నవోదయం 2.0 ద్వారా సారా రహిత జిల్లాగా కర్నూలు
నాటు సారా తయారీ మానిన కుటుంబాలకు ప్రత్యామ్నాయ జీవనోపాధుల కల్పన: కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి


నవోదయం 2.0 ద్వారా సారా రహిత జిల్లాగా కర్నూలు
నాటు సారా తయారీ మానిన కుటుంబాలకు ప్రత్యామ్నాయ జీవనోపాధుల కల్పన
జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి
కర్నూలు కలెక్టరేట్ అక్టోబర్ 27 యువతరం న్యూస్:
నవోదయం 2.0 ద్వారా కర్నూలు జిల్లాను సారా రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి పేర్కొన్నారు. సోమవారం కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో నవోదయం 2.0 లో భాగంగా కర్నూలు నగరం బంగారు పేట కు చెందిన నాటు సారా తయారీని మానుకున్న కుటుంబాలకు ప్రత్యామ్నాయ జీవనోపాధుల కల్పన లో భాగంగా ఆటోలను, రూ.20 లక్షల రుణాల కు సంబంధించిన మెగా చెక్ ను జిల్లా కలెక్టర్ అందచేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ…కర్నూలు జిల్లాలో మొత్తం 110 నాటు సారా కేంద్రాలను ఎక్సైజ్ శాఖ గుర్తించిందని, వాటిని పూర్తిగా నిర్మూలించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు తెలిపారు. నాటు సారా వృత్తిని మానుకున్న కుటుంబాలకు బ్యాంకుల ద్వారా రుణాలు మంజూరు చేయించి స్థిరమైన జీవనోపాధి కల్పించడం జరుగుతోందని కలెక్టర్ తెలిపారు. కర్నూలు నగరంలోని బంగారు పేట ప్రాంతంలో నాటు సారా వృత్తిపై ఆధారపడి ఉన్న కుటుంబాలకు ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు కల్పించామని వివరించారు. ఇందులో భాగంగా 10 మంది లబ్ధిదారులకు రూ.20 లక్షల విలువ గల ఆటో లు, చెక్ లను అందచేశామని తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకుని భవిష్యత్తు తరాలకు ఆదర్శంగా నిలవాలని, గౌరవప్రదమైన జీవనోపాధి దిశగా అడుగులు వేయాలని జిల్లా కలెక్టర్ కోరారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ ఎక్సైజ్ శ్రీదేవి, అసిస్టెంట్ కమిషనర్ హనుమంత రెడ్డి, ఎక్సైజ్ సూపరింటెండెంట్ సుధీర్ బాబు, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ రామకృష్ణా రెడ్డి, ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ చంద్రహాస్, మెప్మా పిడి జి. శ్రీనివాసులు, ఇండియన్ బ్యాంక్ మేనేజర్ శృతి, ఎల్డిఎం రామచంద్రరావు,లబ్ధిదారులు పాల్గొన్నారు.



