ఆకస్మిక విపత్తులపై మాక్ డ్రిల్

ఆకస్మిక విపత్తులపై మాక్ డ్రిల్
మాక్ డ్రిల్ పై సమీక్షా సమావేశం నిర్వహించిన జాయింట్ కలెక్టర్ సి. విష్ణుచరణ్, జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా
రామ్ నాథ్ థియేటర్ సర్కిల్ లో మాక్ డ్రిల్స్ నిర్వహణ
నంద్యాల కలెక్టరేట్ మే 8 యువతరం న్యూస్:
భారతదేశం-పాకిస్తాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆకస్మిక విపత్తులపై నంద్యాల పట్టణంలో మాక్ డ్రిల్ నిర్వహించాలని జాయింట్ కలెక్టర్ సి. విష్ణుచరణ్, జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణాలు సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాలలో మాక్ డ్రిల్ నిర్వహణపై సంబంధించి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్, ఎస్పిలు మాట్లాడుతూ మాక్ డ్రిల్ అనేది ఉగ్రవాద దాడులు, ప్రకృతి వైపరీత్యాలు లేదా సామూహిక ప్రమాదాల వంటి సంక్షోభాలను ఎదుర్కోవడంతోపాటు పరిసర ప్రాంతాల్లోని ప్రజలను అప్రమత్తం చేసి అవగాహన కల్పించేందుకు ఉపయోగపడుతుందన్నారు. భారతదేశం-పాకిస్తాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆకస్మిక విపత్తులపై నంద్యాల పట్టణంలో మాక్ డ్రిల్ నిర్వహించేందుకు సంబంధిత అధికారులు సమాయత్తం కావాలని సూచించారు. మాక్ డ్రిల్స్ నిర్వహణకు కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని డిఆర్ఓ రామునాయక్ ను జాయింట్ కలెక్టర్ ఆదేశించారు. అదే విధంగా వైద్య శాఖ వారిని 108 వాహనాలు, స్ట్రెచర్స్ అత్యవసర మెడికల్ అధికారులను సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. మాక్ డ్రిల్స్ విపత్తు నిర్వహణ ప్రమాదం సంభవించినప్పుడు ఏ రీతిలో అనుసరిస్తామో అదే రీతిలో నిర్వహించాలని అగ్నిమాపక సిబ్బంది ఆదేశించారు. విపత్తు ఎదుర్కొనే సమయంలో ప్రజలంతా ఒకే చోట గుమ్మికూడకుండా చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్, జిల్లా ఎస్పీ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమాలు పాఠశాలలు, కార్యాలయాలు, ఆసుపత్రులు, ప్రజా స్థలాల్లో నిర్వహించడం తద్వారా అందరూ విపత్తు సమయంలో సరైన చర్యలు తీసుకోగలరన్నారు.
రామ్ నాథ్ థియేటర్ సర్కిల్ లో మాక్ డ్రిల్స్ నిర్వహణ
బుధవారం నంద్యాల పట్టణంలోని రామ్ నాథ్ సెంటర్ లో అనుకోని విపత్తులు సంభవించినప్పుడు ఎదుర్కొనేందుకు మరియు ప్రజల్లో అవగాహన తీసుకొచ్చేందుకు సంబంధిత శాఖలు మాక్ డ్రిల్స్ నిర్వహణ కార్యక్రమం సంబంధిత అధికారులు కన్నులకు కట్టినట్లుగా చూపించారు. మాక్ డ్రిల్ ద్వారా అత్యవసర పరిస్థితులను అనుకరించే సాంకేతిక శిక్షణా కార్యక్రమని ఈ తరహా మాక్ డ్రిల్స్ విపత్తులు లేదా అత్యవసర సంఘటనల సమయంలో సన్నద్ధతను పెంచడానికి ఉపకరిస్తుందన్నారు. భూకంపాలు, అగ్ని ప్రమాదాలు, వరదలు, ఉగ్రవాద దాడులు వంటి సంఘటనలను అనుకరిస్తూ, ప్రజలు, సంస్థలు, అధికారులు ఎలా స్పందించాలో అవగాహన కల్పించడం ప్రధాన లక్ష్యమన్నారు. మాక్ డ్రిల్ నిర్వహణ వల్ల ప్రజల భద్రత, సన్నద్ధతను గణనీయంగా మెరుగు పడుతుందన్నారు. విపత్తు సమయంలో తీసుకోవాల్సిన చర్యల గురించి అవగాహన కల్పించి తద్వారా ప్రజలు గందరగోళానికి గురి కాకుండా త్వరగా స్పందించగలరన్నారు. మాక్ డ్రిల్ సమయంలో సురక్షిత ప్రాంతాలకు చేరడం, తలను కాపాడుకోవడం వంటి టెక్నిక్‌లను నేర్చుకోవచన్నారు. ఈ డ్రిల్స్ ద్వారా అత్యవసర సేవలైన అగ్నిమాపక దళం, పోలీసులు, వైద్య బృందాల సమన్వయాన్ని మెరుగుపరుస్తాయి, ఇది వాస్తవ సంఘటనల్లో సమర్థవంతమైన రక్షణ చర్యలకు దోహదపడుతుందన్నారు. మాక్ డ్రిల్స్ ద్వారా భవిష్యత్తులో జరిగే నష్టాన్ని అరికట్టవచ్చన్నారు.
ఈ కార్యక్రమంలో నంద్యాల ఏఎస్పీ మంద జవాలి అల్ఫోన్స్, డిఆర్ఓ రాము నాయక్, నంద్యాల ఆర్డీఓ విశ్వనాథ్, పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్లు, పట్టణ తాసిల్దార్లు, సాయుధ బలగాలు తదితరులు పాల్గొన్నారు.