ANDHRA PRADESHPOLITICSSTATE NEWS

అనంతలో దండుపాళ్యం బ్యాచ్‌

వైఎస్‌ఆర్‌సీపీ అనంతపురం జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామిరెడ్డి స్పష్టీకరణ

అనంతలో దండుపాళ్యం బ్యాచ్‌

– 19 నెలలుగా ఎక్కడ చూసినా దౌర్జన్యాలు, దాడులు
– బందిపోటు ముఠా నాయకుడిగా ఎమ్మెల్యే
– చంద్రబాబు, నారా లోకేష్‌ ఆశీస్సులతోనే అరాచకాలు
– ఖాళీ జాగా కనిపిస్తే గద్దల్లా వాలిపోతున్నారు..!
– ప్రభుత్వ కార్యాలయాల్లో యథేచ్ఛగా దందాలు
– అనుకూలమైన పోలీసులను నియమించుకుని బెదిరింపులు
– సినిమా ఆడాలన్నా.. షోరూంలు ప్రారంభించాలన్నా ఎమ్మెల్యే పర్మిషన్‌ కావాలా?
– లాటరీలో మద్యం షాపులొస్తే మీకు ముడుపులివ్వాలా?
– కొత్తగా ఇల్లు కట్టుకోవాలంటే ఎమ్మెల్యే ఆఫీస్‌ను సంప్రదించాలా?
– గతంలో ఎవరు అధికారంలో ఉన్న ఇలాంటి పరిస్థితి లేదు
– టీడీపీ వాళ్ల ప్రాణాలకే రక్షణ లేకుంటే.. సామాన్యుల పరిస్థితేంటి?
– పోలీసు ఉన్నతాధికారుల ఉదాసీన వైఖరితోనే ఈ దుస్థితి
– దండుపాళ్యం బ్యాచ్‌లో పోలీసులు, రెవెన్యూ అధికారులు
– అందరి లావాదేవీలు పరిశీలిస్తే వాస్తవాలు వెలుగులోకొస్తాయ్‌..!
– ఈ పాలేగాళ్లకు ఎవరూ భయపడొద్దు.. మీకు అండగా ఉంటాం
– ప్రశాంతత కోరుకునే పార్టీలు, ప్రజాసంఘాలందరూ తోడుంటాం
– వైఎస్‌ఆర్‌సీపీ అనంతపురం జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామిరెడ్డి స్పష్టీకరణ

అనంతపురం 3 జనవరి 16 యువతరం న్యూస్:

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అనంతపురంలో దండుపాళ్యం బ్యాచ్‌ తయారైందని, ఈ ముఠాకు ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్‌ నాయకత్వం వహిస్తున్నారని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అనంతపురం జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామిరెడ్డి తెలిపారు. 19 నెలలుగా అనంతపురంలో దాడులు, దౌర్జన్యాలు, కబ్జాల పరంపర కొనసాగుతోందన్నారు. సీఎం చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేష్‌ ఆశీస్సులతోనే అరాచకాలు జరుగుతున్నాయని మండిపడ్డారు. శుక్రవారం వైసీపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే దగ్గుపాటి, ఆయన అనుచరులు చేస్తున్న దందాలను ఆయన వివరించారు. అనంత మాట్లాడుతూ…‘‘అనంతపురం నగరం అంటేనే ప్రశాంతతకు మారుపేరు. చాలా మంది ఇతర ప్రాంతాల వాళ్లు ఉద్యోగ రిత్యా వచ్చి ఇక్కడ స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. ఎవరు అధికారంలో ఉన్నా.. ఏ పార్టీ వాళ్లు వ్యాపారాలు చేసుకున్నా ఇక్కడ ఎవరూ అభ్యంతరం చెప్పలేదు. కానీ రాష్ట్రంలో చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం వచ్చాక అనంతపురంలో భిన్నమైన పరిస్థితి వచ్చింది. ఎక్కడ చూసినా దౌర్జన్యాలు, దాడులు, ప్రతీకార చర్యలు నిత్యకృత్యమయ్యాయి. దండుపాళ్యం అనే సినిమా తరహాలో ఈ రోజు అనంతపురంలో పరిస్థితి వచ్చింది. అనంతపురం నగరాన్ని అభివృద్ధి చేస్తామని అధికారంలోకి వచ్చిన ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్‌ ముఠా నాయకుడిగా మారిపోయారు. అరాచక శక్తులు, ఇతర ప్రాంతాల నుంచి బంధువులను తెచ్చి ముఠా ఏర్పాటు చేసి ఆ ముఠాకు నాయకత్వం వహిస్తూ ఆలీబాబా అరడజను దొంగల్లా ప్రవర్తిస్తున్నారు. ఎక్కడైనా ఖాళీ జాగా కనిపిస్తే గద్దల్లా వాలిపోతున్నారు. ఆ స్థలాలకు కంచెలు వేసి తమ ఆధీనంలోకి తీసుకుంటున్నారు. ఎవరైనా అది తమ స్థలం అని వస్తే బెదిరిస్తున్నారు. అధికారం అండతో పోలీసులను కూడా తనకు కావాల్సిన వాళ్లను నియమించుకుని బెదిరిస్తున్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్లపై లేనిపోని ఆరోపణలు చేయడమే కాకుండా దాడులు చేసేలా దండుపాళ్యం బ్యాచ్‌ వ్యవహరిస్తోంది. మీరు ఎవరికైనా ఫిర్యాదు చేసుకోండి.. మాకు సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్‌ ఆశీస్సులు ఉన్నాయని అంటున్నారు. ఎన్నికల్లో వాళ్లకు కోట్లు ఇచ్చి టికెట్‌ తెచ్చుకున్నాం. ఇప్పుడు సంపాదించుకోవడానికి కూడా వాళ్ల మద్దతు ఉందంటూ బెదిరించే పరిస్థితి ఇక్కడ ఉంది. ప్రభుత్వ, ప్రైవేట్‌ స్థలాలే కాకుండా తాతముత్తాతల నుంచి వచ్చిన ఆస్తులను కూడా కబ్జా చేస్తున్నారు. థియేటర్‌లో సినిమా ఆడించాలన్నా.. నగరంలో వ్యాపారం చేసుకోవాలన్నా.. ఏదైనా కొత్త షోరూం ప్రారంభించాలన్నా ఎమ్మెల్యే, ఎమ్మెల్యే ఆఫీస్‌తో పర్మిషన్‌ తీసుకోవాల్సిన పరిస్థితి తెచ్చారు. అనంతపురం నియోజకవర్గ పరిధిలో ఇళ్లు కట్టుకోవాలన్నా ఎమ్మెల్యే కార్యాలయానికి ముట్టజెప్పాలి. అప్పుడే టౌన్‌ ప్లానింగ్, కమిషనర్‌ పర్మిషన్‌ ఇచ్చే దౌర్భాగ్య పరిస్థితి నెలకొంది. పోలీస్‌ స్టేషన్లు, తహశీల్దార్‌ కార్యాలయాలకు వెళ్లినా ముందుగా ఎమ్మెల్యే ఆఫీస్‌కు వెళ్లండని చెబుతున్నారు. గతంలో ఏ పార్టీకి చెందిన వాళ్లు ఇక్కడ అధికారంలో ఉన్నా ఇలాంటి పరిస్థితి లేదు. ఒకప్పుడు ఫ్యాక్షనిస్టులు అనంతపురంలో నివాసం ఏర్పరచుకున్నా ఇంతలా ప్రవర్తించలేదు. గడిచిన 19 నెలలుగా అనేక సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. నారాయణపురం పంచాయతీలో బుడగజంగాలకు చెందిన ఐదున్నర ఎకరాలు కబ్జా చేశారు. అయినా పోలీసులు, రెవెన్యూ అధికారులు స్పందించలేదు. కక్కలపల్లిలో సాక్షాత్తూ జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి భరత్‌ బంధువులకు చెందిన మూడున్నర ఎకరాలు ఆక్రమించడానికి ప్రయత్నించారు. శారదానగర్‌లోనూ ఇదే పరిస్థితి. కోస్తా ప్రాంతానికి చెందిన ప్రొఫెసర్‌ కనకదుర్గ ఇక్కడే స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. రోడ్డు ప్రమాదంలో వాళ్లు చనిపోతే నకిలీ పత్రాలు సృష్టించి ఇంటిని కబ్జా చేశారు. రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల్లో దందా జరుగుతోంది. అక్కడ సిబ్బందిపై దౌర్జన్యాలు చేసినా అధికారులు చర్యలు తీసుకోలేదు. తెలుగుదేశం పార్టీకి చెందిన లింగాయత్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ స్వప్ప కూడా బాధితురాలే. ఏళ్ల తరబడి ఎగ్జిబిషన్‌ నడుపుకుంటున్న టీడీపీకే చెందిన ఫకృద్దీన్‌ ముడుపులు ఇవ్వలేదని దౌర్జన్యం చేశారు. మద్యం షాప్‌లో ముడుపులు ఇవ్వలేదని వెంకటరమణ అనే టీడీపీ వ్యక్తికి చెందిన షాప్‌నే తగలబెట్టే పరిస్థితి వచ్చింది. ఇన్ని ఘటనలు జరిగినా ఎస్పీ, డీఎస్పీ, డీఐజీలు ముఠాకు నాయకత్వం వహిస్తున్న వ్యక్తిని ప్రశ్నించలేదు. వాళ్ల అనుచరులపై కూడా కేసులు పెట్టలేదు. అందుకే ఎలాంటి భయం లేకుండాపోతోంది. లాడ్జిల్లో గదులు ఇవ్వకపోయినా దౌర్జన్యాలు చేస్తున్నారు. అనంతపురంలోని లాడ్జిల్లో పేకాట, మట్కా యథేచ్చగా జరుగుతోంది. చివరకు టీడీపీ వాళ్ల ప్రాణాలకు కూడా రక్షణ లేని పరిస్థితి నెలకొంది.
చంద్రబాబును ఒక్కటే ప్రశ్నిస్తున్నా..! అనంతపురంలో బందిపోట్ల మాదిరిగా ప్రవర్తిస్తుంటే అసలు నీ ప్రభుత్వం ఉందా? నీ ఇంటెలిజెన్స్‌ ఏమైంది? జిల్లాలోని ఇతర ప్రజాప్రతినిధులు, మంత్రులు నీకు చెప్పడం లేదా? కలెక్టర్లు, ఎస్పీల మీటింగుల్లో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే తోలు తీస్తామంటున్నావు..! 19 నెలలుగా ఎమ్మెల్యే, అతడి బంధులు అశోక్, స్వరూప్‌.. గంగారాం ఇంత చేస్తుంటే ఏం చేస్తున్నావు?
ఎప్పుడో నాలుగైదేళ్ల క్రితం సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టారని నిమిషాల్లో అరెస్ట్‌ చేస్తున్న పోలీసులకు.. ఎమ్మెల్యే అనుచరులు చిక్కడం లేదంటే వాళ్ల చిత్తశుద్ధి ఏంటో అర్థమవుతోంది. నిందితులను పోలీసులే పక్కకు పంపారు.! అధికార పార్టీ నేతల దౌర్జన్యాలపై తెలుగుదేశం పార్టీ వాళ్లే ఫిర్యాదులు చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అనంతపురంలో అనేక ఘటనలు జరిగాయి. చివరకు రుద్రంపేటకు చెందిన నారాయణరెడ్డి అనే అరటికాయల మండీ వ్యాపారిపై కూడా దాడులు చేశారు. మీ పార్టీ నాయకులు, కార్పొరేషన్ల చైర్మన్ల పరిస్థితే ఇలా ఉంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటి? బందిపోట్లకు నువ్వేమైనా లైసెన్స్‌ ఇచ్చావా? అందరూ పక్కాగా ప్లాన్‌ చేసి ఎవరి భూమి అయినా లాక్కుంటారా? జిల్లా కేంద్రంలో ఇలాంటి పరిస్థితి ఉంటే అధికారంలో ఉన్న మిగిలిన పార్టీలు ఏం చేస్తున్నాయి? ఇదే తెలుగుదేశం పార్టీ గతంలో అధికారంలో ఉన్నా ఇలాంటి పరిస్థితి లేదు. ఈ రోజు అందరూ భయపడే పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు కొంత మంది మాత్రమే ఫిర్యాదులు చేశారు. ఇకపై ఎవరి భూములు ఆక్రమించినా, వ్యాపారులను బెదిరించినా మాకు చెప్పండి. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మాత్రమే కాదు అనంతపురంలో శాంతి, ప్రశాంతత కోరుకునే అన్ని పార్టీలు, ప్రజాసంఘాలు మీకు అండగా ఉంటాయి. పాలేగాళ్లకు ఎవరూ భయపడొద్దు. ఇది పాలేగాళ్ల రాజ్యం కాదు.. తస్మాత్‌ జాగ్రత్త..! పోలీసులు కూడా అధికార పార్టీ నేతల అడుగులకు మడుగులు ఒత్తొద్దు. దండుపాళ్యం ముఠాలో పోలీసులు, రెవెన్యూ అధికారులు కూడా ఉన్నారు. ఈ బ్యాచ్‌లో 15 మందో.. 20 మందో ఉన్నారు. వాళ్ల లావాదేవీలు చూస్తే అన్నీ బయటకు వస్తాయి. ఈ రోజు అనుచరులను మాత్రమే కాదు.. ముఠా నాయకుడి పేరును కూడా స్వప్న (లింగాయత్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌), ఫకృద్దీన్‌ (ఎగ్జిబిషన్‌ నిర్వాహకుడు), మద్యం షాప్‌ యజమాని కూడా చెప్పారు. తక్షణం కఠిన చర్యలు తీసుకోవాలి’’ అని అనంత వెంకటరామిరెడ్డి డిమాండ్‌ చేశారు.

YUVATHARAM NEWS

Related Articles

Back to top button
error: Content is protected !!