ప్రధానమంత్రి శ్రీశైల పర్యటన విజయవంతం
జిల్లా కలెక్టర్ రాజకుమారిని అభినందించిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు

ప్రధానమంత్రి శ్రీశైల పర్యటన విజయవంతం
జిల్లా కలెక్టర్ రాజకుమారిని అభినందించిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు
నంద్యాల బ్యూరో అక్టోబర్ 17 యువతరం న్యూస్:
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం శ్రీశైలం పుణ్యక్షేత్ర పర్యటన విజయవంతంగా పూర్తయిన నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జిల్లా కలెక్టర్ జి. రాజకుమారిని ప్రత్యేకంగా అభినందించారు. శుక్రవారం అమరావతి సచివాలయం నుండి నంద్యాల, కర్నూలు జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ప్రధానమంత్రి పర్యటనకు సంబంధిత అధికారులతో జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా ముఖ్యమంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు.
కలెక్టర్ చాంబర్ నుండి జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి పర్యటనను ఎస్ఓపీ మార్గదర్శకాలకు అనుగుణంగా సాఫల్యవంతంగా నిర్వహించామని తెలిపారు. సున్నిపెంట హెలిప్యాడ్ నుండి భ్రమరాంబ గెస్ట్ హౌస్ వరకు 10.2 కిలోమీటర్ల అటవీ ప్రాంతంలో ప్లాస్టిక్ మరియు వ్యర్థ పదార్థాలు లేకుండా శుభ్రంగా ఉంచడమే లక్ష్యంగా ప్రత్యేక చర్యలు తీసుకున్నామని చెప్పారు. హెలిప్యాడ్ నుంచి భ్రమరాంబ గెస్ట్ హౌస్ వరకు ఉన్న 8 స్పీడ్ బ్రేకర్లను తొలగించి వాహనాలు సాఫీగా ప్రయాణించేలా చర్యలు చేపట్టామని వివరించారు. అలాగే హెలిప్యాడ్ పరిసరాలు, శివాజీ స్ఫూర్తి కేంద్రం, నందిగుడి సర్కిల్ ప్రాంతాల్లో అటవీ శాఖ రెస్క్యూ బృందాలు క్షేత్ర స్థాయిలో సమన్వయంతో పనిచేశాయని తెలిపారు. పర్యటన సమయంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా దర్శన ఏర్పాట్లు సమర్థవంతంగా నిర్వహించామని, ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా క్రమబద్ధంగా నియంత్రణ చేపట్టామని కలెక్టర్ తెలిపారు. ప్రధానమంత్రి పర్యటన సమయానికి ముందు మరియు అనంతరం కూడా భక్తులను క్యూలైన్లలో సక్రమంగా అకామడేట్ చేసి దర్శనం కల్పించడం వల్ల ఎటువంటి సమస్యలు తలెత్తలేదని పేర్కొన్నారు.
ప్రాచీనమైన శ్రీశైల క్షేత్రం మహిమకు భంగం కలగకుండా, ఆలయం ఆధ్యాత్మిక వాతావరణం నిలుపుకునేలా తక్కువ మోతాదులో పుష్పాలతో అలంకరణ చేసినట్లు తెలిపారు. అప్పటి కాలంలో శ్రీశైలం క్షేత్రం ఉన్న రూపాన్ని ప్రతిబింబించేలా, అవసరమైన ప్రదేశాల్లో మాత్రమే కార్పెట్‌లు ఏర్పాటు చేశామన్నారు. ఆలయ పుష్పాలంకరణ కోసం బెంగళూరు నుండి పూలను తెప్పించే ముందు అక్కడే నాణ్యత తనిఖీ చేయించి, పుణ్యక్షేత్రం శోభను మరింత పెంచేలా సుందరంగా అలంకరించామని వివరించారు. ప్రధానమంత్రి శ్రీశైలం పర్యటనకు సంబంధించిన అన్ని కార్యకలాపాలను డాక్యుమెంటేషన్ రూపంలో సిద్ధం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పిస్తామని కలెక్టర్ ముఖ్యమంత్రికి తెలిపారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, ద్వితీయ జ్యోతిర్లింగం మరియు శక్తిపీఠం అయిన శ్రీశైల పుణ్యక్షేత్రాన్ని సందర్శించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధ్యాత్మిక ఉల్లాసంతో నిండిపోయారని పేర్కొన్నారు. శ్రీశైల క్షేత్రంలోని ఆధ్యాత్మిక శక్తిని ప్రధానమంత్రి స్వయంగా అనుభవించారని ముఖ్యమంత్రి వివరించారు. జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి నాయకత్వంలో ప్రధానమంత్రి పర్యటనను విజయవంతంగా నిర్వహించినందుకు ముఖ్యమంత్రి అభినందనలు తెలియజేశారు. భద్రత, ప్రజా నిర్వహణ, వసతి, ట్రాఫిక్, కమ్యూనికేషన్, మీడియా సమన్వయం వంటి అన్ని విభాగాల్లో జిల్లా యంత్రాంగం సమర్థవంతంగా పనిచేసిందని ఆయన ప్రశంసించారు.