నంద్యాల జిల్లాకు 9300 మెట్రిక్ టన్నుల యూరియా రాక

నంద్యాల జిల్లాకు 9300 మెట్రిక్ టన్నుల యూరియా రాక
సెప్టెంబర్ 4న 2600, 5న 2600, 10న 2600, 13న 1500 మెట్రిక్ టన్నుల యూరియా రాక
యూరియా సమస్యలపై కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ 08514- 293903 ఏర్పాటు
ఉదయం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు కంట్రోల్ రూమ్ పనిచేస్తుంది
యూరియా పంపిణీ పటిష్టంగా నిర్వహించేలా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ
జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా
నంద్యాల బ్యూరో సెప్టెంబర్ 3 యువతరం న్యూస్:
రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు జిల్లా అవసరాలకు మించి యూరియా కేటాయింపుచేయబడింది. రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదనే విషయాన్ని రైతులకు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా సంబంధిత అధికారులను ఆదేశించారు.
బుధవారం విజయవాడ నుండి రైతులకు యూరియా అవసరాలపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
నంద్యాల జిల్లా కలెక్టరేట్ నుండి జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా తో పాటు జిల్లా ఎస్పీ అది రాజ్ సింగ్ రాణా, జేసి సి. విష్ణు చరణ్ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ… రాష్ట్రంలో ఎక్కడ యూరియా కొరత లేకుండా చేస్తున్నామన్నారు. అన్ని జిల్లాల్లో ఎరువులు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. ప్రతి రైతుకు సకాలంలో యూరియా అందాలన్నారు.
ఎరువులు స్మగ్లింగ్ చేస్తే కఠినంగా ఉంటామని, పది రోజుల్లో 25 వేల మెట్రిక్ టన్ల యూరియా సరఫరా చేశామని పేర్కొన్నారు. రెండు పంటలు వేయడంతో యూరియా వాడకం పెరిగింది. యూరియా అందుబాటుపై కొంతమంది కావాలని విషప్రచారం చేస్తున్నారని, అయితే అన్ని జిల్లాల్లో ఎరువులు అందుబాటులో ఉన్నాయన్న విషయంపై రైతులు అవగాహన పెంచుకోవాలన్నారు. ఎరువులు పక్కదారి పట్టకుండా అక్రమంగా తరలిపోకుండా పటిష్టమైన నిఘా ఏర్పాటు చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. ఈ సందర్భంగా ఆయా అంశాలలో తీసుకోవాల్సిన చర్యలపై దిశా నిర్దేశం చేశారు.
వీడియో కాన్ఫరెన్స్ అనంతరం అధికారులతో కలెక్టర్ మాట్లాడుతూ… ఈనెల 1న ఒరిస్సా పోర్టు నుంచి బయలుదేరిన 2600 మెట్రిక్ టన్నుల యూరియా నేడు జిల్లాకు చేరాల్సి ఉందని… ఇది రేపు ఉదయానికి జిల్లాకు చేరుతుందన్నారు. ఈ మేరకు…
సెప్టెంబర్ 4న 2600 మెట్రిక్ టన్నులు, 5న 2600, 10న 2600, 13న 1500 — మొత్తంగా 9300 మెట్రిక్ టన్నుల యూరియా జిల్లాకు రానున్నదని తెలిపారు.
ఈనెల 4, 5 తేదీల్లో జిల్లాకు వచ్చే 5200 మెట్రిక్ టన్నులలో 3500 మెట్రిక్ టన్నులు రైతు సేవా కేంద్రాల్లో , 1700 మెట్రిక్ టన్నులు ప్రైవేట్ డీలర్ల వద్ద అందుబాటులో ఉంటాయి.
రైతు సేవా కేంద్రాలు, ప్రాథమిక వ్యవసాయ పరపతి కేంద్రాలు, ప్రైవేట్ డీలర్ల ద్వారా యూరియా పంపిణీని పటిష్టంగా నిర్వహించేలా సంబంధిత అధికారులకు జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గణియా ఆదేశాలు జారీ చేశారు.
యూరియాను అక్రమంగా తరలించకుండా జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పోలీసులు పటిష్ట నిఘా ఏర్పాటు చేయాలని సూచించామన్నారు.
యూరియా సరఫరా/పంపిణీపై ఏవైనా సమస్యలు తలెత్తినట్లయితే, నంద్యాల కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ ఫోన్ నంబర్: 08514-293903 కు సమాచారం అందించవచ్చునన్నారు.
ఈ కంట్రోల్ రూమ్ సెప్టెంబర్ 4 నుండి ప్రతిరోజూ ఉదయం 6 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు పనిచేస్తుంది.
యూరియా అందుబాటుపై రైతులు ఎవ్వరు ఎలాంటి ఆందోళనలు చెందాల్సిన దాల్సిన అవసరం లేదని, రైతులందరూ ఈ విషయంలో సహకరించాలని కలెక్టర్ పేర్కొన్నారు.
జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా మాట్లాడుతూ… యూరియా పై పటిష్టమైన నిఘా ఏర్పాటు చేయడం జరుగుతోందని, ఎవరైనా అక్రమంగా తరలిస్తే కేసులు నమోదు చేస్తామన్నారు. పోలీసు శాఖ ఆయా శాఖల అధికారులతో సమన్వయం చేసుకొని యూరియా పంపిణీ సక్రమంగా జరిగేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు.