డిసెంబర్ 16 నుంచి కప్పరాడలో శ్రీ శ్రీ శ్రీ వైభవ వేంకటేశ్వర స్వామి వారి దివ్యక్షేత్రం ధనుర్మాస మహోత్సవాలు

డిసెంబర్ 16 నుంచి కప్పరాడలో శ్రీ శ్రీ శ్రీ వైభవ వేంకటేశ్వర స్వామి వారి దివ్యక్షేత్రం ధనుర్మాస మహోత్సవాలు
ఉత్తరాంధ్ర ప్రతినిధి డిసెంబర్ 14 యువతరం న్యూస్
కప్పరాడ, ఎన్ జి జి ఓ ఎస్ కాలనీ విశాఖపట్నం లోని శ్రీ శ్రీ శ్రీ వైభవ వేంకటేశ్వర స్వామి వారి దివ్యక్షేత్రంలో ధనుర్మాస మహోత్సవాలు డిసెంబర్ 16 నుంచి జనవరి 14 వరకు భక్తిశ్రద్ధలతో నిర్వహించనున్నట్లు ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ బండారు ప్రసాద్ తెలిపారు. ఈ ఉత్సవాలు డిసెంబర్ 16 సాయంత్రం 5 గంటలకు ధ్వజారోహణతో ప్రారంభమై, జనవరి 14 భోగి పండుగ రోజున ముగుస్తాయని ఆయన వెల్లడించారు.
ఉత్సవాల్లో భాగంగా నిత్య అభిషేకాలు, ప్రత్యేక పూజలు, హోమాలు, ఆర్జిత సేవలు నిర్వహించనున్నారు. డిసెంబర్ 30న ప్రత్యేక అలంకరణతో తిరుకల్యాణ మహోత్సవం, జనవరి 1న విశేష పూజలు, జనవరి 8న స్నపన తిరుమంజనం, జనవరి 11న కళ్యాణ సేవ, జనవరి 14న శ్రీ గోదాదేవి రంగనాథుల కళ్యాణం ఘనంగా జరుగనున్నట్లు తెలిపారు.
ఉత్సవాల సందర్భంగా భక్తుల కోసం అన్నదానం, ప్రసాద వితరణ కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ బండారు ప్రసాద్ విజ్ఞప్తి చేశారు.
ఈ వార్షిక ఉత్సవాలు కప్పరాడ ప్రాంతంలో భక్తి వాతావరణాన్ని నెలకొల్పనున్నాయని, స్థానికుల సహకారంతో కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని ఆలయ నిర్వాహకులు తెలిపారు.



