రాయలసీమను రతనాలసీమ గా మారుస్తాం
సూపర్ సిక్స్, సూపర్ హిట్ బహిరంగ సభలో సీఎం చంద్రబాబు నాయుడు


రాయలసీమను రతనాలసీమ గా మారుస్తాం
సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయ్యింది
డబల్ ఇంజన్ సర్కార్ తోనే రాష్ట్ర అభివృద్ధి.. వైసీపీ పాలనలో అభివృద్ధి శూన్యం
వైయస్ జగన్ కు ప్రతిపక్ష హోదా ఎలా వస్తుంది?
దుష్ప్రచారాలు మాని దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడండి
సీఎం అంటే కామన్ మ్యాన్ అని అర్థం
ఎమ్మెల్యేలు కూడా అలాగే ఉండాలి
సూపర్ సిక్స్, సూపర్ హిట్ బహిరంగ సభలో సీఎం చంద్రబాబు నాయుడు
అనంతపురం ప్రతినిధి సెప్టెంబర్ 10 యువతరం న్యూస్:
రాయలసీమను రతనాలసీమ గా మారుస్తామని, డబల్ ఇంజన్ సర్కార్ తోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని,గత సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నామని, సూపర్ 6 పథకాలు సూపర్ హిట్ చేసింది ప్రజలేనని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. బుధవారం అనంతపురం నగర శివార్లలోని శ్రీ నగర్ కాలనీలో జరిగిన సూపర్ 6,సూపర్ హిట్ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలసి కూటమిగా ఏర్పడి కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నామన్నారు. 15 నెలల కూటమిపాలనలో సాధించిన విజయాలు, జరిగిన అభివృద్ధి, ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, చేయబోవు అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించడం కోసమే ప్రప్రథమంగా అనంతపురంలో సూపర్ 6,సూపర్ హిట్ బహిరంగ సభను నిర్వహించడం జరుగుతోందన్నారు. ఈ సభ ఓట్ల కోసం కాదని రాజకీయం చేయడానికి అంతకన్నా కాదన్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నామని ప్రజలకు చెప్పడానికే తాము అనంతకు వచ్చామన్నారు. సూపర్ సిక్స్ హామీలన్నీ సూపర్ హిట్ చేశామన్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో ఆరు సంక్షేమ పథకాలు ప్రవేశపెడతామని హామీ ఇవ్వడం జరిగిందన్నారు ఎన్నికల్లో తమ కూటం ప్రభుత్వం అధికారంలోకి రాగానే వాటిని అమలు చేశామన్నారు. నేడు అవి సూపర్ హిట్ అయ్యాయి అన్నారు. సూపర్ సిక్స్ పథకాలు అమలు అసాధ్యమని వైసిపి వారు దుష్ప్రచారం చేశారు అన్నారు. నేడు తాము వాటిని సుసాధ్యం చేశామన్నారు. ముఖ్యంగా తల్లికి వందనం పథకం ద్వారా ఇంటిలో ఎందరు పిల్లలు ఉంటే అందరికీ 15,000 రూపాయలు చొప్పున వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేశామన్నారు. కనుక తల్లులు అందరూ తమ పిల్లలను సక్రమంగా చదివించుకోవాలన్నారు. ఇటీవల స్త్రీ శక్తి పథకాన్ని అమలు చేశామన్నారు. ఈ పథకం ద్వారా గుర్తింపు కార్డు కలిగి ఉన్న మహిళలందరూ ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ప్రయాణం చేయవచ్చన్నారు. ఆడబిడ్డల సంతోషమే నా సంతోషం అన్నారు. అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాల కింద అన్నదాతలను ఆదుకోవడం జరుగుతోందన్నారు. అన్నదాత సుఖీభవ పథకం కింద 47 లక్షల మంది రైతులకు 3177 కోట్లు వారి బ్యాంకు ఖాతాలో జమ చేశామన్నారు. 90 శాతం సబ్సిడీతో డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చామన్నారు. ఎక్కడ యూరియా కొరత లేకుండా చేస్తున్నామన్నారు. ఎంత యూరియా కావాలో అంతే తీసుకోవాలన్నారు అదేవిధంగా అవసరం మేరకే ఎరువులు కూడా అందిస్తామన్నారు. రైతులకు ఇబ్బంది కలగకుండా తాము అన్నీ అందిస్తామన్నారు. రైతు బాగుంటేనే అందరూ బాగుంటారన్నారు. మహిళలకు దీపం పథకం కింద ఏడాదికి మూడు సిలిండర్లు ఉచితంగా అందజేస్తున్నామన్నారు. ఎందుకో రు.1504 కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. ఏడాది రెండు కోట్ల 45 లక్షల మంది మహిళలకు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందించామన్నారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామన్నారు. ముఖ్యంగా మెగా డీఎస్సీ నిర్వహించి 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చామన్నారు. ఎక్కడ అవినీతి లేకుండా పారదర్శకంగా ఉద్యోగాలు లభించాయన్నారు. యువత భవిష్యత్తును బంగారు భవిష్యత్తుగా తీర్చిదిద్దుతామన్నారు. ప్రతి ఇంటిలోనూ ఒక ఐటీ పారిశ్రామిక వేత్త తయారు కావాలన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందరికీ విద్యను అందిస్తున్నాయని ముఖ్యంగా వైద్య విద్యను ప్రోత్సహించడానికి 15 మెడికల్ కాలేజీలు ఉన్నాయన్నారు. 2027 నాటికి మరో ఏడు మెడికల్ కాలేజీలు రానున్నాయన్నారు. ఈ మెడికల్ కాలేజీ ల విషయంలో వైసిపి దుష్ప్రచారం చేస్తుందన్నారు. వాటిని ఎవరూ నమ్మరాదన్నారు. అదేవిధంగా లక్ష మంది డ్వాక్రా మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 64 లక్షల మందికి పెన్షన్లు అందిస్తున్నామన్నారు. ఇందుకు 45 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. పేదల ఆకలి తీర్చడం కోసం గతంలో తాము అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేస్తే వైసిపి అధికారంలోకి రాగానే వాటిని రద్దు చేసిందన్నారు. తమ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే తిరిగి అన్న క్యాంటీన్లు తెరిచామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 2004 అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేసి ఐదు కోట్ల 65 లక్షల మంది పేదలకు ప్రతిరోజు రు. 5లకే రుచికరమైన భోజనం అందిస్తున్నామన్నారు. ………………. ఆటో డ్రైవర్లకు దసరా కానుక.. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడంతో దాము నష్టపోతున్నామని ఆందోళన చెందుతున్న ఆటో డ్రైవర్లకు దసరా కానుకగా ఏడాదికి రూ. 15000 చొప్పున ఆర్థిక సహాయం అందించినట్లు సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. వాహన మిత్ర పథకం కింద ఆటో డ్రైవర్లకు ఈ విధంగా సాయం చేస్తామన్నారు……………… ప్రజలందరికీ ఆరోగ్య భీమా.. రాష్ట్రవ్యాప్తంగా ప్రజలందరికీ ఆరోగ్య భీమా పథకాన్ని తీసుకువస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఆరోగ్యశ్రీ కింద రూ: 25 లక్షలు దాకా సాయం చేస్తామన్నారు. ఇది కాక కొత్తగా సంజీవని పథకం ప్రవేశపెట్టి అందరికీ ఆరోగ్యం అనే నినాదంతో ముందుకు సాగుతామన్నారు………… రాయలసీమను రతనాలసీమ గా మారుస్తాం.. గతంలో కరువు సీమ గా ఉన్న రాయలసీమను రతనాలసీమగా మారుస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. ఇందుకోసం రాయలసీమలోని ప్రాజెక్టులను అభివృద్ధి చేస్తామన్నారు. గతంలో తాగు సాగునీటి ప్రాజెక్టులు తెచ్చింది దివంగత నందమూరి తారక రామారావు అన్నారు. అప్పట్లో తెలుగు గంగ హంద్రీనీవా గాలేరు నగరి వంటి ప్రాజెక్టులు వచ్చాయన్నారు. ఆయనను ఆదర్శంగా తీసుకొని తాము కూడా ప్రాజెక్టుల అభివృద్ధికి పాటుపడతామన్నారు. తమ కూటం ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాయలసీమలో నెలకొన్న ఫ్యాక్షన్ అంతమైందన్నారు. అన్ని చెరువులకు నీరు అందిస్తున్నామన్నారు. పాడిపంటలతో రాయలసీమ సస్య శ్యామలం అవుతోందన్నారు. సీమ రైతులను అన్ని విధాల ఆదుకుంటున్నామన్నారు. అనంతను హార్టికల్చర్ హబ్ గా తీర్చిదిద్దుతున్నామన్నారుజీడిపల్లి, బైరవాని తిప్ప పేరూరు ప్రాజెక్టులను అభివృద్ధి చేసి తాగు, సాగునీటి కొరత లేకుండా చూస్తామన్నారు. హంద్రినీవా, మడకశిర బ్రాంచ్ కెనాల్ కు నీరు అందిస్తామన్నారు. హెచ్.ఎల్.సి ఆధునీకరణ పనులు చేస్తామన్నారు……………………………….. సీఎం అంటే కామన్ మ్యాన్.. ఎమ్మెల్యేలు కూడా అలాగే ఉండాలి. తనను నాలుగు దపాలు సీఎం చేసింది రాష్ట్ర ప్రజలేనని, కనుక తాను ప్రజలకు ఎంతగానో రుణపడి ఉన్నానని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. సీఎం అంటే కామన్ మ్యాన్ అని అర్థమన్నారు.తాను అలాగే ఉంటానని, ఎమ్మెల్యేలు కూడా అహం వీడి కామన్ మ్యాన్ లా ఉండాలన్నారు. అహం వీడి ప్రజల్లో మమేకం కావాలన్నారు. ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కరించడమే ధ్యేయంగా పెట్టుకోవాలన్నారు. మనకు ఏ పదవి అయినా అది ప్రజలు ఇచ్చిందేనని భావించాలన్నారు. కనుక ప్రజాసేవ చేస్తూ వారికి రుణపడి ఉండాలన్నారు. ఎమ్మెల్యేలు ఎటువంటి తప్పు చేయరాదన్నారు. తప్పు చేసిన వారిని తాను క్షమించే ప్రసక్తే లేదన్నారు……………………. వైయస్ జగన్ కు ప్రతిపక్ష హోదా ఎలా వస్తుంది? దుష్ప్రచారం మాని దమ్ముంటే అసెంబ్లీకి రావాలి.సీఎం చంద్రబాబు సవాల్. వైసీపీ పాలనలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి నేడు వేదాలు వల్లిస్తున్నారని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు. వైఎస్ జగన్ కు ప్రతిపక్ష హోదా ఎలా వస్తుందని ఎవరిస్తారని ఆయన ప్రశ్నించారు. తనను నాలుగు దపాలు సీఎంను చేసింది, తమ కూటమి ప్రభుత్వానికి అధికారం కల్పించింది ప్రజలేనన్నారు. రాష్ట్రవ్యాప్తంగా వైసిపికి కేవలం 11 స్థానాలు మాత్రమే లభించాయని వీటితో ఆయనకు ప్రతిపక్ష హోదా ఎలా లభిస్తుందన్నారు. జగన్ రాజకీయ పరిజ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారన్నారు. తమ కూటమి ప్రభుత్వం సాధిస్తున్న విజయాలతో వైసిపి ఉనికిని కోల్పోతోందన్నారు. తమ కూటం ప్రభుత్వం పై దుష్ప్రచారం చేయడమే పనిగా పెట్టుకున్నారన్నారు. వైసిపి కార్యాలయాలు మూసివేసి వైసిపి సోషల్ మీడియా కార్యాలయాలు తెరిచి ఫేక్ ప్రచారాలు చేస్తున్నారన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి దేశంలో ఎక్కడా జరగలేదన్నారు. వారి ఐదేళ్ల పాలనలో అరాచకాలు, విధ్వంశాలు మహిళలపై అత్యాచారాలు, దాడులు దౌర్జన్యాలు జరిగాయన్నారు. రాష్ట్రం ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదు అన్నారు. కనుకనే ప్రజలు మార్పు కోరుతూ తమను గెలిపించారన్నారు. జగన్కు బుద్ధి చెప్పడం కోసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారన్నారు. కనుక వైయస్ జగన్ ప్రజలు ఇచ్చిన తీర్పును అంగీకరించాలన్నారు. తమ కూటమి ప్రభుత్వంపై దుష్ప్రచారాలు మానుకోవాలన్నారు. జగన్కు దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలన్నారు. వైసిపి హయాంలో అవినీతికి పాల్పడిన వారిని వదిలే ప్రసక్తే లేదన్నారు. వారు ప్రపంచంలో ఎక్కడ దాక్కున్నా బయటకు తీసుకు వస్తామన్నారు. జగన్ తన పద్ధతి మార్చుకోకుండా ఇలాగే వ్యవహరిస్తే ప్రజలే మరోసారి బుద్ధి చెబుతారన్నారు. కాగా బహిరంగ సభలో సీఎం చంద్రబాబు తో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బిజెపి రాష్ట్ర అధ్యక్షులు మాధవ్, పలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రులు పాల్గొని ప్రసంగించారు.



