స్వచ్ఛ నంద్యాల లక్ష్యానికి ప్రతి ఒక్కరి కృషి అవసరం
పచ్చదనం–పరిశుభ్రత కార్యక్రమాల్లో ప్రజలు భాగస్వాములు కావాలి


స్వచ్ఛ నంద్యాల లక్ష్యానికి ప్రతి ఒక్కరి కృషి అవసరం
పట్టణంలో పచ్చదనాన్ని పెంపొందించేందుకు విస్తృతంగా మొక్కలు నాటాలి
మంత్రి ఎన్.ఎం.డి. ఫరూక్
జిల్లాలో 529 లొకేషన్లలో మొక్కలు నాటేందుకు శ్రీకారం
పచ్చదనం–పరిశుభ్రత కార్యక్రమాల్లో ప్రజలు భాగస్వాములు కావాలి
జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా
నంద్యాల బ్యూరో సెప్టెంబర్ 20 యువతరం న్యూస్:
జిల్లాను స్వచ్ఛ నందాల జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరి కృషి అవసరమని రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ పేర్కొన్నారు. శనివారం నంద్యాల పట్టణం మున్సిపల్ పరిధిలోని భీమవరం రోడ్డు డంప్ యార్డ్ లో నిర్వహించిన స్వర్ణాంధ్ర, స్వచ్ఛంధ్ర కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జి రాజకుమారి మున్సిపల్ చైర్ పర్సన్ మాబున్నీసా, మున్సిపల్ కమిషనర్ శేషన్న, మున్సిపల్ కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, ప్రజలు, విద్యార్థులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్.ఎం.డి. ఫరూక్ మాట్లాడుతూ జిల్లాను స్వచ్ఛరహిత నంద్యాల జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరి కృషి అవసరం అన్నారు. ప్రజలందరూ స్వచ్ఛ ఆంధ్ర–స్వచ్ఛ దివస్ కార్యక్రమాలలో భాగస్వాములై చురుకుగా పాల్గొనాలని సూచించారు. అన్ని శాఖల అధికారులు తమ కార్యాలయాల సమీపంలోని చెత్తను తొలగించి ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛ ఆంధ్ర–స్వచ్ఛ దివస్ కార్యక్రమం విజయవంతం కావడానికి ప్రత్యేక చర్యలు చేపడుతోందని తెలిపారు. జిల్లాలోని అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు అందరూ కలసికట్టుగా కృషి చేస్తే నంద్యాల పరిశుభ్రతలో రాష్ట్రంలోనే ప్రత్యేక గుర్తింపు పొందుతుందని నమ్మకాన్ని వ్యక్తం చేశారు.
పట్టణంలో పచ్చదనం తగ్గిపోతోందని ఆందోళన వ్యక్తం చేసిన మంత్రి, పచ్చదనాన్ని పెంపొందించేందుకు ప్రతి ఒక్కరు మొక్కలు నాటి వాటిని సంరక్షించే బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు. మొక్కల పెంపకంపై ప్రజల్లో అవగాహన పెంచాలని సూచించారు. పట్టణ వాసులు చెత్తను రోడ్లపై పారేస్తున్నారని, ఆ విధానం ఆగేందుకు అధికారులు తగిన చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిషేధించి, ప్లాస్టిక్ కవర్లు ఉపయోగించే వారిపై మున్సిపల్ అధికారులు అపరాధ రుసుములు విధించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. డ్రైనేజీ కాలువల్లో ఎప్పటికప్పుడు చెత్త తొలగించి, మురికినీరు రోడ్లపైకి రాకుండా సాఫీగా వెళ్లేలా చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. నంద్యాల జిల్లా శుభ్రత, పచ్చదనం, పర్యావరణ పరిరక్షణలో ముందంజలో నిలవాలని, ఈ లక్ష్యం సాధనలో ప్రతి ఒక్కరు తమ వంతు కృషి చేయాలని మంత్రి ఎన్.ఎం.డి. ఫరూక్ పిలుపునిచ్చారు.
జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి మాట్లాడుతూ, ప్రతి నెల మూడవ శనివారం స్వచ్ఛ నంద్యాల కార్యక్రమాన్ని నిరంతరంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రతినెలా ఒక ప్రత్యేక థీమ్‌తో స్వచ్ఛతా కార్యక్రమాలు చేపడుతున్నామని, ఈ నెల “గ్రీన్ ఆంధ్రప్రదేశ్” అనే థీమ్‌తో ముందుకు వెళ్తున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో భాగంగానే జిల్లాలో 529 లొకేషన్లలో విస్తృత స్థాయిలో మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. ప్రజలు కూడా తమ వంతు బాధ్యతగా ఇంటి ముందు లేదా వెనుక భాగంలో మూడు అడుగుల పొడవు, మూడు అడుగుల వెడల్పుతో ఇంకుడు గుంతలను ఏర్పాటు చేసుకోవాలని, తడి చెత్త–పొడి చెత్తను వేరు చేసి కంపోస్ట్ ఎరువుగా తయారు చేయాలని సూచించారు. ఈ కంపోస్ట్‌ను మొక్కల పెంపకంలో లేదా కిచెన్ గార్డెన్స్‌లో ఉపయోగించుకోవడం ద్వారా పర్యావరణ పరిరక్షణతో పాటు ఇంటింటా పచ్చదనం పెంపొందుతుందని వివరించారు.
నంద్యాల పట్టణంలో 17 ఎకరాల డంపింగ్ యార్డ్ ఉందని, ఇందులో ముందు భాగంలోని ఆరు ఎకరాలలో 500 మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. జిల్లాలో మొత్తం 19 వేల కుక్కలు, నంద్యాల పట్టణంలో దాదాపు 2000 వీధి కుక్కలు ఉన్నాయని, వీటి వల్ల ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవడంతో పాటు సంతానోత్పత్తిని నియంత్రించేందుకు స్టెరిలైజేషన్ ఆపరేషన్లు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ వివరించారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలపై ప్రజలకు పూర్తి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని, ముఖ్యంగా పట్టణ ప్రజలు ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయకుండా జాగ్రత్తలు తీసుకుంటే మాత్రమే స్వచ్ఛ నంద్యాల లక్ష్యాన్ని సాధించవచ్చని కలెక్టర్ పిలుపునిచ్చారు. అంతకుముందు ప్రజలందరిచే స్వచ్ఛంద్ర ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం మంత్రి ఫరూక్‌తో కలిసి పారిశుద్ధ్య కార్మికులను శాలువాలతో సన్మానించారు.



