ANDHRA PRADESHDEVOTIONALWORLD

శ్రీశైలంలో స్వామి అమ్మవార్ల రథోత్సవం వైభవంగా నిర్వహణ

జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి, జిల్లా ఎస్పీ సునీల్ షోరాన్, జాయింట్ కలెక్టర్ కొల్లా బత్తుల కార్తీక్ పర్యవేక్షణలో ఘనంగా రథోత్సవం

స్వామి అమ్మవార్ల రథోత్సవం వైభవంగా నిర్వహణ

జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి, జిల్లా ఎస్పీ సునీల్ షోరాన్, జాయింట్ కలెక్టర్ కొల్లా బత్తుల కార్తీక్ పర్యవేక్షణలో ఘనంగా రథోత్సవం

శ్రీశైలం / నంద్యాల ప్రతినిధి ఫిబ్రవరి 16 యువతరం న్యూస్:

శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని స్వామి అమ్మవార్ల రథోత్సవం భక్తి శ్రద్ధల మధ్య వైభవోపేతంగా, కనుల పండుగగా నిర్వహించబడింది. వేలాది మంది భక్తులు పాల్గొని “హర హర మహాదేవ” నినాదాలతో క్షేత్రాన్ని మార్మోగించారు. ఉత్సవ మూర్తులైన స్వామి అమ్మవార్లను ప్రత్యేక అలంకరణలతో రథంపై ప్రతిష్టించి ఆలయ ప్రధాన వీధుల గుండా ఘనంగా ఊరేగించారు. అర్చకులు వేదమంత్రోచ్ఛారణల మధ్య పూజా కార్యక్రమాలు నిర్వహించగా, భక్తులు భక్తిశ్రద్ధలతో రథాన్ని లాగుతూ తమ భక్తిని చాటుకున్నారు.

ముందుగా సంప్రదాయాన్ని అనుసరించి రథోత్సవానికి ముందుగా రథాంగపూజ, రథాంగహోమం, రథాంగబలి కార్యక్రమాలు ఆగమశాస్త్ర విధానానుసారం నిర్వహించబడ్డాయి. రథాంగబలి కార్యక్రమంలో వసంతంతో నింపిన గుమ్మడికాయలు, కొబ్బరికాయలు, కుంభం (అన్నం రాశి)లను సాత్వికబలిగా సమర్పించడం జరిగింది. అనంతరం శ్రీ స్వామి అమ్మవార్లను రథంపైకి వేంచేబు చేయించి వేదఘోషాలు, మంగళవాయిద్యాలు, శివనామస్మరణల మధ్య రథోత్సవం ప్రారంభమైంది. భక్తులు హారతులతో, జైజైధ్వనులతో స్వామి అమ్మవార్లను దర్శించుకునున్నారు. ఈ రథోత్సవ దర్శనం వలన సర్వపాపాలు తొలగిపోతాయని, కోరిన కోరికలు నెరవేరుతాయని శాస్త్రోక్త విశ్వాసం. రథోత్సవాన్ని పురస్కరించుకొని రథాన్ని ప్రత్యేకంగా అలంకరించారు. బంతి, చామంతి, గులాబీలు, కాగడాలు, కనకాంబరాలు, చాందిని, గ్లాడియోలస్, కార్నియా, ఆస్టర్స్ తదితరంగా మొత్తం 11 రకాల సుగంధ పుష్పాలతో రథాన్ని శోభాయమానంగా తీర్చిదిద్దారు. రాత్రివేళ వెలుగుల కాంతుల్లో రథం మరింత ఆకర్షణీయంగా కనువిందు చేసాయి.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ శ్రీమతి జి. రాజకుమారి రథోత్సవ ఏర్పాట్లను ప్రత్యక్షంగా పరిశీలించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. తాగునీరు, పారిశుద్ధ్యం, ట్రాఫిక్ నియంత్రణ, క్యూలైన్ల నిర్వహణ తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించారు.

జిల్లా ఎస్పీ సునీల్ షోరాన్ భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. రథోత్సవ మార్గమంతా సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షణ కొనసాగించబడింది. ట్రాఫిక్‌ను సమర్థవంతంగా మళ్లిస్తూ భక్తుల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టారు. జాయింట్ కలెక్టర్ కొల్లా బత్తుల కార్తీక్ వివిధ శాఖల మధ్య సమన్వయం చేస్తూ సేవా కార్యక్రమాలు సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకున్నారు. భక్తులకు అన్నప్రసాదం, లడ్డూ ప్రసాదాల పంపిణీ, అగ్నిమాపక సిబ్బంది అప్రమత్తంగా ఉండేలా సూచనలు చేశారు. మహాశివరాత్రి సందర్భంగా నిర్వహించిన ఈ రథోత్సవం శ్రీశైల క్షేత్ర మహిమను మరింత చాటిచెప్పింది. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన భక్తులు భక్తిశ్రద్ధలతో పాల్గొని దైవానుగ్రహం పొందారు. జిల్లా యంత్రాంగం సమన్వయంతో చేపట్టిన విస్తృత ఏర్పాట్లతో ఉత్సవం విజయవంతంగా ముగిసింది.

YUVATHARAM NEWS

Related Articles

Back to top button
error: Content is protected !!