కర్నూలు వాసుల అభిమానం మరువలేము – దర్శకనిర్మాత శాంతికుమార్

కర్నూలు వాసుల అభిమానం మరువలేము – దర్శకనిర్మాత శాంతికుమార్
కర్నూలు క్రీడలు అక్టోబర్ 28 యువతరం న్యూస్:
తెలుగు సినీ పరిశ్రమ పట్ల కర్నూలు ప్రజలు చూపే అభిమానాన్ని మరువలేమని దర్శకనిర్మాత శాంతికుమార్ అన్నారు. బ్రహ్మ ఆర్ట్స్ క్రియేషన్స్ పతాకంపై 3.2.1 అనే టైటిల్ తో నిర్మిస్తున్న చిత్రం షూటింగ్ సందర్బంగా చిత్ర యూనిట్ కర్నూలుకు విచ్చేసింది. ఈ సందర్బంగా స్థానిక రవీంద్ర ఇంజనీరింగ్ కాలేజీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చిత్ర దర్శకుడు, నిర్మాత శాంతికుమార్ మాట్లాడుతూ కర్నూలు జిల్లాలో ఎన్నో అందమైన లొకేషన్లు ఉన్నాయని, తాము నిర్మిస్తున్న చిత్ర కథకు అనుగుణంగా సినిమా చిత్రీకరణ జరుగుతోందని అన్నారు. తాము షూటింగ్ నిర్వహిస్తున్న ప్రతి చోటా ప్రజలు సహకరిస్తున్నారని, కర్నూలు ప్రజల అభిమానాన్ని మరువలేమని అన్నారు. సినిమా టైటిల్ గురించి వివరిస్తూ మూడు ముళ్ళు, రెండు మనసులు, ఒక్క జీవితం అనే జీవిత సత్యం ఆధారంగా 3.2.1 అనే టైటిల్ పెట్టామని చెప్పారు. ప్రేమ వివాహాలు, పెద్దలు కుదిర్చిన వివాహాల మధ్య రగులుతున్న భావోద్వేగాలను విశ్లేషిస్తూ హీరో, హీరోయిన్ల నడుమ ఏర్పడిన సంఘర్షణ ఎలా ఉంటుందో ఈ చిత్రంలో చూపామని శాంతి కుమార్ అన్నారు. తమ చిత్రంలోని కాలేజీ సీన్లు చిత్రీకరించడానికి రవీంద్ర ఇంజనీరింగ్ కాలేజీలో అనుమతినిచ్చిన కళాశాల చైర్మన్ మోహన్ కుమార్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నామని శాంతికుమార్ అన్నారు.
ఏపీ తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ వారితో రిజిస్టర్ కాబడిన మొట్టమొదటి సినిమా తమదే కావడం తమకు గర్వకారణమని ఆయన అన్నారు.
ఏపీ తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు బి.కె.కరణ్ మాట్లాడుతూ తెలంగాణ విడిపోయిన తరువాత ఆంధ్రప్రదేశ్ లో చిత్రపరిశ్రమ అభివృద్ధి కోసం తాము ప్రత్యేకంగా ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ ఏర్పాటు చేశామని అన్నారు. తమ సంస్థ చైర్మన్ , మాజీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ సహకారంతో ఏపీలో చిత్ర పరిశ్రమ అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని అన్నారు. ఈ ప్రాంతంలో నిర్మించే సినిమాలకు తాము అన్ని విధాల సహాయ, సహకారాలు అందిస్తామని ఆయన చెప్పారు. చిత్ర హీరో మోహిత్ మాట్లాడుతూ రాయలసీమలో సినిమా షూటింగ్ జరుపుకోవడం తమకు ఇదే మొదటిసారని, అన్ని ప్రాంతాల సంస్కృతులు కర్నూలులో ఉన్నాయని అన్నారు. హీరోయిన్ లావణ్య మాట్లాడుతూ కర్నూలులో షూటింగ్ లో పాల్గొంటుంటే ఈ ప్రాంతం తమకు సొంత ప్రాంతంలా అనిపిస్తోందని అన్నారు. ఈ కార్యక్రమంలో సహ నిర్మాత రామానుజరెడ్డి, ఫిల్మ్ చాంబర్ పిఆర్వో నాగేశ్వరబాబు, చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.



