పిజిఆర్ఎస్ అర్జీదారులతో కలసి భోజనం చేసిన జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి

పిజిఆర్ఎస్ అర్జీదారులతో కలసి భోజనం చేసిన జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి
నంద్యాల బ్యూరో సెప్టెంబర్ 23 యువతరం న్యూస్:
ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పిజిఆర్ఎస్)లో పాల్గొన్న అర్జీదారులతో జిల్లా కలెక్టర్ శ్రీమతి జి.రాజకుమారి కలిసి భోజనం చేశారు. సోమవారం కలెక్టరేట్ ప్రాంగణంలో ప్రతి సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చే అర్జీదారుల కోసం శ్రీ కాశిరెడ్డి నాయన సత్రం ఓంకారం వారి ఆధ్వర్యంలో అందజేసే ఉచిత భోజన కార్యక్రమంలో అర్జీదారులతో కలిసి కలెక్టర్ భోజనం చేశారు. అర్జీదారులతో భోజనం చేస్తూ వారి సమస్యలను నేరుగా విని స్పందించిన కలెక్టర్, అధికార యంత్రాంగం–ప్రజల మధ్య దూరాన్ని తగ్గించడం ద్వారా సేవా దృక్పథం మరింత బలపడుతుందని పేర్కొన్నారు. ప్రజలతో మమేకమై వారి సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకోవడమే ఈ కార్యక్రమ ఉద్దేశ్యమని ఆమె తెలిపారు. అర్జీదారులతో కలసి భోజనం చేయడం ద్వారా అధికార యంత్రాంగం మరియు ప్రజల మధ్య దూరాన్ని తగ్గించడం లక్ష్యమని స్పష్టం చేశారు. “ప్రజలతో భోజనం పంచుకోవడం ద్వారా వారి మనసులోని మాటలు నేరుగా వినే అవకాశం కలుగుతుంది. ఇది ప్రజా సేవలో పారదర్శకతను మరింత బలపరుస్తుంది” అని కలెక్టర్ అన్నారు.
ఈ సందర్భంగా బేతంచెర్ల మండలం, ఆర్ఎస్ రంగాపురం గ్రామానికి చెందిన మధుశేఖర్ గౌడ్ సర్వే నెంబరులో 961/బి2లో పాత ఆర్ఎస్ ప్రకారం 7.62 ఎకరాల భూమిని గత నాలుగు తరాలుగా సాగు చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్నానని, అయితే తన పొలం వెనుక ఉన్న వారు వారి పొలంలోకి వెళ్ళడానికి మా పొలంలో సదరు కొంత భాగాన్ని రాస్తగా మార్చి వినియోగించుకోవడం జరుగుతోందన్నారు. సంబంధిత పొలం రస్తా వివాదం కోర్టులో ఉందని, సదరు కోర్టు తీర్పు ఇచ్చే వరకు మీ పొలంలో వారు తిరగకుండా ఉండేలా చర్యలు తీసుకుంటాం కలెక్టర్ తెలిపారు. సంబంధిత వ్యక్తుల పొలాలను స్వయంగా పరిశీలించి వెనుక ఉన్నవారు పొలంలోకి వెళ్లేలా ప్రత్యామ్నాయ మార్గం చూపించేలా చర్యలు తీసుకుంటామన్నారు. బాధిత కుటుంబంలోని వ్యక్తులతో కలిసి భోజనం చేస్తూ చిన్నారులను కలెక్టర్ అప్యాయంగా పలకరించారు. భవిష్యత్తులో ఏం అవ్వాలనుకుంటున్నారు పిల్లలను అడగగా వారు వైద్య విద్యను అభ్యసించి డాక్టర్ అవ్వాలనుకుంటున్నామని జిల్లా కలెక్టర్ కు తెలిపారు. అందుకు అనుగుణంగా చిన్నారులకు మెరుగైన విద్యను అందించాలని కలెక్టర్ కుటుంబ సభ్యులకు సూచించారు.