గాంధీ జయంతి రోజున చింతపల్లిలో మాంసం విక్రయాలు
అధికారుల నిర్లక్ష్యంపై ప్రజాగ్రహం

గాంధీ జయంతి రోజున చింతపల్లిలో మాంసం విక్రయాలు
అధికారుల నిర్లక్ష్యంపై ప్రజాగ్రహం
నియమాలు ఉల్లంఘించిన మాంసం దుకాణదారుడు
కఠిన చర్యలకు డిమాండ్ చేస్తున్న గ్రామస్థులు
చింతపల్లి అక్టోబర్ 03 యువతరం న్యూస్:
దేశమంతా మహాత్మా గాంధీ జయంతిని అహింస, శాంతి సందేశంతో జరుపుకుంటున్న వేళ చింతపల్లి కేంద్రంలో నిబంధనల ఉల్లంఘన కలకలం సృష్టించింది. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అక్టోబర్ 2న మండలవ్యాప్తంగా మాంసం విక్రయాలను నిషేధించినప్పటికీ, పచ్చిపాల రాము అనే మాంసం దుకాణదారుడు ఆ నియమాలను లెక్కచేయకుండా యథేచ్ఛగా కోడి మాంసం అమ్మకాలు సాగించడం స్థానికుల ఆగ్రహానికి కారణమైంది. ఉదయం నుంచే ఈ దుకాణంలో కోళ్లను కోసి మాంసం అమ్ముతుండటాన్ని గమనించిన గ్రామ ప్రజలు ఈ వ్యవహారాన్ని బట్టబయలు చేశారు. అహింసకు ప్రతీక అయిన గాంధీ జయంతి రోజున ఇటువంటి చర్య జరగడం మహాత్ముడికి చేసిన అవమానంగా పలువురు భావిస్తున్నారు. నియమాలను ఉల్లంఘించిన దుకాణదారుడి తీరుపైనే కాక, అధికారుల పర్యవేక్షణ లోపంపై కూడా ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం అవుతున్నాయంటే అది అధికారుల నిర్లక్ష్యమేనని వారు స్పష్టం చేస్తున్నారు. కఠిన చర్యలు తీసుకోకపోవడం వల్లే మాంసం వ్యాపారులు బరితెగించి ప్రభుత్వ ఆదేశాలను ధిక్కరిస్తున్నారని గ్రామ ప్రజలు మండిపడ్డారు. లాభాపేక్ష లేకుండా జాతీయ నాయకుడికి నివాళులర్పించే పవిత్ర దినాన మాంసం విక్రయాలు చేయడం తగదని, ప్రభుత్వం విధించిన నియమాలు అందరికీ వర్తిస్తాయని వారు గట్టిగా చెబుతున్నారు. ప్రభుత్వ ఆదేశాలను తేలికగా తీసుకునే వారిపై అధికారులు మరింత కఠినంగా వ్యవహరించాలని చింతపల్లి ప్రజలు డిమాండ్ చేశారు. అహింస మార్గాన్ని అనుసరించిన మహాత్ముని ఆశయ సాధనకు దేశవ్యాప్తంగా ప్రజలు నివాళులు అర్పిస్తున్న తరుణంలో ఇలాంటి చర్యలు బాధను కలిగిస్తున్నాయని వారు అభిప్రాయపడ్డారు. ఈ ఘటనపై సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి, నిబంధనలు ఉల్లంఘించిన మాంసం దుకాణదారుడిపై సమాజానకి ఉదాహరణగా నిలిచేలా కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు మండిపడుతున్నారు.