మనోబంధు ఫౌండేషన్ పత్రికను ఆవిష్కరించిన జిల్లా ఎస్పీ మరియు జాయింట్ కలెక్టర్


మనోబంధు ఫౌండేషన్ పత్రికను ఆవిష్కరించిన జిల్లా ఎస్పీ మరియు జాయింట్ కలెక్టర్
నంద్యాల బ్యూరో అక్టోబర్ 28 యువతరం న్యూస్:
సమాజ సేవా కార్యక్రమాలు ఎంతో గొప్పవైనవని ఇలాంటి మంచి కార్యక్రమాలకు ప్రభుత్వ సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ సునీల్ షెరాన్, జాయింట్ కలెక్టర్ కొల్లాబత్తుల కార్తీక్ లు అన్నారు. సోమవారం జిల్లా ఎస్పి, జాయింట్ కలెక్టర్ కార్యాలయాల్లో మనోబంధు ఫౌండేషన్ పత్రికను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ “సమాజ సేవా కార్యక్రమాలు ఎంతో గొప్పవైనవి. ఇలాంటి మంచి కార్యక్రమాలకు మా సహకారం ఎల్లప్పుడూ ఉంటుందన్నారు. నంద్యాల జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ దస్తగిరి పర్ల మాట్లాడుతూ మనోబంధు ఫౌండేషన్ సంస్థ రాష్ట్రవ్యాప్తంగా, అలాగే తెలంగాణ ప్రాంతంలో కూడా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీతో కలిసి పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నదని తెలిపారు. దేశవ్యాప్తంగా రోడ్ల వెంట, పట్టణాల్లో నిరాధారంగా తిరుగుతున్న మానసిక రోగులను గుర్తించి వారికి సరైన వైద్యసహాయం, పౌష్టికాహారం, యోగా శిక్షణ, పునరావాస సేవలు అందించడం మనోబంధు ఫౌండేషన్ ప్రధాన లక్ష్యమన్నారు. ఈ విధంగా వారు కోలుకున్న తర్వాత, వారిని వారి కుటుంబ సభ్యుల వద్దకు లేదా గుర్తింపు పొందిన వసతిగృహాలలో చేర్చడం ఫౌండేషన్ ధ్యేయమని ఆయన వివరించారు.
ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ కోశాధికారి నాగేశ్వరరావు, మేనేజింగ్ కమిటీ సభ్యుడు ఉస్మాన్ భాష, మనోబంధు ఫౌండేషన్ రాయలసీమ రీజనల్ డైరెక్టర్ సమ్మిరెడ్డి కృష్ణారెడ్డి, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.



