రాష్ట్రంలో రెండేళ్లలోనే మెడికల్ కాలేజీల నిర్మాణం
రాష్ట్ర మంత్రి అనగాని సత్యప్రసాద్

రాష్ట్రంలో రెండేళ్లలోనే మెడికల్ కాలేజీల నిర్మాణం
రాష్ట్ర మంత్రి అనగాని సత్యప్రసాద్
రేపల్లె డిసెంబర్ 16 యువతరం న్యూస్:
రాష్ట్రంలో పిపిపి విధానంతో రెండేళ్లలోనే మెడికల్ కాలేజీల నిర్మాణం పూర్తి చేస్తామని రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్, స్టాంపుల శాఖా మంత్రి అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు. రేపల్లె టీడీపీ కార్యాలయంలో మంగళవారం మంత్రి అనగాని సత్యప్రసాద్ విలేకరులతో మాట్లాడుతూ మెడికల్ కాలేజీల నిర్మాణంలో పీపీపీ విధానంపై వైసీపీ నాయకులు అబద్దపు ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. పీపీపీ విధానాన్ని కేంద్ర ప్రభుత్వం కూడా మంచి విధానమని అభిప్రాయం వెల్లడించినట్లు ఆయన తెలిపారు. జగన్ రెడ్డి తన ఐదేళ్ల పాలనలో 500 కోట్లు ఖర్చు పెట్టి 5 మెడికల్ కాలేజీలు కూడా కట్టలేకపోయారని ఎద్దేవా చేశారు. పీపీపీ విధానంలో రెండేళ్లలోనే మెడికల్ కాలేజీల నిర్మాణంతో అదనపు ఉచిత, ఎన్ఆర్ఐ సీట్లు సమకూరుతాయని ఆయన తెలిపారు. జగన్ విధానంలో అయితే మెడికల్ కాలేజీల నిర్మాణానికి 25 ఏళ్లు పడుతుందన్నారు. కానీ వైసీపీ కోటి సంతకాల పేరుతో సిగ్గు లేకుండా తప్పుడు ప్రచారానికి తెగబడిందన్నారు. జగన్ కు అసలు రుషికొండపైన ఉన్న శ్రధ్ద మెడికల్ కాలేజీల నిర్మాణంపై ఉందా అని అనగాని ప్రశ్నించారు.
పులివెందులలో కూడా మెడికల్ కాలేజీ నిర్మించలేకపోయిన అసమర్ధుడు జగన్ అని ఆయన వర్ణించారు. సమావేశంలో కృష్ణా పశ్చిమ డెల్టా ప్రాజెక్టు కమిటీ చైర్మన్ పంతాని మురళీధర్, ధర్మ తేజ శివ సుబ్రహ్మణ్యం వేణు తదితరులు పాల్గొన్నారు.



