామని , వికసిత్ భారత్ కు పునాదులు వేస్తాయని తెలిపారు.
మధురవాడ లో వి.కన్వెన్షన్స్ నందు జరిగిన జి.ఎస్.టి అవగాహనా సదస్సులో మంత్రి పాల్గొన్నారు. తొలుత పలు వాణిజ్య సంస్థల ప్రతినిధుల సందేహాలకు, ప్రశ్నలకు ఆమె సమాధానాలు ఇచ్చారు. అనంతరం జి.ఎస్.టి పై గత స్లాబ్ లు ప్రస్తుత స్లాబ్ లు, ఏయే వస్తువుల పై ఎంతెంత పన్ను తగ్గించారు, పన్ను నుండి పూర్తిగా మినహాయింపు పొందిన వస్తువులు తదితర అంశాల పై సమగ్రంగా పవర్ పాయింట్ పై వివరించారు. గతం లో 5,12,18,28 శాతం గా ఉండే పన్నులు ప్రస్తుతం 5, 18 శాతం మాత్రమే అమలులోకి వస్తున్నాయని తెలిపారు. ఈ నెల 22 నుండి కొత్త జి.ఎస్.టి అమలులోకి వస్తుందని, 12 శాతం జి.ఎస్.టి ఉండే వస్తువులు 99 శాతం వరకు 5 శాతం జి.ఎస్.టి లోకి వెళ్లాయని, అలాగే 28 శాతం ఉన్న వస్తువులు 90 శాతం వరకు 18 శాతం పన్ను లోకి వెళ్లాయని, దీని వలన పేద, మధ్య తరగతి వారి ఖర్చు తగ్గి, వారి కొనుగోలు శక్తి పెరుగుతుందని మంత్రి పేర్కొన్నారు.
ప్రధానంగా వైద్య, ఆరోగ్యానికి సంబంధిన ఎక్విప్మెంట్, మందుల పై ఎటువంటి జి.ఎస్.టి లేదని తెలిపారు. రైతులకు సంబంధించిన పరికరాలు, ఎం.ఎస్.ఎం.ఈ తదితర రంగాల పై జి.ఎస్.టి ని తగ్గించడం జరిగిందన్నారు. ప్రజలు చెల్లించే పన్నులను సక్రమంగా ఖర్చు చేసే బాధ్యత ప్రభుత్వం పై ఉండాలని, జి.ఎస్.టి నుండి దేశానికి వచ్చే ఆదాయాన్ని తిరిగి ప్రజలకే అభివృద్ధి, సంక్షేమ పథకాల రూపం లో అందించడం జరుగుతోందన్నారు. జాతీయ రహదారుల, ఎయిర్పోర్ట్ లు, పోర్ట్ లు, తదితర మౌలిక వసతుల కల్పనకు ఈ పన్నులు ఉపయోగ పడతాయన్నారు. వినియోగదారులు, వాణిజ్య వేత్తలు, తయారీ దారు, ఎగుమతిదారులు, ప్రభుత్వం కూడా లబ్ది పొందడమే సంస్కరణల ప్రధాన లక్ష్యమని అన్నారు.
రాష్ట్ర ఆర్ధిక శాఖామంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ జి.ఎస్.టి సంస్కరణలు అకస్మాత్తుగా తీసుకున్న నిర్ణయం కాదని, అంతకు ముందు కౌన్సిల్ సమావేశం లో అన్ని రాష్ట్రాల సమక్షం లో మేధో మధనం చేసి, ప్రజల కోసం, దేశం కోసం తీసుకున్న గొప్ప నిర్ణయమని అన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా , ఆర్ధికంగా ప్రజలకు, ప్రభుత్వానికి మేలు జరిగేలా జి.ఎస్.టి సంస్కరణలు ఉన్నాయన్నారు. కోవిడ్ కాలం లో కూడా ఆర్ధిక సంక్షోభం తలెత్తకుండా దేశాన్ని నడిపిన ప్రధాని మోడీ ఐ.సి.యు లో నున్న మన రాష్ట్రానికి ఆక్సిజన్ అందించారని పేర్కొన్నారు.
రాష్ట్ర వైద్య శాఖామంత్రి వై.సత్యకుమార్ మాట్లాడుతూ క్లిష్ట పరిస్థితుల్లో ఆర్ధిక శాఖను పటిష్ఠ0గా నిర్వహించిన మంత్రి నిర్మలా సీతారామన్ సంస్కరణలు పేదలకు మేలు చేసేవిగానే ఉంటాయని అన్నారు. ప్రపంచంలో నే అత్యధిక జిడిపి నమోదైన దేశంగా భారత్ ను నిలిపారని, అతి తక్కువ కాలం లొనే మోడీ నిర్మాణాత్మక చర్యల వలన ప్రపంచం లో 11 వ స్థానం లో నున్న భారత్ ప్రస్తుతం 4 వ అతి పెద్ద ఆర్ధిక వ్యవస్థ గా నిలిచిందని తెలిపారు. త్వరలోనే 1వ స్థానం లోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో బిజెపి ఎం.ఎల్.ఏ, ఫ్లోర్ లీడర్ విష్ణు కుమార్ రాజు,బి బిజెపి రాష్ట్ర అధ్యక్షులు మాధవ్, విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు పరశురామ్, జి.ఎస్.టి రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్, బి.ఎన్.ఐ, టెక్స్టైల్స్, పాప్సి, హోటల్స్, స్టిల్, క్రెడాయ్, టాక్స్ పేయర్స్ తదితర వాణిజ్య సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.