లాజిస్టిక్స్ హబ్ వైపు ఆంధ్రప్రదేశ్”

“లాజిస్టిక్స్ హబ్ వైపు ఆంధ్రప్రదేశ్”
ఉత్తరాంధ్ర ప్రతినిధి సెప్టెంబర్ 3 యువతరం న్యూస్:
విశాఖలో జరిగిన ఈస్ట్ కోస్ట్ మారిటైమ్ లాజిస్టిక్స్ సమ్మిట్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన ప్రసంగం ఒక దిశను చూపింది. “ప్రతీ పోర్టుకూ కనెక్టివిటీ మాస్టర్ ప్లాన్” అనే ఆయన ఆలోచన కేవలం మౌలిక వసతుల ప్రణాళిక మాత్రమే కాదు, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను రూపాంతరం చేర్చే ఒక విప్లవాత్మక అడుగు.
ఏపీకి 974 కిలోమీటర్ల తీరరేఖ ఉన్నా, ఇప్పటి వరకు ఈ వనరును సక్రమంగా వినియోగించుకోలేకపోయింది. కానీ ఇప్పుడు పోర్టులు, రైల్వేలు, రహదారులు, విమానాశ్రయాలు, అంతర్గత జలమార్గాలు – ఇవన్నీ ఒకే తాటిపైకి వచ్చేలా అనుసంధానం జరగబోతోంది. దీని వలన రవాణా వ్యయాలు తగ్గడం, సమయం ఆదా కావడం మాత్రమే కాకుండా, రాష్ట్రానికి “జాతీయ, అంతర్జాతీయ లాజిస్టిక్స్ మ్యాప్” లో ఒక ప్రత్యేక గుర్తింపు వస్తుంది.
ముఖ్యమంత్రి చెప్పినట్టుగా, బకింగ్ హామ్ కెనాల్ పునరుద్ధరణ, గోదావరి–కృష్ణా జలమార్గాల వినియోగం, ఎయిర్ కార్గో విస్తరణ – ఇవన్నీ వాస్తవ రూపం దాల్చితే, ఏపీ పోర్టులు పొరుగు రాష్ట్రాలకే కాకుండా ఉత్తర భారతదేశానికి కూడా గేట్వే గా మారతాయి. షిప్ బిల్డింగ్, మరమ్మత్తులు, కంటైనర్ రీసైక్లింగ్, టౌన్‌షిప్‌లు, యూనివర్సిటీలు – ఇవన్నీ కలిపి ఒక “పోర్ట్ ఆధారిత ఆర్థిక వ్యవస్థ” ని నిర్మిస్తాయి.
అయితే సవాళ్లు లేకపోలేదు. భూముల సమీకరణ, పర్యావరణ అనుమతులు, పెట్టుబడుల సమీకరణ – ఇవి సజావుగా జరగాలి. అంతేకాకుండా, ప్రణాళికలు కాగితంపై నిలిచి పోకుండా వాస్తవానికి అనుగుణంగా అమలు కావాలి.
ఏపీకి ఈ అవకాశాన్ని వినియోగించుకోవడం అత్యవసరం. ఎందుకంటే లాజిస్టిక్స్ అంటే కేవలం సరకు రవాణా మాత్రమే కాదు, అది కొత్త పరిశ్రమలు, కొత్త ఉద్యోగాలు, కొత్త అవకాశాలకు తలుపులు తెరవడం. తూర్పు తీరమంతా లాజిస్టిక్స్ శక్తివంతంగా మారితే, ఆంధ్రప్రదేశ్ నిజంగానే “ఈస్ట్ కోస్ట్ గేట్‌వే” అవుతుంది.