ఉమ్మడి కర్నూలు జిల్లా పై ప్రధాని మోదీ ఎటువంటి వరాలు కురిపిస్తారో..?

ఉమ్మడి కర్నూలు జిల్లా పై ప్రధాని మోదీ ఎటువంటి వరాలు కురిపిస్తారో..?
కోడుమూరు అక్టోబర్ 15 యువతరం న్యూస్:
జీఎస్టీ పై అవగాహన సదస్సుకు ఈనెల 16న కర్నూలుకు విచ్చేయుచున్న భారత దేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ఉమ్మడి కర్నూలు జిల్లా పై ఎటువంటి వరాలు కురిపిస్తారో అని జిల్లావ్యాప్తంగా ప్రజలు తీవ్ర ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. రెండు దశాబ్దాల అనంతరం భారత దేశ ప్రధాని కర్నూలు జిల్లా పర్యటనకు విచ్చేయడంతో జిల్లా ప్రజలు ఆద్యంతం ఎదురుచూస్తున్నారు. ప్రధానంగా కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి నిరుద్యోగులు ఉపాధి కోసం ఎదురుచూస్తున్నారు. ఏవైనా ప్రైవేటు పరిశ్రమలు కర్నూలు జిల్లాకు కేటాయిస్తారా. మరియు కర్నూలు పశ్చిమ ప్రాంతంలో రైతులు, కూలీలు వలసలు ఆగడం లేదు.మరియు కర్నూలు- బళ్లారి రహదారి విస్తరణలో భాగంగా నాలుగు లైన్ల జాతీయ రహదారిని చేయాలని స్థానిక ప్రజలు కోరుచున్నారు. ఈ జాతీయ రహదారి విస్తరణతో ఇటు కర్ణాటక, అటు తెలంగాణ రాష్ట్రాలతో వాణిజ్య, వ్యాపారాలు సంబంధాలు బలోపేతం అవుతాయని, రోడ్డు ప్రమాదాలు జరగకుండా చూడొచ్చని స్థానికుల అభిప్రాయం. అంతేకాక కర్నూలు- మంత్రాలయం రైల్వే లైన్ అనేది జిల్లా ప్రజలకు ఒక కల. మరి ఈ రైల్వే లైన్ పై ప్రధాని ఏమైనా ప్రకటన చేస్తారా అని ప్రజలు వేయికళ్లతో ఎదురుచూపులు చూస్తున్నారు. అంతేకాక జిల్లాలోని త్రాగు, సాగు నీటి ప్రాజెక్టులపై పలు అభివృద్ధి పనులకు ప్రత్యేక ప్రణాళికలు, ప్రత్యేక నిధులు కేటాయిస్తారా ? అని ప్రజలు భావిస్తున్నారు. అంతేగాక ఉమ్మడి కర్నూలు జిల్లాలో వేలాది కుటుంబాలు చేనేత వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నారు. మరియు అటువంటి చేనేతరంగం సరైన మార్కెటింగ్ సదుపాయం లేక కుదేలవడంతో చేనేత కార్మికులకు ఎటువంటి ఉపాధి లేక వలసలు వెళుతున్నారు. మళ్లీ అటువంటి చేనేత కార్మికుల కోసం ఎటువంటి వరాలు ఇస్తాడు అని చేనేత కార్మికులు దీనంగా ఎదురుచూస్తున్నారు.మరియు ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఒకప్పుడు కర్నూలు ఉండేది. మళ్లీ అటువంటి రాజధాని విషయంలో ప్రధాని నోటి నుంచి ఏమైనా తీపి కబురు అందుతుందా అని జిల్లా ప్రజలు తీవ్ర ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రధాన సమస్యలను బహిరంగ సమావేశం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ దృష్టికి తీసుకొని వెళ్లి దీర్ఘకాలంగా ఉన్న సమస్యలకు పరిష్కారం చూపుతారని ప్రజలు వేచి చూస్తున్నారు.