బంగారు కుటుంబాల దత్తత ప్రక్రియను వేగవంతం చేయండి

బంగారు కుటుంబాల దత్తత ప్రక్రియను వేగవంతం చేయండి
ప్రగతి సూచికలను 5వ తేదిలోపు నమోదు చేయండి
జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గణియా
నంద్యాల ప్రతినిధి సెప్టెంబరు 25 యువతరం న్యూస్:
బంగారు కుటుంబాల దత్తత ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాలు నుండి సాంకేతిక సమాచార కార్యకలాపాలపై మండల స్థాయి అధికారులకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి రాజకుమారి మాట్లాడుతూ ఇప్పటివరకు జిల్లాలో 50,035 మంది బంగారు కుటుంబాలు నమోదు కాగా, అందులో 33,631 కుటుంబాలను క్షేత్ర స్థాయిలో పరిశీలించి దత్తత తీసుకున్నట్లు తెలిపారు. ఇంకా మిగిలిన 16,404 కుటుంబాలను తక్షణమే మార్గదర్శకులతో అనుసంధానం చేయాలని సూచించారు. ఈ ప్రక్రియలో పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రగతి సూచికల నివేదికలను ప్రతి నెల 5వ తేదీ లోపు మండల అధికారులు నమోదు చేసి, 8వ తేదీలోపు జిల్లా అధికారులు అప్లోడ్ చేయాలని ఆమె ఆదేశించారు. గత ఏడాది అక్టోబర్ నుండి ఇప్పటి వరకు 42,883 ఫైళ్లు ఈ-ఆఫీస్ ద్వారా క్లియర్ చేయబడినట్లు వెల్లడించారు. ఇకపై అన్ని ఫైళ్లు ఈ-ఆఫీస్ ద్వారానే పంపాలని, ఏ అధికారి వద్దా పెండింగ్ ఉండరాదని తెలిపారు. సెలవు దరఖాస్తులు సైతం ఈ-ఆఫీస్ ద్వారానే సమర్పించాలని సూచించారు.
వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఇప్పటివరకు 2850 ఫిర్యాదులు స్వీకరించగా, 430 తిరస్కరించి, 169 దరఖాస్తులను ఆమోదించామని వివరించారు. ఈ వ్యవస్థపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేందుకు డిఎల్డిఓలు, ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేందుకు కృషి చేయాలని సూచించారు. అలాగే ఆర్టిజిఎస్ లెన్స్ ద్వారా ప్రభుత్వం నిర్దేశించిన 123 పారామీటర్లపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని ఆమె సూచించారు. డ్రోన్ల వినియోగంపై సంబంధిత శాఖలు నివేదికలు సమర్పించాలని ఆదేశించారు. ఏజెంట్ స్పేస్ కు సంబంధించి ఇప్పటివరకు 4 లక్షల డాక్యుమెంట్లు గూగుల్ యాప్ ద్వారా అప్లోడ్ చేసినట్లు పేర్కొంటూ, ఈ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని కలెక్టర్ సూచించారు. ఈ సమావేశంలో డిఆర్ఓ రాము నాయక్, సిపిఓ వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.