మిట్ట కందాల అంగన్వాడి కేంద్రంలో ఫుడ్ పాయిజన్
8 మంది చిన్నారులకు అస్వస్థత ప్రైవేట్ ఆస్పత్రులకు తరలింపు

మిట్ట కందాల అంగన్వాడి కేంద్రంలో ఫుడ్ పాయిజన్
8 మంది చిన్నారులకు అస్వస్థత
ప్రైవేట్ ఆస్పత్రులకు తరలింపు
పాములపాడు నవంబర్ 20 యువతరం న్యూస్:
కర్నూలు జిల్లా పాములపాడు మండలంలోని మిట్ట కందాల గ్రామంలో బుధవారం కలకలం రేపింది రోజువారి వలె గ్రామంలోని అంగన్వాడీ కేంద్రం3 లో మధ్యాహ్నం భోజనం కింద చిన్నారులకు ఆకుకూర పప్పు, అన్నం, కోడిగుడ్డు పెట్టారు. కొద్దిసేపటి తర్వాత ఇంటికి వెళ్లిన చిన్నారులకు వాంతులు, విరేచనాలు తో తీవ్ర అస్వస్థకు గురయ్యారు. అస్వస్థకు గురైన వారిలో రితిక, రిసి, నిక్షిత్ కుమార్, వసుంధర, చైతన్యకుమార్, అలేఖ్య, సంధ్య, చార్లెస్ రాజు ఉన్నారు. ఆందోళనకు గురైన చిన్నారుల తల్లిదండ్రులు ఆశ వర్కర్ సహాయంతో ఆ గ్రామంలోని ఆరోగ్య ఉప కేంద్రం దగ్గరికి తీసుకెళ్లారు. అక్కడ నుండి పాములపాడు పిహెచ్సికి తరలించారు. చిన్నారులకు తీవ్ర అస్వస్థతగా ఉండడంతో అక్కడి నుండి ఆత్మకూరులోని వామిక పిల్లల ఆసుపత్రి తీసుకెళ్లినట్లు తల్లిదండ్రులు తెలిపారు. ఒకరి పరిస్థితి ఇబ్బందిగా ఉండడంతో నందికొట్కూరులో ఉన్న ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్నట్లు వారు తెలిపారు. చిన్నారులకు అందించిన ఆహారంలో ఫుడ్ పాయిజన్ ఘటనపై గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంగన్వాడీ కేంద్రంలో అందజేసిన ఆహారం ఎలా కలుషితమైందని దానిపై చిన్నారుల తల్లిదండ్రులు సిబ్బందిని ప్రశ్నిస్తున్నారు. చిన్నారులకు జరగరానిది ఏదైనా జరిగి ఉంటే బాధ్యులు ఎవరు అని వారు నిలదీశారు. మా పిల్లల ప్రైవేట్ హాస్పిటల్ లో అయినటువంటి వైద్యానికి అయినటువంటి డబ్బులు ఎవరు భరిస్తారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విషయం తెలుసుకున్న జిల్లా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ కాశీం వలి, వెంకటరాముడు అంగన్వాడి కేంద్రాన్ని చేరుకొని ఆహారం గుడ్లు, పాల ప్యాకెట్లను సేకరించి వాటి నమూనాలను ల్యాబ్ కు పంపించి తదుపరి చర్యలు తీసుకుంటున్నామన్నారు. మండల తాసిల్దార్ సుభద్రమ్మ, ఎంపీడీవో చంద్రశేఖర్, ఎస్సై సురేష్ బాబు, సిడిపిఓ మంగవల్లి ,పాములపాడు మెడికల్ ఆఫీసర్ నాగలక్ష్మి చేరుకొని అంగన్వాడి టీచర్ అరుణమ్మ నుండి వివరాలను సేకరించారు. చిన్నారుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని విధుల పట్ల బాధ్యతగా వ్యవహరించాలన్నారు.



