ఉల్లి రైతులను అడ్డం పెట్టుకొని వైసీపీ నేతలు డ్రామాలు
రాష్ట్ర మంత్రి టి.జి భరత్

ఉల్లి రైతులను అడ్డం పెట్టుకొని వైసీపీ నేతలు డ్రామాలు
రాష్ట్ర మంత్రి టి.జి భరత్
ఎన్ని కుట్రలు పన్నినా వైసీపీని ప్రజలు నమ్మరు
కర్నూలు టౌన్ సెప్టెంబర్ 07 యువతరం న్యూస్:
ఉల్లి రైతులను అడ్డం పెట్టుకొని వైసీపీ నేతలు డ్రామాలు ఆడుతున్నారని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి భరత్ అన్నారు. ఉల్లి ధరల విషయంలో వైసీపీ వైఖరిని ఖండిస్తూ ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. తమ ప్రభుత్వం క్వింటం ఉల్లిని రూ.1200 కొనుగోలు చేస్తుందని ఇదివరకే సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించినట్లు గుర్తు చేశారు. అయినప్పటికీ వైసీపీ నేతలు ఈ విషయంలో రాజకీయం చేస్తున్నారని అన్నారు. క్షేత్ర స్థాయిలో ఏమైనా ఇబ్బందులు ఉంటే రైతులకు నష్టం లేకుండా చూసుకునేందుకు ప్రభుత్వం అన్నివిధాలా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. గడిచిన ఎన్నికల్లో ప్రజలు ఛీ కొట్టినా వైసీపీ నాయకులకు ఇంకా బుద్దిరాలేదన్నారు. ఒకవైపు సంక్షేమ కార్యక్రమాలు అమలుచేస్తూ, మరోవైపు రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు సీఎం చంద్రబాబునాయుడు అహర్నిశలు కష్టపడుతున్నారన్నారు. ఇది చూసి తట్టుకోలేని వైసీపీ నాయకులు ప్రతి విషయాన్ని రాజకీయం చేసేందుకు డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు 5 ఏళ్లు రైతులను పట్టించుకోలేదన్నారు. ఇప్పుడు ఏపని లేకుండా కేవలం రైతులను అడ్డం పెట్టుకొని ప్రభుత్వంపై బురదజల్లేందుకు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. ఉల్లి సమస్యను సీఎం చంద్రబాబు నాయుడు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారన్నారు. వైసీపీ అంటే డ్రామా.. డ్రామా అంటే వైసీపీ అని ఆయన ఎద్దేవా చేశారు. ఎలాంటి సమస్య లేకున్నా ఏదో ఉన్నట్టు సృష్టించడంలో వైసీపీ నేతలు ఆరితేరారని మంత్రి టి.జి భరత్ పేర్కొన్నారు. పేపర్ ఉంది కదా అని ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేయడం సరైంది కాదన్నారు. తమ ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను ప్రజలు గమనిస్తూ ఉన్నారన్నారు.