ఘనంగా శ్రీ చౌడేశ్వరి అమ్మవారి పుట్టినరోజు వేడుకలు

ఘనంగా శ్రీ చౌడేశ్వరి అమ్మవారి పుట్టినరోజు వేడుకలు
యాడికి జులై 25 యువతరం న్యూస్:
మండల కేంద్రంలోని సంత మార్కెట్లో మరియు కోన రోడ్డులో వెలసిన శ్రీ చౌడేశ్వరి దేవి ఆలయాలలో గురువారం అమ్మవారి పుట్టినరోజు సందర్భంగా ఘనంగా వేడుకలు నిర్వహించారు. శ్రీ చౌడేశ్వరీ దేవి అమ్మవారి ఆలయంలో ఉదయం నుంచి ప్రత్యేక పూజలు, అమ్మవారికి రంగురంగుల పూలమాలలతో అలంకరించడం జరిగింది.శ్రీ చౌడేశ్వరీ దేవి అమ్మవారు కొలిచేవారికి కొంగు బంగారం.ఆషాడమాసం చివరి రోజైన అమావాస్యను పురస్కరించుకుని అమ్మవారికి ఉదయాన్నే అభిషేకం నిర్వహించి ప్రత్యేకంగా వస్త్రాలతో, పూలమాలలతో, నిమ్మకాయలతో అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. కుంకుమార్చన చేశారు. ఉదయం నుంచి గ్రామ ప్రజలకు భక్తులకు పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. సాయంత్రం అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ప్రత్యేకంగా అలంకరించిన రతంలో ఉంచి గ్రామోత్సవం నిర్వహించారు. రాత్రి ఆలయప్రాంగణంలో దీపాలు వెలిగించి భక్తులు తమ భక్తి భావాన్ని చాటుకున్నారు. అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకొని పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు , గ్రామ పెద్దలు, భక్తులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.