ఎలాంటి కష్టమైనా ఆదుకోవటానికి కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉంది
మంత్రి అనగాని సత్యప్రసాద్

ఎలాంటి కష్టమైనా ఆదుకోవటానికి కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉంది
ఎగువ రాష్ట్రాల్లో వర్షాల కారణంగా వరద
ఎలాంటి కష్టమైనా కూటమి ప్రభుత్వం ఆదుకుంటుంది
మంత్రి అనగాని సత్యప్రసాద్
రేపల్లె అక్టోబర్ 01 యువతరం న్యూస్:
ఎలాంటి కష్టం వచ్చినా కూటమి ప్రభుత్వం ఆదుకుంటుందని రాష్ట్ర రెవెన్యూ రిజిస్ట్రేషన్ స్టాంపులు శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ భరోసా ఇచ్చారు. ప్రకాశం వారది నుంచి దిగువకు విడుదల చేయడంతో గ్రామంలోని వరద బాధిత ప్రాంతాలను మంగళవారం అనగానే సత్యప్రసాద్ సందర్శించి ప్రజలకు ధైర్యం చెప్పారు. రేపల్లె నియోజకవర్గంలోని పెనుమూడి నదీపరివాహక ప్రాంతంలో వరద ముంపునకు గురైన పల్లెపాలెం గ్రామాన్ని సందర్శించారు. స్థానికంగా ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రంలో ముంపు బాధితులకు అందిస్తున్న ఆహార, వసతి, వైద్య సదుపాయాలను పరిశీలించారు. పెనుమూడి నదీ పరివాహక ప్రాంతంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వరద ముంపు తగ్గేవరకు పునరావాస కేంద్రాల్లోని ప్రజలకు మెరుగైన సదుపాయాలు కల్పించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రజలెవరూ ఆందోళన చెందవద్దని, వరద ముంపు బాధిత కుటుంబాలకు ఏ కష్టం వచ్చినా ఆదుకునేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి అనగాని వారికి బరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. ఎగువ రాష్ట్రాల్లో అధిక వర్షాలు కురవటంతో కృష్ణా నది దిగువకు నాలుగు లక్షల 75 వేల క్యూసెక్కులకు పైగా వరద నీరు విడుదల చేస్తున్నారని ఆయన తెలిపారు. దీని కారణంగా దిగువనున్న లోతట్టు ప్రాంతాల్లో పంట పొలాలు, నివాస గృహాల్లో వరద నీరు చేరుతోందన్నారు. వరద ప్రాంతాల బాధితులను 28 పునరావాస కేంద్రాలకు తరలించామని ఆయా కేంద్రాల్లో వైద్య శిబిరాలు, ఆహార, వసతి ఏర్పాటు చేశామన్నారు. వరద కారణంగా కృష్ణానది నిండుగా ప్రవహిస్తూ కొత్త అందాలను సంతరించుకున్నప్పటికీ జనావాసాల్లోకి వరద నీరు చొరపడటంతో ప్రజలకు ఇబ్బందులు నెలకొన్నాయన్నారు. ఇంకా వారం పాటు ఈ పరిస్థితి ఉంటుందని ప్రజలకు ఎలాంటి కష్టం ఎదురైనా ఆదుకోవడానికి కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు. కార్యక్రమాల్లో కృష్ణా పశ్చిమ డెల్టా ప్రాజెక్టు కమిటీ చైర్మన్ పంతాని మురళీధర్, ఆర్డీవో ఎన్ రామలక్ష్మి, తహసిల్దార్ మోర్ల శ్రీనివాసరావు, స్థానిక కూటమి నాయకులు పాల్గొన్నారు.