
కాలం చెల్లిన వంతెన
ప్రయాణికులకు ప్రాణభయం
చింతపల్లి సెప్టెంబర్ 22 యువతరం న్యూస్:
చింతపల్లి మండలంలోని కోరుకొండ, బెన్నవరం లోతుగడ్డ ముఖ్య కూడలి లోతుగడ్డ పాత వంతెన ప్రజలకు ప్రాణహానికరంగా మారింది. దశాబ్దాల క్రితం నిర్మించిన ఈ వంతెన కాలం చెల్లి శిథిలావస్థకు చేరుకుంది. అయినప్పటికీ ప్రతిరోజూ చింతపల్లి–పాడేరు మార్గంలో వాహనాలు, పాదచారులు రాకపోకలు సాగిస్తుండటంతో స్థానికులు భయాందోళనలో ఉన్నారు. వర్షాకాలం కారణంగా వంతెన కింద ప్రవహించే వాగు ఉప్పొంగిపోవడంతో ప్రవాహం మరింత వేగంగా సాగుతోంది. వంతెన కింద భాగంలో కోతకు గురి కావడంతో ప్రమాదం సంభవించే అవకాశాలు లేకపోలేదు. ఈ పరిస్థితిలో వంతెన బలహీనంగా మారి పైన బరువైన వాహనాలు వెళ్ళగానే ఎప్పటికప్పుడు పగుళ్లు పెరుగుతున్నాయి. దీంతో ఎప్పుడైనా ప్రమాదం సంభవించే అవకాశముందని ప్రజలు చెబుతున్నారు. విద్యార్థులు, ఉద్యోగులు, రైతులు, మహిళలు చింతపల్లి జీకే వీధి కొయ్యూరు ప్రాంతాలను సందర్శించాలంటే ఈ వంతెనపైనే రాకపోకలు చేస్తున్నారు. ఎప్పుడైనా కూలిపోతుందేమోనని భయంతో వెళ్తున్నాం ప్రభుత్వం వెంటనే కొత్త వంతెన నిర్మించాలి” అని గ్రామస్థులు విజ్ఞప్తి చేస్తున్నారు. పలుమార్లు అధికారులను కలసి వినతి పత్రాలు సమర్పించినా ఇప్పటివరకు స్పందన రాలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే పెద్ద ప్రమాదం సంభవించే అవకాశం ఉందని స్థానికులు హెచ్చరిస్తున్నారు. ప్రజల ప్రాణాలను రక్షించడానికి ప్రభుత్వం అత్యవసరంగా జోక్యం చేసుకుని కొత్త వంతెన నిర్మాణం చేపట్టాలని ప్రయాణికులు, రైతులు, మహిళలు, విద్యార్థులు, ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.