సమాజానికి మంచి చేసే వార్తలను అందించాలి
రాష్ట్ర పరిశ్రమలు వాణిజ్యం ఫుడ్ ప్రాసెసింగ్ శాఖా మంత్రి టి.జి.భరత్

సమాజానికి మంచి చేసే వార్తలను అందించాలి
రాష్ట్ర పరిశ్రమలు వాణిజ్యం ఫుడ్ ప్రాసెసింగ్ శాఖా మంత్రి టి.జి.భరత్
మంచిని గుర్తించి చెడు జర్నలిజం కు స్వస్తి పలకాలి
ఆంధ్రప్రదేశ్ సిఆర్ మీడియా అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేష్ కుమార్
కర్నూలు ప్రతినిధి సెప్టెంబర్ 14 యువతరం న్యూస్:
సమాజానికి మంచి చేసే వార్తలను అందించాలని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం ఫుడ్ ప్రాసెసింగ్ శాఖా మంత్రి టి.జి. భరత్ పేర్కొన్నారు. శనివారం మౌర్య హోటల్ లోని పరిణయ సమావేశ మందిరంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సి ఆర్ ప్రెస్ అకాడమీ మరియు ఏపీడబ్ల్యూజే సంయుక్తంగా కర్నూలు జిల్లా విలేకరుల పునఃశ్చరణ తరగతులు నిర్వహించిన సందర్భంగా ప్రారంభ సమావేశం లో మంత్రి టి.జి. భరత్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రస్తుతం ఏ ఐ వంటి సాంకేతికత పరిజ్ఞానం అందుబాటు లోకి వచ్చిందని, దీనిని జర్నలిజం రంగంలో వినియోగించుకొని సమాజాభివృద్ధికి తోడ్పడేలా సమాచారాన్ని అందించాలని కోరారు. విలేకరులకు పునశ్చరణ తరగతులు నిర్వహించడం చాలా మంచి విషయం అని, యువ జర్నలిస్టులకు అనుభవం కలిగిన జర్నలిస్టులచే జర్నలిజం తరగతులు నిర్వహించడం వల్ల వృత్తిలో మెరుగుదల సాధించగలుతారని తెలిపారు. ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా లో ఇబ్బడి ముబ్బడిగా సమాచారం ఉంటోందని, అందులో కొంత అవాస్తవాలు కూడా ఉంటాయన్నారు. ఈ నేపథ్యంలో ప్రజలకు మంచి సమాచారాన్ని అందించాలని మంత్రి సూచించారు.
ఆంధ్ర ప్రదేశ్ సిఆర్ మీడియా అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేష్ కుమార్ మాట్లాడుతూ…1996లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మీడియా అకాడమీ ని అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు జర్నలిజంలో నాణ్యతను పెంచడానికి ఏర్పాటు చేశారని తెలిపారు. 2014 లో రాష్ట్రం రెండు గా విడిపోయిన తర్వాత రెండు రాష్ట్రాలకు మీడియా అకాడమీ లు ఏర్పడ్డాయని, విశాలాంధ్ర పత్రిక లో దాదాపు 30 సంవత్సరాలు పైగా జర్నలిస్ట్ గా పనిచేసి స్వర్గస్తులైన చక్రవర్తుల రాఘవాచారి పేరుతో సి ఆర్ మీడియా అకాడమీ గా పేరు మార్పు చేసి జర్నలిస్టులకు మెలకువలు అందించడం జరుగుతోందన్నారు. మనిషి ఎప్పటికీ నిత్య విద్యార్థి అని, ఎప్పటికప్పుడు వృత్తి నైపుణ్యాలు పెంచుకోవాల్సిన అవసరం చాలా ఉందన్నారు. ఇంటర్నెట్ వచ్చిన తర్వాత సోషల్ మీడియా విస్తృతంగా అభివృద్ధి చెందిందని, తద్వారా ప్రజలందరూ జర్నలిస్టులుగా సమాచారాన్ని అందిస్తున్నారన్నారు. ఇందులో మంచి , చెడు రెండూ ఉన్నాయని తెలిపారు. సమాజంలో జరుగుతున్న మంచిని ప్రజలకు తెలియజేయడంతో పాటు చెడును సరిదిద్దే దిశగా వార్తలను రాయడం జర్నలిస్టుల కర్తవ్యమని స్పష్టం చేశారు. ఈ పునశ్చరణ తరగతులు జర్నలిస్టుల నైపుణ్యాలు పెంచడానికి, సమాజంలో పాజిటివ్ జర్నలిజం బలోపేతానికి ఉపయోగపడతాయని ఓ ఆంధ్రప్రదేశ్ సి ఆర్ మీడియా అకాడమీ చైర్మన్ తెలియజేశారు. షేక్ కరీముల్లా బృందం చిన్నారులు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించారు. అనంతరం డెస్క్ కో ఆర్డినేషన్ అంశంపై కర్నూలు ఆంధ్ర జ్యోతి ఎడిషన్ ఇంచార్జి నవీన్ నాయుడు , ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ అంశంపై సీనియర్ జర్నలిస్ట్, ఏఐ ట్రైనర్ విజయ్ కుమార్ శిక్షణ ఇచ్చారు. సమావేశంలో సిఆర్ మీడియా అకాడమీ సెక్రటరీ మణిరామ్, ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు ఐవీ సుబ్బారావు, ఉపాధ్యక్షులు కొండప్ప, జాతీయ సభ్యులు వెంకటసుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు.