ఎరువులు, పురుగుల మందు దుకాణాలపై పోలీసుల ఆకస్మిక తనిఖీలు

జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ ఆదేశాలతో ఎరువులు, పురుగుమందుల దుకాణాలపై ఆకస్మిక తనిఖీలు చేసిన కర్నూలు పోలీసులు
ఎరువుల కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం
ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే రైతులకు ఎరువులు విక్రయించాలి
జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపియస్
కర్నూల్ క్రైమ్ సెప్టెంబర్ 3 యువతరం న్యూస్:
ఎరువుల కృత్రిమ కొరత సృష్టించే వారిని ఉపేక్షించబోమని, వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ హెచ్చరించారు. జిల్లా ఎస్పీ ఆదేశాలతో జిల్లా వ్యాప్తంగా ఉన్న ఎరువులు, పురుగు మందుల దుకాణాలు వాటికి అనుబంధంగా ఉన్న గోదాములను జిల్లా పోలీసు అధికారులు మంగళవారం ఆకస్మిక తనిఖీలు చేశారు.
కోడుమూరు మండలం , బైన్ దొడ్డి గ్రామానికి చెందిన బోయ చిన్న వీరన్న ఇచ్చిన ఫిర్యాదు మేరకు కోడుమూరు పోలీసులు స్ధానిక శ్రీ లక్ష్మీ ఫర్టి లైజర్ షాపును తనిఖీ చేసి ఎరువుల సంచులను, బిల్లు బుక్ లను పరిశీలించారు.
ఎరువుల ధరలు ఎమ్మార్పీ ధర కంటే అధిక రేట్లకు విక్రయిస్తున్నారని కోడుమూరుకు చెందిన శ్రీ లక్ష్మీ ఫర్టి లైజర్ షాపు యజమాని పట్నం క్రిష్ణమూర్తి పై కోడుమూరు ఎస్సై ఎర్రిస్వామి చీటింగ్ కేసు నమోదు చేశారు.
ఈ సంధర్బంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ..
ఇటీవల ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో జిల్లాలో ఎరువుల డిమాండ్ గణనీయంగా పెరగడంతో కొంతమంది వ్యాపారులు తమ స్వలాభం కోసం కృత్రిమ ఎరువుల కొరతను సృష్టించి రైతులను ఇబ్బందులకు గురిచేయవచ్చన్న అనుమానంతో, ముందస్తు చర్యలలో భాగంగా ఈ తనిఖీలు నిర్వహించామన్నారు.
ఈ తనిఖీల్లో ఎరువులు, పురుగుమందుల కొనుగోలు, విక్రయాల వివరాలు, లైసెన్స్ సంబంధించిన పత్రాలు, బిల్లులు మరియు స్టాక్ రిజిస్టర్లను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారన్నారు.
జిల్లాలోని ప్రతి మండలంలో పోలీసు , వ్యవసాయ శాఖల అధికారులతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు.
ఈ తనిఖీలు నిరంతరంగా కొనసాగుతాయన్నారు.
అవసరమైనంత స్టాక్ ఉన్నప్పటికీ రైతులకు ఎరువులు సరఫరా చేయకుండా గోదాముల్లో నిల్వ ఉంచి కృత్రిమ కొరత సృష్టించినా లేదా అధిక ధరలకు విక్రయించినా సంబంధిత వ్యాపారులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.
ఫర్టిలైజర్స్ వ్యాపారులు ఎరువుల కృత్రిమ కొరత సృష్టించరాదని, ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే రైతులకు ఎరువులు విక్రయించాలన్నారు.
స్టాక్ రికార్డులు సక్రమంగా నిర్వహించాలని, స్టాక్ రిజిస్టర్ ప్రకారమే గోదాములు/దుకాణాల్లో ఎరువులు ఉండాలన్నారు. స్టాక్ వివరాలను రైతులకు అర్థమయ్యే రీతిలో నోటీసు బోర్డుపై ప్రదర్శించాలన్నారు.
ప్రభుత్వ నిబంధనలను అతిక్రమిస్తే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.