ANDHRA PRADESHPROBLEMSSOCIAL SERVICEWORLD

రజకులు ఎస్సీ హోదాకు అర్హులు కాదా…….????!

ఇంకా ఎన్నాళ్లీ దాగుడుమూతలు

రజకులు ఎస్సీ హోదాకు అర్హులు కాదా…….????!

అమరావతి ప్రతినిధి నవంబర్ 20 యువతరం న్యూస్:

అస్పశ్యతకు ఆనవాళ్ళు రజకుల జీవితాలుదేశ రజకుల సామాజిక స్థితిగతుల సంపూర్ణ విశ్లేషణ
అనాదిగా కులవృత్తినే నమ్ముకుని సమాజంలో అట్టడుగున అత్యంత హేయమైన జీవితాలను పొందుతున్న రజకుల భారమైన బ్రతుకులు భవిష్యత్త్ లేని బంధాలు ఇవే నేడు 11 రాష్ట్రాల్లో 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో బీసీ జాబితాలో గల రజకుల జీవితాలు ఒకే కులం, ఒకే కులవృత్తి ఒకే జీవన విధానం,ఒకే సామాజిక ప్రతిపత్తిని స్థితిగతులతో ఉంటున్న రజకులను దేశ వ్యాప్తంగా 17 రాష్ట్రాలతో పాటు 3 కేంద్ర పాలిత రాష్ట్రాల్లో ఎస్సీ జాబితాలో ఉండటం , మిగతా 11 రాష్ట్రాలు 3 కేంద్ర పాలిత రాష్ట్రాల్లో గల రజకులను బీసీ జాబితాలో ఉండటంతో రజకుల బ్రతుకులు ఆగమైనాయి,ఇలా ఒకే దేశంలో ఉన్న రజకులకు రెండు రకాల రిజర్వేషన్ లను అది కూడా ఉత్తర భారతదేశంలో ఎస్సీ లుగా దక్షిణ భారతదేశంలో ఎస్సీ లుగా కొనసాగించడం మన రాజ్యాంగ హక్కులను కాలరాయడమే ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమే కదా?ఏళ్ళతరబడి రజకులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఎన్నోసార్లు వినతి పత్రాలిచ్చిన మరెన్నో సార్లు కేంద్రానికి సిఫార్సు చేసిన రజక SC రిజర్వేషన్ అమలు అందని ద్రాక్షే అవుతూనే ఉంది,ఇలా రజకుల్ని మాత్రం ఎస్సీ జాబితాలో చేర్చాలనే ప్రక్రియ మాత్రం ముందుకు వెళ్ళడం లేదు.. ప్రాచీన కాలంలో రజకులు ‘చండాలురన్నది మనుస్మృతే!. దేశ వ్యాప్తంగా ఉన్న అనేక అత్యంత ప్రాచీన కాలం నాటి కులాల్లో రజక కులం ఒకటి.బ్రిటిష్ ఇండియా ప్రభుత్వంలో బ్రిటిష్ అధికారులు ఆయా నిమ్నజాతి కులాల జీవన విధానాన్ని, సమాజంలో పొందుతున్న స్థితిగతులను పరిశోధించి రాసిన పుస్తకాల్లో,చేసిన చట్టాల్లో కూడా రజకులు అంటరాని వారనే పోందుపరిచారు. రజకులు అంటరాని వారని ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తే తెలుస్తుంది
ఆర్థిక అసమానతలతో ఛిద్రమైన రజక బ్రతుకులు
రజకుల జీవితంలో కేవలం కూడు కోసం,పొట్ట బట్ట కొరకే ఆజన్మాంతం సమాజ సేవకే అంకితమై చాలిచాలనీ డబ్బులతో వెట్టిచాకిరికే జీవితాలను ధారపోస్తున్నారు, కేవలం కులవృత్తిపైనే ఆధారపడటంతో ఉన్నత చదువులకు దూరమై కష్టాలు, కన్నీళ్లు అవమానాలతో బ్రతుకులు భారమైనాయి అపనిందలు, అస్పృశ్యత, అంటరానితనం, వివక్షత వెన్నంటే ఉన్నాయి. రజకుడు ఉతికితే బట్టల రక్త మరకలు కూడా పోయాయి గానీ, రజకుడికి జీవితాలకు అంటిన సామాజిక, ఆర్థిక మలినాలు ఇంకా పోలేదు, అనాదిగా కులవృత్తినే నమ్ముకోవడంతో వ్యాపార రంగానికి, వ్యవసాయానికి తగిన భూములు లేకపోవడంతో రజకుల ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది, ఒకవైపు కులవృత్తి మరోవైపు చాలని గిట్టుబాటుతో ప్రస్తుత ఆర్థిక స్వావలంబనకు అందని దూరంలో ఉన్నారు, ఇలాంటి అర్థిక అసమానతలు,అస్పృశ్యత వివక్షత, ఎస్సీ వర్గంలో చేరిన కూడా రజక కులం ఉన్నంతవరకూ పోయేటట్లు లేదు దశాబ్దాల కాలంగా ఎస్సీ జాబితాలో మమ్మల్ని చేర్చండి మహాప్రభో.. అని రజకులు అడుగుతుంది కేవలం సామాజిక భద్రత, న్యాయం కోసమే కాదు అణగారిన జీవితాలు ఆగమైన బ్రతుకుల పునర్నిర్మాణం కోసం విద్యా ఉద్యోగ ఉపాధి ఆర్థిక సామాజిక రాజకీయ రంగాల్లో కనీస స్థానం, సౌకర్యాల కోసమేనని పాలకులు తెలుసుకోవాలి , కనుక భవిష్యత్తులో జరగబోయే రజకుల ఎస్సీ పరిణామాన్ని ఎవరూ ఆడ్డుకోలేరు. మన ఐక్యతతో మాత్రమే ఈ సామాజిక మార్పు సాధ్యం.

తెలంగాణ రాష్ట్ర మొక్కటే కాదు,SC రిజర్వేషన్ లేని అన్ని (11 రాష్ట్రాల్లో) రాష్ట్రాల్లోనూ, కేంద్రపాలిత ప్రాంతాల్లోనూ తమని షెడ్యూల్డ్ కులాల జాబితాలో చేర్చాలని రజక/ధోభి/చాకలి కులం 78 ఏళ్లుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తూనే ఉంది. రజకులు. అస్పృశ్యులు.. రజకుల అస్పృశ్యతను గుర్తించకుండా, రజకుల్ని ‘దళితులలో కలపమనడం న్యాయ బద్ధమేనా’ అని ప్రశ్నించినవారికి విస్తృత సామాజిక పరిశీలన చేస్తే అర్థమవుతుంది,షెడ్యూల్డ్ కులాల జాబితాలో తమ కులాన్ని చేర్చాలని రజకులు కోరటం న్యాయబద్ధమైన డిమాండ్ అని సమాజంలో రజకుల పట్ల వివక్ష లేదని చెప్పడం కొందరి అజ్జానానికి, అంధకారానికి నిదర్శనం, రజకులు నేటీకి కుల మత వర్గ వర్ణ లింగ ప్రాంతం భేదం లేకుండా సమాజంలో అట్టడుగున ఉన్న అణగారిన వర్గాల(ఎస్సీ ఎస్టీ) మురికి బట్టలు కూడా ఉతుకుతున్నది నిజం కాదా
సామాజిక రుగ్మతలతో కొట్టుమిట్టాడుతున్న రజకులు
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ గుజరాత్, పంజాబ్, హర్యానా మహారాష్ట్ర, గోవా కర్ణాటక తమిళనాడు వంటి రాష్ట్రాల్లో రజకుల్ని SC జాబితాలో చేర్చాల్సి ఉంది. అర్హత లేక కాదు,ఆలోచన లేకనే ,తగిన న్యాయం చేయలేకనే ఆచరణకు, అమలుకు నోచుకోలేదు,ఇది మన ఐక్యత లేదనేది ఒకటైతే,పాలకుల నిర్లక్ష్యమొకటని రజకులందరికి తెలిసిన నిజమే.

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ గారు అందించిన భారత రాజ్యాంగం కంటే ముందే బ్రిటిష్ రాజ్యాంగ చట్టాలు ప్రజల్ని పాలించేందుకు పాలకులు వేల సంవత్సరాల నాటి ప్రాచీన ధర్మ శాస్త్రాలు, స్మృతులను వర్ణాలు ప్రామాణికంగా తీసుకున్నారు. వీటిలో అనాటి సామాజిక కట్టుబాట్లు వెసులుబాట్లు.. నేరాలు – శిక్షలు గురించి రాశారు. డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ గారు స్వయంగా తగలబెట్టిన మనుస్మృతిలో రజకులు అంటరాని వారు అని సుస్పష్టంగా రాసి ఉంది. గాడిదల్ని, కుక్కల్ని సాకే రజకుడు ‘చండాలుడ’ని పేర్కొన్నారు. మనుస్మృతిలోనే కాదు, పరాశర స్మృతిలో, వేద వ్యాస స్మృతిలో రజకులు అంత్యజులు (అంటరాని తనం కలవారు) అని పేర్కొన్నారు. బ్రిటిష్ ఇండియా ప్రభుత్వంలో బ్రిటిష్ అధికారులు పరిశోధించి రాసిన పుస్తకాల్లో కూడా ఈ రజకులు అంటరానివారనే ఏ ఓ హెచ్ హట్టన్ గారు తను రాసిన క్యాస్ట్ ఇన్ ఇండియా ఇట్స్ నేచర్ ఫంక్షన్స్ అండ్ ఆర్జిన్స్, అలాగే ఎడ్గార్ థర్స్టన్ గారు రాసిన క్యాస్టెస్ ఆండ్ ట్రెబ్స్ ఆఫ్ సౌథర్న్ ఇండియ, మరియు ఈ యచ్ బ్లంట్ రాసిన ది క్యాస్ట్ సీస్టమ్ ఆఫ్ నార్తర్న్ ఇండియా, అలాగే హైదరాబాద్ నిజాం ప్రభుత్వ ఉన్నతాధికారి సయ్యద్ సిరాజ్ ఉల్ హసన్ రాసిన ది క్యాస్టేస్ అండ్ ట్రైబ్స్ ఆఫ్ ది నిజాం డోమినీయన్స్ ఇంకా అనేక పుస్తకాల్లో రజకుల కులవృత్తి వారి జీవన స్థితిగతులను అంటరానితనాన్ని కల్గి ఉన్న విధానాన్ని స్పష్టంగా వివరించారు
రజకులు ఎస్సీ జాబితాలో చేరాలంటే అంటరానితనం ఒక్కటే ప్రామాణికమా?
ఆర్టికల్ 17 ద్వారా 1955లో అంటరానితనాన్ని కేంద్ర ప్రభుత్వం నిషేధించిన తర్వాత దేశంలోని ఆయా రాష్ట్రాల్లో షెడ్యూల్డ్ కులాల జాబితాలో ఏదైనా ఒక కులాన్ని చేర్చడమనేది, ఆ కులం సామాజిక, ఆర్థిక, వెనుకబాటుతో పాటు అంటరానితన ప్రాతిపదికనే జరుగుతోంది. ఈ దేశానికి స్వాతంత్రం వచ్చాక, షెడ్యూల్డ్ కులాలకు 1950 తర్వాత రిజర్వేషన్లు కల్పించారు. అంటరానితనాన్ని నిషేధించక ముందు కూడా షెడ్యూల్డ్ కులాలను గుర్తించేందుకు అంటరానితనం ఒక్కటే ప్రామాణికంగా తీసుకోలేదు. వారి ఆర్థిక సామాజిక అంతరాలు పరిగణలోకి తీసుకునే ఎస్సీ జాబితాలో చేర్చారు.పూర్తి వివరాల్లోకి వెళితే 1952 నాటి మొదటి జాబితాలో నాడు కేవలం 400 కులాలు మాత్రమే ఎస్సీ జాబితాలో చేర్చారు కానీ కాల క్రమేణా బీసీ ఇతర జాబితాలో నుండి సుమారు 700 లకు పైగా కులాలను 2024 వరకు ఎస్సీ ఎస్టీ చట్టం ద్వారానే నేటికీ 30కి పైగా రాజ్యాంగ సవరణలు చేసి 1109 వరకు ఎస్సీ కులాల జాబితాను చేర్చి పెంచారు నేటి వరకూ ఇలా జరిగిన రాజ్యాంగ సవరణల ద్వారా జాబితాలో చేర్చబడిన కొన్ని SC కులాలకు అసలు అస్పృశ్యత, అంటరానితనం లేదు.అలాంటిది కులవృత్తే అంటరానితనంతో కూడిన రజకులను మాత్రం SC జాబితాలో చేర్చాలనే సామాజిక సృహ సమతుల్యాన్ని మానవత్వాన్ని,, రాజ్యాంగ హక్కులను ప్రభుత్వాలు కాలరాస్తూనే ఉన్నాయి
*రజకులంటేనే సమాజానికి చిన్న చూపు*
1948 నుండి 1956 వరకూ , ఆంధ్రప్రదేశ్,హైదరాబాదు రాష్ట్రాల ఎస్సీ కులాల జాబితాలో కేవలం 20 లోపే ఎస్సీ కులాల జాబితా ఉండేది కానీ పార్లమెంట్ ఆమోదం ద్వారా నేటి వరకు తెలుగు రాష్ట్రాల్లో వీటి సంఖ్య 68 చేరిందంటే ఎస్సీ సామాజిక వర్గాల సంఖ్య పెరిగినట్ఠా?తగ్గినట్టా ,రజక కులం కంటే పై స్థాయిలో ఉండే అంటరానితనం వివక్షత లేని కొన్ని కులాలకు సైతం రాజ్యాంగ సవరణతో ఎస్సీ జాబితాలో చోటు కల్పించారు
అలాంటిది అన్ని రంగాల్లో అత్యంత కింది స్థాయిలో రజకులను ఎస్సీ జాబితాలో చేర్చక పోవడం ఎంతటి దారుణమో!
చాకలి వంటి నిజమైన అస్పృశ్యత గల కులాన్ని షెడ్యూల్డ్ కులాల జాబితాలో చేర్చడం కష్టం కాదు చాకలి కులం షెడ్యూల్ కులాల జాబితాకు భారం కాదు, అందులోని వర్గాలకు ఎప్పుడూ ఏలాంటి ఇబ్బంది కాబోదు
అంటరాని తనం అంటే ఏమిటి?
ఒక వ్యక్తి లేదా ఒక కులం చేసే నిత్య పనిలో అంటు ముట్టు,మైల ఉంటే, ఆ పని అంటరాని పని అని స్మృతులు, శాస్త్రాలు చెప్పాయి. మైల పని చేసే వ్యక్తిని అంటరాని వ్యక్తిగా, మైలపని చేసే కులాన్ని అంటరాని కులంగా గుర్తించారు. తెలుగు రాష్ట్రాల్లో ఈరోజుకి కూడా మైల పని చేస్తున్న కులాల్లో రజక కులం కూడా ఒకటని పుట్టుక, చావు, రజస్వల,రుతుక్రమం మైల వంటి పనుల్ని చేసేదని మనువు వివరించాడు. అంతేకాదు రజక మహిళ మంత్రసానిగా పురుడు పోసింది. వెనుకబడిన ప్రాంతాల్లో నేటికీ ఇంకా పోస్తూనే ఉంది. చావుకు సంబంధించి పాడె కట్టడం దగ్గర్నుంచి శవ మొలతాడు తొలగించడంతో పాటు, ఆ శవాన్ని కాల్చే పని పూడ్చే పనిని కూడా ఉత్తర తెలంగాణలో నేటికీ రోజుకీ రజకులు చేస్తున్నారు. మనలో చాలామందికి రజకులు శవాలను కాలుస్తారు,బ్రాహ్మణులు, వైశ్యుల శవాలను దహనం చేసేది. విశ్వబ్రాహ్మణుల శవాలను ఖననం చేసేది రజకులే. సమాజంలో ఒక వ్యక్తి మరణించిన రోజున జరిగే అంత్యక్రియల్లో బంధువులు స్నేహితులు దగ్గరి కుటుంబ సభ్యులు దింపుడు కల్లం వరకు వచ్చి ఆగిపోయినా, అంత్యక్రియల మొదటి రోజు నుంచి ఆఖరి కర్మ రోజు వరకు రజకుడు స్మశానానికి వెళ్లి బట్టలను శుభ్రం చేసే తన విధులను బాధ్యతతో పెద్దకర్మ వరకూ శుష్ఠి (చనిపోయిన కుటుంబ సభ్యులను దశదిన కర్మ వరకు ముట్టుకోక పోవడం) ఉండే మృతుడి కుటుంబ సభ్యుల బట్టలన్నీ ఉతికేస్తాడు ఇపన్నీ అంటు పనులే కదా. ఒక వ్యక్తి విడిచిన బట్ట కేవలం మాసిన బట్ట మాత్రమే కాదు, ఆ వ్యక్తి చెమట, మల మూత్ర విసర్జన, కన్నీరు, కంటి పుసి, చెవి గుబిలి, ముక్కు పొక్కులు, చీమిడి, నోటి జల్లు, పుండ్ల చీము, నెత్తురు, వీర్యం, ఇంకా అనేక జబ్బులతో కూడిన ప్రాణాంతక బ్యాక్టీరియాతో మలినమైన బట్టలను రజకుడు నెత్తిన పెట్టుకొని మోస్తాడని, చేతులతో శుభ్రం చేస్తాడని జ్ఞాపకం చేసుకోండి.ఇలాంటి వృత్తి సమాజంలో మరే ఇతర కులం చేయదు,

అణగారిన వర్గాల వారి బట్టల్నీ సైతం రజకులు ఉతికారు..!

చివరగా ఒక మాట, అంటరానితనాన్ని నిషేధించక ముందు కూడా గత 1990 దశకం ఆఖరి వరకు తెలుగు గ్రామాల్లో చాలా ప్రాంతాల్లో మాల, మాదిగల బట్టల్ని వారు చెరువుల గట్టుకు తెచ్చి ఇచ్చిన వారి మురికి బట్టలను సైతం ఉతికారు. ఇందుకు సంబంధించిన ఆధారాలు మన తాత నాన్నల తరం వారు తరచూ మనకు చెబుతూనే ఉంటారు . గ్రామ సేవకుడు. మాల, మాదిగలను ఊరవతల ఉంచిన సమాజమే, చాకళ్ళను కూడా ఊరి మద్యలో అన్ని వర్గాల వారికి అందుబాటులో ఉంచి వారి కుటుంబాల మంచి చెడులకు అనుకూలంగా మలుచుకున్నారు
గ్రామాల్లో చితికిన రజకుల బ్రతుకులు
రజక కులవృత్తే మనల్ని అన్ని రంగాలకు అభివృథ్థి ఫలాలకు దూరం చేసింది.నేటి మన ఈ దుస్థితికి ప్రధాన కారణం రజక కులవృత్తినే నమ్ముకోవడంతో నగర ప్రాంతాల్లోనే కాదు గ్రామీణ ప్రాంతాల్లో కూడా 90 శాతానికి పైగా రజకులు ఈరోజు కులవృత్తి చేసుకుంటూ నిత్య కూలీలుగా,అడ్డా కూలీలుగా,ఫ్యాక్టరీలలో కార్మికులుగా బ్రతుకుతున్నారు,ఒకసారి పల్లెటూళ్ళను గమనిస్తే, ఆయా కులాల వారి నివాస గృహాలు వరుసగా కనిపిస్తాయి. బ్రాహ్మణుల గృహాలకు ఒక్కొక్క దూరంలో ఒక్కో కులం వారి నివాస గృహాలు ఉండటాన్ని మనం చూడొచ్చు. ఈ ఆధారాలను కూడా భారత ప్రభుత్వం నమోదు చేసింది. మాల, మాదిగ కులాల బట్టలు ఉతకటం రజకులను ఎస్సీ జాబితాలో చేర్చేందుకు ప్రధాన. అర్హతగా కూడా చెప్పవచ్చు కానీ నిచ్చెన మెట్ల కుల వ్యవస్థలో ఎస్సీ జాబితాలో ఉన్న ఏ రెండు కులాలు ఒకటి కాదు. ప్రతి రెండు కులాల మధ్య ఒక్కో రకమైన వివక్షత, వైరుధ్యం వంటి అంతరాలున్నాయి.అంటరానితనం అనేది కేవలం అగ్రవర్ణాల నుంచి అణగారిన వర్గాల మద్యనే చూపుతున్నారని భావన ఎలాగో ఉంది కానీ అణగారిన కులాల జాబితాలో ఉన్న అనేక కులాల మధ్య కూడా కుల వివక్షత ఇంకా కొనసాగుతూనే ఉంది. మరో ముఖ్యమైన విషయం ఎస్సీ జాబితాలో వివక్షత లేకుండా నిత్యం భగవత్ ఆరాధనలో నిమగ్నమైన కులాలు, కేవలం పండ్లు కూరగాయలు వ్యవసాయం తోటల పెంపకం వంటి వృత్తులను చేసే కులాలతో పాటు కులవృత్తి కూడా లేని కులాలు కూడా ఉన్నాయి, అంతేకాదు సాక్ష్యాత్తు కేంద్ర ఎస్సీ సామాజిక న్యాయ శాఖ మంత్రి గారైన డాక్టర్ వీరేంద్ర కుమార్ గారు స్వయంగా మాంసం కొట్టి అమ్మే కటిక సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, ఈ కులం మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ వంటి కొన్ని రాష్ట్రాల్లో ఎస్సీ జాబితాలో కొనసాగుతున్నారు,కటికె వృత్తికి ఏలాంటి అంటరానితనం ఉంటుంది,కటికె వారు స్వయంగా కోసి అమ్మిన మాంసాన్ని సమాజంలో శాఖాహార జాతులు తప్ప మిగతా వారందరూ తింటున్నారు కదా కటికే వారి చేతితో స్వయంగా ఇచ్చిన మాంసాన్ని మనమందరం తింటున్నాము, అక్కడ ఈ మాంసం అమ్మే వారికి ఎలాంటి అంటరానితనం, అస్పృశ్యత వివక్షత, విధానం ఉందో వారిని ఏ ప్రాతిపదికన ఎస్సీ జాబితాకు ఎలా అర్హులు అయ్యారో వారినెలా చేర్చారో దేశ పార్లమెంట్ రాజ్యాంగమే తెలపాలి ఇలాంటి వాళ్ళే ఈరోజు ఎస్సీ జాబితాకు అర్హులు అయితే మన రజక ధోబి సమాజం ఎందుకు ఎస్సీ జాబితాకు అర్హులు కారో? మనల్ని ఎందుకు చేర్చరనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.

రజకులకు ఇళ్లలోకి ప్రవేశం లేదు

రజకులు తాము బట్టలు ఉతికే అందరి ఇళ్లల్లోకి వెళతారనే అభిప్రాయం నిజం కాదు. అది అపోహ మాత్రమే. నిజానికి బ్రాహ్మణులు, వైశ్యులు, క్షత్రియుల ఇళ్లలోకి రజకులకు ప్రవేశం లేదు. బ్రాహ్మణులు, వైశ్యులు, క్షత్రియులు విడిచిన బట్టల్ని రజకులు వారి పెరటి గుమ్మం గుండా వెళ్లి తీసుకునేవారు. ఉతికిన తడి, పొడి బట్టల్ని ప్రధాన ద్వారం ముందుండే పంచనే ( అరుగు పై)ఉంచేవారు. పసుపు నీరు చల్లుకొని బ్రాహ్మణులు, వైశ్యులు, క్షత్రియులు: ఆ బట్టల్ని తీసుకెళ్లేవారు.

దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్ అన్నది నిజమేనా
ఇదే నిజమైతే భారతదేశ మొకటేననే భావన ఉంటే మనకు ఉన్నది ఒకే రాజ్యాంగం, ఒకే పార్లమెంట్, ఒకే సుప్రీంకోర్టు,ఒకే రాష్ట్రపతి, ఒకే ప్రధాన మంత్రి దేశమనేది నిజమైతే ఉత్తర భారతదేశంలో రజకులు ఎస్సీ లుగా ,దక్షిణ భారతదేశంలో రజకులు బీసీ లుగా కొనసాగడమనేది ఎంతవరకు సమంజసం, దీనికి ప్రధాన కారణం ఢిల్లీ గద్దెనెక్కి దేశాన్ని పాలిస్తున్న,నడిపిస్తున్న నాయకులు ఉత్తర భారతదేశానికి చెందిన వారనేది నగ్న సత్యం కానీ దేశ సమగ్రతను జాతీయ సమైక్యతను, హిందూ భావజాలాన్ని అనాదిగా అందుకొని సమాజంలో అంతర్భాగమైన రజకుల పట్ల ఈ ప్రాంతీయ,సామాజిక అభివృద్దికి దూరమెందుకు చేశారు
భారత దేశమంటే భిన్న ప్రాంతాలు, భాషలు సంస్కృతులు, సాంప్రదాయాలు,ఆచారాలు, వ్వవహారాలు గల విభిన్న జీవన విధానాల విస్తృత సమ్మేళనం కనుక జాతీయ భాషలో ధోభీలుగా వర్ణించే రజకులను ఒక్కో ప్రాంతంలో ఒక్కో పేరుతో ఆచరణలో ఉన్నాయి ఉదాహరణకు కర్నాటకలో మడివేలు, మహారాష్ట్రలో పరిట్ లు, తమిళనాడులో వన్నన్ లు,కేరళలో పుత్తురాయ్ వన్నన్ లుగా ఆంధ్రప్రదేశ్ లో రజకులుగా తెలంగాణలో చాకలిగా ఇలా ఒక్కో ప్రాంతంలో ఒక్కో పేరుతో పిలిచినా, ఏ ప్రాంతంలో జీవిస్తున్న,ఏ భాషలో మాట్లాడిన చేసే కులవృత్తి మాత్రం ఒక్కటే అదే అన్ని వర్గాల ప్రజల మురికి బట్టలు ఉతకడం ఇస్త్రీ చేయడమే రజకుల ప్రధాన కులవృత్తి ఇదే వీరికి జీవనాధారం
రజక ఎస్సీ హోదా సాధనే ధ్యేయంగా ముందుకు.
ఇలా భిన్న ప్రాంతాలు, భిన్న భాష‌‌‌లు,సంస్కృతుల గందరగోళ విభజన వల్లనే ప్రభుత్వాలు సరైన శాస్త్రీయ నివేదిక లేకుండా రజకులను కొన్ని ప్రాంతాల్లోనే ఎస్సీ లుగా మిగతా ప్రాంతాల్లో బీసీ లుగా కొనసాగిస్తూ వచ్చారు కానీ ఇప్పటికైనా రజకుల బ్రతుకు చిత్రాన్ని మార్చాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పైనే ఉంది.ఆ దిశగా అడుగులు వేయాలని దేశ రజకులను ఏకరీతిగా ఎస్సీ జాబితాలో చేర్చాలని, చేర్చాల్సిన పరిస్థితి తప్పక ఆసన్నమైందని, అమలయి తీరుతుందని దక్షిణ భారత రజక ప్రజానీకం బలంగా కోరుకుంటుంది.

YUVATHARAM NEWS

Related Articles

Back to top button
error: Content is protected !!