ఒలింపిక్ విభాగం ‘రికర్వ్’లో అద్భుత ప్రతిభ
కడమూరు విలువిద్య ‘బాల’కిశోరం. జాతీయ స్థాయికి ఇషాంత్ పయనం


కడమూరు విలువిద్య ‘బాల’కిశోరం.
జాతీయ స్థాయికి ఇషాంత్ పయనం
రాష్ట్ర స్థాయి ఆర్చరీలో మెరిసిన నాలుగో తరగతి విద్యార్థి
ఒలింపిక్ విభాగం ‘రికర్వ్’లో అద్భుత ప్రతిభ
హర్షం వ్యక్తం చేసిన ప్రముఖులు మరియు కుటుంబ సభ్యులు
కర్నూలు ప్రతినిధి మార్చి 19 యువతరం న్యూస్:
లక్ష్యంపై గురి పెడితే వయసుతో నిమిత్తం లేదని నిరూపించాడు కర్నూలు జిల్లా కడమూరు గ్రామానికి చెందిన చిన్నారి సంధ్యపోగు ఇషాంత్. కృష్ణా జిల్లా నూజివీడు వేదికగా ఇటీవల (మార్చి 13న) జరిగిన రాష్ట్ర స్థాయి ఆర్చరీ పోటీల్లో ఇషాంత్ మెరుపులు మెరిపించాడు. అండర్-10 బాలుర విభాగంలో అద్భుతమైన ప్రదర్శన కనబరిచి, రాష్ట్ర స్థాయిలో 8వ స్థానాన్ని కైవసం చేసుకోవడమే కాకుండా, ప్రతిష్టాత్మకమైన జాతీయ స్థాయి ఆర్చరీ ఛాంపియన్‌షిప్‌కు ఎంపికై జిల్లా ఖ్యాతిని చాటాడు.
ఒలింపిక్ విభాగంలో అరుదైన ప్రతిభ. ఆర్చరీ క్రీడలో ‘రికర్వ్’
విభాగం అత్యంత క్లిష్టమైనది. అంతర్జాతీయ స్థాయిలో, ముఖ్యంగా ఒలింపిక్స్‌లో కేవలం ఈ రికర్వ్ విభాగానికే గుర్తింపు ఉండటంతో క్రీడాకారులు దీనిని సవాలుగా తీసుకుంటారు. కేవలం నాలుగో తరగతి చదువుతున్న ఇషాంత్, ఇంత చిన్న వయసులోనే ఈ విభాగంలో జాతీయ స్థాయికి ఎంపిక కావడంపై క్రీడా నిపుణులు ప్రశంసలు కురిపిస్తున్నారు.
ప్రముఖుల ప్రశంసలు – శుభాకాంక్షల వెల్లువ
ఇషాంత్ సాధించిన ఈ ఘనత పట్ల క్రీడా మరియు రాజకీయ రంగ ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు. ఆర్చరీ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి రామస్వామి, పాణ్యం నియోజకవర్గ కోఆర్డినేటర్ మద్దిలేటి రెడ్డి, బిజెపి ఈసీ మెంబర్ రవితేజ, బిజెపి పివిసి మెంబర్ మాలతి, జిల్లా కార్యదర్శి రామ్మోహన్ రెడ్డి తదితరులు ఇషాంత్ కు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. గ్రామీణ ప్రాంతం నుండి ఇలాంటి క్రీడాకారులు రావడం గర్వకారణమని వారు కొనియాడారు.
ఒలింపిక్సే లక్ష్యం..
ఇషాంత్ విజయం పట్ల అతని తల్లిదండ్రులు మరియు బాబాయ్, హైకోర్టు అడ్వకేట్ చిట్టెన్న, రవికుమార్ ఆనందం వ్యక్తం చేశారు. “ఇషాంత్ ప్రతిభ మాకెంతో గర్వకారణం. జాతీయ స్థాయిలో కూడా రాణించి, భవిష్యత్తులో ఒలింపిక్స్‌లో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కీర్తిని విశ్వవ్యాప్తం చేస్తాడని నమ్ముతున్నాం” అని వారు ఆకాంక్షించారు. కర్నూలు జిల్లా క్రీడాకారులు మరియు కడమూరు గ్రామస్తులు ఇషాంత్ కు ఘనంగా సన్మానం చేసి అభినందనలు తెలిపారు.


